వాట్సాప్ పేటీఎంలా, పేటీఎం వాట్సాప్‌లా మార‌నున్న జంబ‌ల‌కిడి పంబ స్టోరీ

ఇండియాలో ఒక యాప్‌ను ఒక ప‌ర్ప‌స్ కే వాడుతున్నాం. మెసేజ్ యాప్ వాట్సాప్‌తో మెసేజ్ మాత్ర‌మే చేస్తాం. రీఛార్జిలు, బిల్ పేమెంట్స్ చేసే పేటీఎం, ఫ్రీఛార్జిలాంటి వాటిని వాటికే ఉప‌యోగిస్తాం. అయితే చైనీస్ యాప్ వి-చాట్  మాత్రం ఈ రెండూ క‌లిపి చేస్తోంది. బేసిక‌ల్‌గా చాట్ యాప్ అయిన వి- చాట్ మూవీ టికెట్స్ బుక్ చేసుకోవ‌డానికి, క్యాబ్ బుకింగ్ వంటి వాటికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్నే క‌న్వ‌ర్సేష‌న‌ల్ కామ‌ర్స్ అంటున్నారు. ఇండియాలోనూ యాప్స్‌కు ఇలా రెండు ర‌కాలుగా వాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. వాట్సాప్‌, పేటీఎం లాంటివి దీనిలో కొద్దిగా ముందున్నాయి. 
 క్యాష్‌కు చాట్‌ను యాడ్ చేయ‌డం  (adding chat to cash)
 Paytm త‌న యాప్‌లో చాట్ ఫీచ‌ర్‌ను ఇంటిగ్రేట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తోంది.  అయితే ఇండియాలో కొన్ని కోట్ల మందికి అత్యంత ద‌గ్గ‌రైపోయిన వాట్సాప్‌ను బ్రేక్ చేసి చాట్ యాప్‌గా పేటీఎం ఎంత వ‌ర‌కు క్లిక్క‌వుతుందో చూడాలి. ఎందుకంటే వాట్సాప్ కంటే ముందు WeChat, Line,  Hike లాంటి మెసెంజ‌ర్ యాప్‌లు ఇండియాలో  పాగా వేయ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేశాయి. ఫ్రీ టాక్‌టైం లాంటి ఆఫ‌ర్లు పెట్టి ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నించాయి. అయితే వాట్సాప్ అలాంటి ఆఫ‌ర్లేమీ లేకుండానే జ‌నంలోకి బాగా పెనిట్రేట్ అయింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్స్‌తో అప్‌డేట్ అవుతూ దూసుకుపోతుంది.  పేటీఎం కూడా త‌న చాట్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకుంటే క్యాష్‌బ్యాక్‌లు ఇవ్వ‌డం వంటివి పెట్టే అవ‌కాశాలున్నాయి.   
చాట్‌కు క్యాష్‌ను యాడ్ చేయ‌డం  (adding cash to chat) 
మ‌రోవైపు వాట్సాప్.. పేటీఎంలా పేమెంట్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది.  వాట్సాప్ యూపీఐని ఇంటిగ్రేట్ చేసింది. అంతేకాదు వాట్సాప్ య‌జ‌మాని అయిన ఫేస్‌బుక్ కూడా  వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ ద్వారా మానిటైజేష‌న్ చేయ‌డానికి చాలా ఆస‌క్తిగా ఉంది. ఈ విష‌యంలో వాట్సాప్ స‌క్సెస్ అవ‌డానికి చాలా అవ‌కాశాలున్నాయి.  ఎందుకంటే ఇండియాలో ఉన్న దాదాపు ప్ర‌తి స్మార్ట్‌ఫోన్లోనూ  వాట్సాప్ ఉంటుంది.  ఇంత పెద్ద యూజ‌ర్ బేస్ ఉంది కాబ‌ట్టి పేమెంట్ ఆప్ష‌న్లు పెడితే బాగానే స‌క్సెస్ కావ‌చ్చు. అయితే మ‌ర్చంట్స్‌, కంపెనీల‌ను త‌న పేమెంట్ ఫ్లాట్‌ఫారం మీద‌కు తీసుకురావ‌డంలో ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అయితే వాట్సాప్‌.. పేమెంట్స్ యాప్ అంత స‌క్సెస్ అవుతుంది.  పేటీఎంలో ఎయిర్‌టెల్ బిల్ పేమెంట్ లేదా రీఛార్జికి అవ‌కాశం లేదు. 

ఎవ‌రికెంత స్కోప్‌? 
పేటీఎంకు వంద‌ల మంది మ‌ర్చంట్స్‌, కంపెనీల‌తో టై అప్ ఉంది. అదే దానిబ‌లం.  అందువ‌ల్ల చాట్ ఆప్ష‌న్ ఉప‌యోగించుకునేవారికి క్యాష్‌బ్యాక్‌లిచ్చి ఎట్రాక్ట్ చేయాలంటే పేటీఎంకు చిటికెలో ప‌ని. మ‌రోవైపు వాట్సాప్‌కు ఇండియాలో 20 కోట్ల‌కు పైగా యూజ‌ర్లున్నారు. అదే దాని స్ట్రెంగ్త్‌. కాబ‌ట్టి దీన్ని ఉప‌యోగించుకుని కంపెనీలు, మ‌ర్చంట్స్‌ను ర‌ప్పించుకోగ‌లిగితేనే వాట్సాప్ పేమెంట్స్ ఫీచ‌ర్ క్లిక్క‌వుతుంది.  

WhatsApp Facebook adding chat to cash adding cash to chat వాట్సాప్ ఫేస్‌బుక్‌ చాట్‌ పేమెంట్స్‌ Â