టెక్ ప్ర‌పంచం.. ఐఫోన్‌కు ముందు ఐఫోన్ త‌ర్వాత‌..

యాపిల్ ఐఫోన్ ఎప్పుడైతే ప్ర‌పంచంలోకి అడుగుపెట్టిందో కానీ మొత్తం టెక్ ప్ర‌పంచ‌మే మారిపోయింది. టెక్నాల‌జీలో కొత్త మార్పుల‌కు నాంది ప‌డింది. యాపిల్ ఐఫోన్ స్థాయిని అందుకోవ‌డానికి మిగిలిన కంపెనీలు కూడా పోటీప‌డ‌డం ప్రారంభించాయి. కొత్త కొత్త ఉత్ప‌త్తుల‌తో పోటీకి దిగాయి. దీని వ‌ల్ల టెక్ ప్ర‌మాణాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఐఫోన్ రంగంలోకి దిగాక యూజ‌ర్ల ఆలోచ‌న‌ల్లో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. టెక్నాల‌జీకి త‌గ్గ‌ట్టుగా ఎవ‌రికి వారు త‌మ‌ను తాము మార్చుకున్నారు. యాపిల్ ఐఫోన్ ప్రారంభ‌మై 10 ఏళ్లు నిండుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రి ఐఫోన్ తెచ్చిన మార్పులేమిటో చూద్దామా...


జేబులోనే ఇంట‌ర్నెట్‌
ఒక‌ప్పుడు ఇంట‌ర్నెట్ వాడాలంటే కంప్యూట‌ర్ ఆన్ చేయాల్సిందే. లేదా లాప్‌టాప్‌ను ఉప‌యోగించాల్సిందే. అయితే ఐఫోన్ వ‌చ్చాక ఈ ట్రెండ్ మారింది. మ‌నం ఎక్క‌డ ఉన్నా.. ఏ స్థితిలో ఉన్నా ఇంట‌ర్నెట్‌ను ఉప‌యోగించుకునే అవ‌కాశం వ‌చ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే జేబుల్‌లోనే ఇంట‌ర్నెట్ వ‌చ్చేసింది. మొబైల్ ఇంట‌ర్నెట్‌కు నాంది ప‌లికిన ఘ‌న‌త యాపిల్ ఐఫోన్‌దే. ఆ త‌ర్వాత మిగిలిన ఫోన్లు కూడా స్మార్ట్‌ఫోన్ల‌ను త‌య‌రు చేసి ఇంట‌ర్నెట్ వాడే అవ‌కాశాన్ని క‌ల్పించాయి. 


ఫొటోగ్ర‌ఫీ హాబీగా మారిపోయింది
కొంత కాలం వ‌ర‌కు ఫొటో తీయాలంటే మంచి కెమెరా కావాల్సి వ‌చ్చేది. ఆ కెమెరాను భుజాన వేలాడేసుకుని అన్ని చోట్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. కానీ యాపిల్ ఐఫోన్ బ‌రిలో దిగాక ఫొటో తీయ‌డం చాలా సుల‌భం అయిపోయింది గొప్ప పిక్స‌ల్స్ ఉన్న కెమెరాల‌తో ఐఫోన్లు అందుబాటులో రావ‌డంతో అంద‌మైన‌, అద్బుత‌మైన ఫొటోలు తీయ‌డం చిటికెలో ప‌నిగా మారిపోయింది.

ఆక‌ట్టుకునే యాప్ స్టోర్‌
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఎన్నో యాప్‌లు ఉప‌యోగిస్తాం. అయితే కొన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేయ‌గానే మెమరీ అయిపోతుంది. కానీ ఐఫోన్ దీనికి భిన్నం. దీనిలో ఒకేసారి వంద‌ల సంఖ్య‌లో యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఒక‌ప్పుడు 500 యాప్‌ల వ‌ర‌కు డౌన్‌లోడ్ చేసుకునే  వీలుండేది. ఇప్పుడు 1మిలియ‌న్ల వ‌ర‌కు డౌన్‌లౌడింగ్ కెపాసిటీ కూడా వ‌చ్చేసింది. దీని వ‌ల్ల ఎక్కువ యాప్‌ల‌ను ఫోన్‌లో పెట్ట‌కునే అవ‌స‌రం అయిన‌ప్పుడు వాడుకునే అవ‌కాశం వ‌చ్చింది. 

ప‌నితీరును మార్చేసింది
ఐఫోన్ మ‌నుషుల జీవితాల్లోనూ ఎన్నో మార్పులు తెచ్చింది. ప‌ని తీరును బాగా మార్చేసింది. ఇప్పుడు అంద‌రూ స్మార్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఏ ప‌ని చేయాల‌న్నా ఇంట‌ర్నెట్ సాయంతో సుల‌భంగా చేసేస్తున్నారు. ముఖ్యంగా జీపీఎస్ వ‌చ్చాక ప‌రిస్థితి మొత్తం ఛేంజ్ అయింది. ఉబ‌ర్‌, ఓలా క్యాబ్‌లు న‌డుస్తోంది ఈ జీపీఎస్ ద్వారానే. ఇవే కావు ఎన్నో స్టార్టప్‌లు జీపీఎస్ ఆధారంగా చేసుకుని కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నాయి.

చిన్న చిన్న విష‌యాల్లోనూ..
మ‌నకు ఏదైనా వ‌స్తువు అవ‌స‌రం అయితే షాప్‌కు వెళ‌తాం.. జ‌నం ఎక్కువ ఉంటే స‌మ‌యం ప‌డుతుంది. అదే పెద్ద స్టోర్‌కు వెళ్లినా బిల్ చెల్లించ‌డానికి క్యూలో నించోవాల్సిందే.  అయితే ఆన్‌లైన్ షాపింగ్ వ‌ల్ల మ‌న స‌మ‌యం వృథా కాకుండా ఉండ‌డ‌మే కాక‌.. ఎన‌ర్జీ కూడా సేవ్ అవుతుంది.  అంతేకాదు ఆఫ‌ర్ల వ‌ల్ల మ‌నీ కూడా ఆదా చేసుకునే అవ‌కాశం ఉంది. 

అంద‌రూ సోష‌ల్ అయిపోయారు
ఐఫోన్ తెచ్చిన విప్ల‌వం వ‌ల్ల మ‌నుషులంద‌రూ సోష‌ల్ అయిపోయారు. ఎల్ల‌లు చెరిగిపోయాయి. మ‌నుషుల మ‌ధ్య బంధాలు పెరిగాయి. ఎప్పుడూ చిన్న‌ప్పుడు మ‌న‌ను విడిచిపెట్టి వెళ్లిన స్నేహితుడు, మ‌న‌కు దూరంగా విదేశాల్లో ఉండే స‌న్నిహితులు ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ సైట్ల వ‌ల్ల బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అంతేకాదు ప్ర‌తి విష‌యంపై చ‌ర్చ‌లు పెరిగాయి. అవ‌గాహ‌న బాగా పెరిగింది.

ఇంట‌ర్నెట్ అడ్వ‌ర్టెజ్‌మెంట్
మ‌న‌కు ఒక‌ప్పుడు అడ్వ‌ర్టెజ్‌మెంట్లు అంటే టీవీల్లోనో లేదా రేడియో, పేప‌ర్ల‌లో  క‌నిపించేవి, వినిపించేవి మాత్ర‌మే. కానీ ఐఫోన్ రాక‌తో ట్రెండ్ మారింది.  మొబైల్స్‌లోనూ నెట్ వినియోగం బాగా పెర‌డంతో  ఇంట‌ర్నెట్‌లో అడ్వ‌ర్టేజ్‌మెంట్లు చేసేవాళ్లు ఎక్కువ‌య్యారు. యూట్యూబ్ లాంటి దిగ్గ‌జం ఇలా అడ్వ‌ర్టేజ్‌మెంట్ల‌ను పెడుతూ కోట్ల‌కు కోట్లు యాడ్ రెవిన్యూ సంపాదిస్తోంది. 

Apple iPhone change world 10 years internet software అడ్వ‌ర్టెజ్‌మెంట్ విప్ల‌వం ఫేస్‌బుక్ యాప్ స్టోర్‌ ఫొటోగ్ర‌ఫీ టెక్నాల‌జీ