వన్ ప్లస్ 5 ఫోన్ కు రెండు రోజుల్లో 3 లక్షల రిజిస్ట్రేషన్లు

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ త్వరలో అమ్మకానికి పెట్టనున్న వన్ ప్లస్ 5 స్మార్టు ఫోన్ కు విక్రయానికి ముందే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దీని రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టిన తరువాత కేవలం రెండు రోజుల్లోనే 3 లక్షల మందికి పైగా ప్రీ ఆర్డర్లు చేయడం విశేషం.
జూన్ 22న భారత్ లో లాంచింగ్
చైనాలో వన్ ప్లస్ 5 ను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. నెల 22వ తేదీన భారత్‌లో ఓ ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తూ మన దగ్గర కూడా ఈ ఫోన్‌ను వన్ ప్లస్ విడుదల చేయనుంది. ఇంత పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు రావడంలో కంపెనీ ఉబ్బితబ్బిబ్బవుతోంది.
అచ్చం ఒప్పో ఆర్ 11 డిజైనే?
కాగా వన్ ప్లస్ మాతృసంస్థ ఒప్పోకు చెందిన ఆర్11 స్మార్టు ఫోన్ డిజైన్ మాదిరిగానే వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతున్నా దీనిపట్ల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
రూ.32 వేల ధరకు
ఇక వన్ ప్లస్ 5లో ఫీచర్ల పరంగా చూస్తే స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, వెనుక భాగంలో రెండు కెమెరాలు, పెద్ద బ్యాటరీని ఉంటాయని అంచనా. ధర రూ.32 వేలని తెలుస్తోంది.

oppo r 11 one plus 5 3 lakhs registrations ఒప్పో ఆర్ 11 వన్ ప్లస్ 5 3 లక్షల రిజిస్ర్టేషన్లు