యాపిల్ నుంచి ఆ ఇండియన్ ఇంజినీర్ ను గూగుల్ కొనేసింది..

ఐఫోన్లకు ధీటుగా గూగుల్ తన సొంత బ్రాండులో పిక్సెల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐఫోన్లకు మరింత పోటీనిచ్చేందుకు గూగుల్ తీసుకురానున్న ఫ్లాగ్ షిప్ పిక్సెల్ ఫోన్ కోసం యాపిల్ లో అత్యంత కీలకంగా పనిచేసే ఇంజినీర్ ను తన సంస్థలోకి తీసుకుంది. ఐఫోన్ల, ఐప్యాడ్ ల చిప్ ఆర్కిటెక్ట్ అయిన భారత సంతతి ఇంజనీర్ మను గులాటిని గూగుల్ తన కంపెనీలోకి నియమించుకుంది.
యాపిల్ కు నష్టమే
మైక్రో-ఆర్కిటెక్ట్ గా ఎనిమిదేళ్లుగా గులాటి యాపిల్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన గూగుల్ లో లీడ్ ఎస్ఓసీ ఆర్కిటెక్ట్ గా చేరారు. ప్రస్తుతం గులాటి యాపిల్ నుంచి బయటికి వచ్చేయడం ఆ కంపెనీకి గట్టి ఎదురుదెబ్బేనని సిలికాన్ వ్యాలీలో వినికిడి.
పేటెంట్లన్నీ ఆయన వద్దే
మరోవైపు గులాటీ వద్ద చిప్ లకు సంబంధించి చాలా పేటెంట్లు ఉన్నాయట. అంతేకాక వాటి వ్యవస్థాపకుడిగా గులాటికే క్రెడిట్ అంతా దక్కుతోంది. చిప్ డిజైన్ లో ఆయన 15 యాపిల్ పేటెంట్ రైట్లను కలిగి ఉన్నారు. గూగుల్ సొంతంగా ఓ ప్రాసెసర్ ను అభివృద్ధి చేయాలని ప్లాన్ వేస్తోంది. తర్వాతి పిక్సెల్ స్మార్ట్ ఫోన్లకు సొంత చిప్ సెట్ల కోసం చిప్ నిపుణుల టీమ్ ను కూడా కంపెనీ భారీగా పెంచుతోంది. అందులో భాగంగానే గులాటీని తన కంపెనీలో నియమించుకుంది.
గులాటీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చూడండి
2010ఐప్యాడ్ ఏ4, ఏ9 చిప్ లకు గులాటినే బాధ్యత వహించేవారు. గులాటి అంతకముందు బ్రాడ్ కామ్, ఏఎండీల్లో కూడా పనిచేశారు. గులాటి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో ఆయన గూగుల్ లో చేరినట్లు అప్ డేట్ చేశారు. గూగుల్ లీడ్ ఎస్ఓసీ ఆర్కిటెక్ట్ అని అందులో ఉండడంతో ఒక్కసారిగా ఈ విషయం సిలికాన్ వ్యాలీలో స్ప్రెడ్ అయింది.

apple google sillicon valley manu gulati chip యాపిల్ మను గులాటీ గూగుల్ పిక్సెల్ చిప్స్