"ఏ.ఐ మనుషుల కంటే తెలివిగా మారి, ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు" .. "ఏ.ఐ వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీనిని అణుయుద్ధం (Nuclear War) లాంటి విపత్తుతో సమానంగా చూడాలి".. ఇవి సామాన్యులెవరో చెబుతున్న మాటలు కాదు. స్వయంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని సృష్టించిన శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలు. ఏఐ వల్ల ప్రపంచానికి ముప్పు ఉందని స్వయంగా దానిని రూపొందించిన వారే హెచ్చరించడం అందరిలోనూ ఆందోళన కలగజేస్తోంది. ఏఐ వల్ల భవిష్యత్తులో ప్రపంచానికి కలిగే ప్రమాదాన్ని వీరు తొలి దశలోనే అంచనా వేయలేకపోయారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. అసలు ఇప్పుడు ఏఐ వెనుక ఏం జరుగుతోంది? ఏఐ సృష్టికర్తల భయం ఎందుకు అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం!
సృష్టికర్తలు.. హెచ్చరికలు
+ జెఫ్రీ హింటన్ (Geoffrey Hinton): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్త, నోబెల్ బహుమతి విజేత జెఫ్రీ హింటన్. ఆయన ఏఐ గురించి ఏమన్నారంటే..
మనుషులను తుడిచి పెట్టేయొచ్చు: ఒకవేళ మనం ఏఐకి "భూమిపై కార్బన్ డయాక్సైడ్ (CO2) శాతాన్ని తగ్గించు" అని ఒక పర్యావరణ టాస్క్ ఇస్తే.. అది మనుషుల వల్లే కార్బన్ పెరుగుతోందని గ్రహించి, ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం మనుషులనే పూర్తిగా భూమిపై నుండి తొలగించాలని నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంది అని వివరించారు.
ఏఐని నియంత్రించలేం: "మానవ చరిత్రలో తక్కువ తెలివి ఉన్న ప్రాణి, ఎక్కువ తెలివి ఉన్న ప్రాణిని నియంత్రించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదు. రేపు ఏఐ మనకంటే తెలివిగా మారినప్పుడు మనం దాన్ని అస్సలు కంట్రోల్ చేయలేము" అని ప్రశ్నించారు.
+ సామ్ ఆల్ట్‌మన్, డారియో అమోడీ (OpenAI & Anthropic CEOs): ప్రస్తుత మార్కెట్‌ను ఏలుతున్న ChatGPT మరియు Claude ఏఐలను తయారు చేసిన ఇద్దరు సీఈవోలు. ఐక్యరాజ్యసమితి (UN Security Council) వేదికపై వీరు ఏం చెప్పారంటే..
గ్లోబల్ వాచ్‌డాగ్ ఉండాలి: ఏఐ అనేది ఏ ఒక్క దేశానికో పరిమితమైనది కాదు. అణు ఆయుధాల లాగే దీనిని నియంత్రించడానికి ఒక గ్లోబల్ వాచ్‌డాగ్ (అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థ) ఉండాలి. ప్రపంచ దేశాలన్నీ కలిసి దీనిపై అంతర్జాతీయ చట్టాలు చేయకపోతే భవిష్యత్తులో ఏఐ అదుపు తప్పుతుంది.. అని స్పష్టం చేశారు.
ఏఐ.. అణుయుద్ధంతో సమానం: ఏఐ వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీనిని అణుయుద్ధం (Nuclear War) లాంటి మహమ్మారితో సమానంగా చూడాలి అని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
అంచనా ఎందుకు తప్పింది?
అనూహ్యమైన వేగం: ఏఐ సాంకేతికత ఇంత వేగంగా మానవ మేధస్సును అధిగమిస్తుందని సృష్టికర్తలు, శాస్త్రవేత్తలు ఊహించలేదు. రాబోయే ఐదు నుండి పదేళ్లలో ఏఐ మానవ మేధస్సును మించిపోవచ్చని గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ అయిన జెఫ్రీ హింటన్ వంటి వారు భయపడుతున్నారు.
ఏఐ కార్పొరేట్ రేస్
ఒకవైపు "ఏఐ వల్ల ప్రపంచం అంతమైపోతుంది" అని హెచ్చరిస్తున్న టెక్ దిగ్గజ కంపెనీలు.. తెరవెనుక మాత్రం బిలియన్ల డాలర్ల పెట్టుబడులతో రేసులో పోటీ పడుతున్నాయి.
లాభాల వేట: ఓపెన్ ఏఐ (OpenAI), గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా మరియు ఎలాన్ మాస్క్ (xAI) ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఏ ఒక్క కంపెనీ కూడా పరిశోధనలు ఆపడం లేదు. భద్రతా ప్రమాణాల కంటే వేగంగా ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తేవడానికే ప్రాధాన్యమిస్తున్నాయి.
నిజమైన భయం ఏంటి?: ఏఐ కోసం సరైన చట్టాలు మరియు నియంత్రణలు (Regulations) తీసుకురావాలని ఈ కంపెనీల సీఈవోలు కోరుతున్నారు. అయితే దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటంటే.. భవిష్యత్తులో కొత్తగా వచ్చే చిన్న స్టార్టప్‌లు తమకు పోటీ కాకుండా అడ్డుకోవడమే అనే విమర్శలు కూడా లేకపోలేదు.
ఏఐ వెనుక ఇప్పుడు ఏం జరుగుతోంది?
ఇప్పటివరకు మనం అడిగిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి వెతికి ఇచ్చేది Generative AI అదే మన ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏఐ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
మనుషుల్లా ఆలోచన (Reasoning): సరికొత్త AI మోడల్స్ (ఉదాహరణకు OpenAI o1, o3 సిరీస్, ChatGPT, Claude, Gemini) కేవలం అడిగిన వాటికి సమాధానాలు మాత్రమే ఇవ్వడం లేదు. ఒక మనిషి లాగా స్టెప్-బై-స్టెప్ ఆలోచించి, తప్పులను సరిదిద్దుకుంటూ క్లిష్టమైన సైన్స్, మ్యాథ్స్ సమస్యలను పరిష్కరిస్తున్నాయి. వాటి అంతట అవే కోడింగ్ రాసుకోవడం, తార్కికంగా ఆలోచించడం (Reasoning) నేర్చుకుంటున్నాయి.
AGI వైపు అడుగులు: మానవుడి మేధస్సుతో సమానమైన AGI (Artificial General Intelligence) సాధించడానికి టెక్ కంపెనీలు చాలా వేగంగా దూసుకుపోతున్నాయి. ఇది కేవలం ఇచ్చిన పని చేయడమే కాకుండా, మనుషుల కంటే సొంతంగా ఆలోచించగలదు. ఇదే ఇప్పుడు సృష్టికర్తలను భయపెడుతున్న ప్రధానాంశం.
నియంత్రణ అసాధ్యం: ఏఐ వ్యవస్థలు స్వయంగా ఆలోచించడం, కోడింగ్ రాసుకోవడం మొదలుపెడితే, అవి మానవుల నియంత్రణ నుంచి తప్పించుకునే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో మిలిటరీ, బ్యాంకింగ్, పవర్ గ్రిడ్స్ లాంటి కీలక వ్యవస్థలను AI నియంత్రణలోకి తీసుకుంటే, అది తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలను మనుషులు కూడా ఆపలేరని భయపడుతున్నారు.
చట్టాలు లేవు: ఒకవేళ ఏఐకి ఇచ్చిన లక్ష్యం మానవాళి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే, దాన్ని నియంత్రించడం అసాధ్యం కావచ్చు. ఏఐని కంట్రోల్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా సరైన చట్టాలు లేదా నిబంధనలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.
ఏఐ వల్ల ప్రధాన భయాలు ఏంటి?
ఉపాధి కోల్పోవడం: కోట్లాది మంది ఉద్యోగాలకు ముప్పు రావడం. భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఆర్థిక అసమానతలు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా సామాజిక అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. కేవలం ఐటీలోనే కాదు, కంటెంట్ రైటింగ్, కస్టమర్ సపోర్ట్, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి రంగాల్లో ఏఐతో ఉద్యోగాల కోల్పోయే ప్రమాదం ఉంది.
డీప్‌ఫేక్స్ (Deepfakes): నిజమేదో, అబద్ధమేదో తెలియని విధంగా ఏఐ ఉపయోగించి ఆడియో, వీడియోలను సృష్టించడం ద్వారా సమాజంలో అరాచకాలు సృష్టించే ప్రమాదం ఉంది.
నిజంపై నమ్మకం పోవడం: మార్కెట్లో నకిలీ కంటెంట్ ఎంతగా పెరిగిపోతుందంటే, భవిష్యత్తులో నిజమైన వార్తలను లేదా ఆధారాలను కూడా ప్రజలు నమ్మలేని స్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.
వ్యక్తిగత అభద్రత, సైబర్ నేరాలు: ఫొటోలను అసభ్యకరంగా మార్చేందుకు కొందరు ఏఐని వాడుతున్నారు. అలాగే, ఒక కంపెనీ CEO వాయిస్‌ని ఏఐతో ఇమిటేట్ చేసి మేనేజర్లను మోసం చేసే ఆర్థిక నేరాలు (CEO Fraud) కూడా పెరుగుతున్నాయి.
స్వయం ప్రతిపత్తి ఆయుధాలు: మనుషుల ప్రమేయం లేకుండా దాడులు చేసే ఏఐ ఆధారిత ఆయుధాలు యుద్ధ రంగంలోకి వస్తే జరిగే నష్టం ఊహాతీతం.
గ్లోబల్ ఆర్మ్స్ రేస్ (Global Arms Race): ఒక దేశం కంటే మరో దేశం ముందే ప్రమాదకరమైన ఏఐ సైన్యాన్ని నిర్మించుకోవాలని పోటీ పడితే, అది నియంత్రణ లేని సరికొత్త ప్రపంచ యుద్ధానికి (Cyber and Kinetic warfare) దారి తీస్తుంది.
కొన్ని దేశాలు అలర్ట్
ఏఐ సృష్టికర్తల హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి.
యూరోపియన్ యూనియన్ (EU AI Act): ప్రపంచంలోనే మొదటిసారిగా AI ని నియంత్రించడానికి కఠినమైన చట్టాన్ని తెచ్చింది.
భారతదేశం (India's Stand): మనదేశం కూడా ఏఐ వల్ల వచ్చే డీప్‌ఫేక్స్, సైబర్ మోసాలు మరియు కాపీరైట్ ఉల్లంఘనలను అడ్డుకోవడానికి ప్రత్యేక డిజిటల్ చట్టాలను రూపొందిస్తోంది.
ఏఐ అనేది మానవ మేథస్సుకు ఒక అద్భుత పరీక్ష. ఈ శక్తివంతమైన సాంకేతికతను నియంత్రణతో వాడుకుంటే అది మన భవిష్యత్తుకు వరం అవుతుంది, లేదంటే మానవాళి మనుగడకే ముగింపు అవుతుంది.
artificial intelligence artificial intelligence threat ai global ai threat to humanity ai fear future of ai anthropic ai generativeAI AGI Artificial General Intelligence AIRisks Deepfakes FutureOfHumanity AICreators AIWarnings