ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇష్టానుసారంగా ఉద్యోగులను ఎప్పుడు పడితే అప్పుడు పీకేస్తూ వారి భవిష్యత్‌ను అగాథంలో పడేస్తున్నాయి. "మనకు లేబర్ చట్టాలు వర్తించవు, కంపెనీ ఏం చెబితే అది వినాల్సిందే, సంతకం పెట్టి బయటకు రావాల్సిందే" అనే అభిప్రాయం సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఉంది. కానీ భారత కార్మిక చట్టాల ప్రకారం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కూడా బలమైన చట్టపరమైన హక్కులు (Legal Rights) ఉన్నాయి. ముందస్తు హెచ్చరిక లేకుండా ఉద్యోగం నుంచి పీకేయడం, లే ఆఫ్స్ సమయాల్లో ఉద్యోగులకు ఇవి రక్షణగా నిలుస్తున్నాయి. కంపెనీలు ప్లే చేసే మైండ్ గేమ్స్ నుండి మిమ్మల్ని కాపాడే ఆ హక్కులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఉద్యోగుల మొదటి రక్షణ కవచం
చట్టం: షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ మరియు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, 1947
ఏం చెబుతుంది: ఆయా రాష్ట్రాల షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ ప్రకారం.. ఏ కంపెనీ కూడా సరైన కారణం లేకుండా (Right Against Arbitrary Dismissal) లేదా ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఉద్యోగిని నేరుగా తొలగించడానికి వీల్లేదు.
కంపెనీ ఏం చేయాలి: ఒకవేళ వివిధ కారణాలతో మిమ్మల్ని తక్షణమే తీసేయాలనుకుంటే, ఉద్యోగ ఒప్పందం (Employment Contract) లో పేర్కొన్న నోటీస్ పీరియడ్ అంటే ఒకటి నుంచి మూడు నెలలకు సమానమైన జీతాన్ని (Severance Pay) నష్టపరిహారంగా కంపెనీ వెంటనే చెల్లించాలి.
జీతం ఆపడం చట్టవిరుద్ధం.. FNF మీ హక్కు!
చట్టం: Payment of Wages Act, 1936.
ఏం చెబుతుంది: ప్రతి ఉద్యోగికి వారు చేసిన పనికి నెలాఖరున సరైన సమయానికి జీతం పొందే హక్కు ఉంది. ప్రాజెక్టులు లేవనో, నష్టాలు వచ్చాయనో జీతాలు ఆపేయడానికి వీల్లేదు.
కంపెనీ ఏం చేయాలి: ఉద్యోగం నుంచి తీసేసినప్పుడు లేదా ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు కంపెనీ ఇవ్వాల్సిన పూర్తి బాకీ (Full and Final Settlement) ని నిర్దేశిత గడువులోగా చెల్లించాలి.
గ్రాట్యుటీని మాత్రం ఆపలేరు
చట్టం: Payment of Gratuity Act, 1972.
ఏం చెబుతుంది: ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎవరైనా ఉద్యోగి సమగ్రంగా 4 సంవత్సరాల 240 రోజులు (సాధారణ పరిభాషలో 5 ఏళ్లు) పనిచేసిన వారికి కంపెనీ తరపున లాయల్టీ బోనస్‌గా 'గ్రాట్యుటీ' డబ్బులు లభిస్తాయి.
కంపెనీ ఏం చేయాలి: కంపెనీ నష్టాల్లో ఉండి క్లోజ్ చేస్తున్నా, ఉద్యోగి రాజీనామా చేసినా.. ఒకే సంస్థలో 4 సంవత్సరాల 240 రోజులు పూర్తి చేసిన ఉద్యోగికి గ్రాట్యుటీ నిధులు ఇవ్వాలి.
పీఎఫ్ గేమ్స్ చెల్లవు
చట్టం: Employees' Provident Funds Act, 1952.
ఏం చెబుతుంది: మీ శాలరీ నుండి కట్ అయిన పీఎఫ్ వాటాను, కంపెనీ తన వాటాతో కలిపి EPFO అకౌంట్‌లో సకాలంలో జమ చేయాలి. ఒకవేళ కంపెనీ ఆ డబ్బును జమ చేయకుండా వాడుకుంటే అది క్రిమినల్ నేరం (Criminal Breach of Trust) కిందకు వస్తుంది. దీనిపై నేరుగా పీఎఫ్ కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
48 గంటలు దాటితే.. ఓటీ ఇవ్వాల్సిందే
చట్టం: Shops and Establishments Act (ఆయా రాష్ట్రాల నిబంధనలు).
ఏం చెబుతుంది: సాధారణంగా ఒక ఐటీ ఉద్యోగి రోజుకు 8 నుండి 9 గంటలు (వారానికి 48 గంటలు) మాత్రమే పనిచేయాలి.
కంపెనీ ఏం చేయాలి: సాధారణంగా వారికి 48 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేయించుకుంటే, కంపెనీ చట్టప్రకారం ఓవర్‌టైమ్ (Overtime Allowance) చెల్లించాల్సి ఉంటుంది. (అయితే చాలా ఐటీ కంపెనీలు దీనిని మేనేజ్మెంట్ క్లాజులతో బైపాస్ చేస్తుంటాయి).
మహిళలకు ప్రత్యేక హక్కులు
చట్టం: ప్రసూతి సెలవులు (Maternity Benefit Act)
ఏం చెబుతుంది: గర్భవతి అయిన మహిళా ఉద్యోగికి 26 వారాల (6 నెలలు) పూర్తి జీతంతో కూడిన ప్రసూతి సెలవులు పొందే చట్టబద్ధమైన హక్కు ఉంది. ఈ కాలంలో ఆమెను ఉద్యోగం నుండి తీసేయడం నేరం.
చట్టం: POSH చట్టం (Prevention of Sexual Harassment)
ఏం చెబుతుంది: ఆఫీస్‌లో మహిళలపై ఎలాంటి లైంగిక లేదా మానసిక వేధింపులు జరిగినా ఫిర్యాదు చేయడానికి ప్రతి కంపెనీలో Internal Complaints Committee (ICC) తప్పనిసరిగా ఉండాలి. అలాగే రాత్రి వేళల్లో మహిళలు పనిచేస్తే, వారికి కంపెనీ సురక్షితమైన రవాణా (క్యాబ్ సదుపాయం) కల్పించాలి.
కంపెనీ క్లోజర్ నుంచి 25F రక్షణ
చట్టం: Industrial Disputes Act, 1947 లోని Section 25F.
ఏం చెబుతుంది: కంపెనీలో కనీసం ఒక సంవత్సరం నిరంతర సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగిని తీసేసేటప్పుడు.. 1 నెల ముందే నోటీస్ ఇవ్వాలి లేదా ఆ జీతం చెల్లించాలి. దాంతో పాటు, వారు పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల సగటు జీతాన్ని (Retrenchment Compensation) అదనంగా చెల్లించాలి.
ఎప్పుడు ఉపయోగం: ఒకవేళ కంపెనీకి ప్రాజెక్టులు పూర్తిగా పోయి, ఆ విభాగాన్ని (Business Unit) మూసివేయడం వల్ల ఉద్యోగులను తీసేయాల్సి వచ్చినప్పుడు.
కంపెనీ ఏదైనా మీ ఉద్యోగం మీ హక్కు!
చట్టం: Indian Contract Act, 1872 (Section 27)
కంపెనీ ఏం చేస్తుంది: చాలా ఐటీ కంపెనీల అగ్రిమెంట్లలో "మీరు ఈ కంపెనీ వదిలేసాక 1 లేదా 2 ఏళ్ల వరకు మా కాంపిటీటర్ కంపెనీలలో (పోటీ సంస్థల్లో) ఉద్యోగం చేయకూడదు" అని రాసి ఉంటుంది.
చట్టం ఏం చెబుతుంది: భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క జీవనోపాధిని లేదా ఉద్యోగం చేసుకునే హక్కును అడ్డుకునే ఎలాంటి నిబంధన అయినా చెల్లదు.
మీ హక్కు ఏంటి: ఒక వ్యక్తి చట్టబద్ధంగా ఉద్యోగం చేసుకునే హక్కును కాలరాసే ఏ ఒప్పందమైనా భారతదేశంలో చెల్లదు. కంపెనీ మిమ్మల్ని తీసేసినా లేదా మీరు రిజైన్ చేసినా.. మీకు నచ్చిన కంపెనీలో చేరే పూర్తి స్వేచ్ఛ మీకు ఉంది. ఆ క్లాజ్‌ను చూపి కంపెనీలు మిమ్మల్ని లీగల్‌గా ఏమీ చేయలేవు.
'బలవంతపు రాజీనామా' చట్టవిరుద్ధం
కంపెనీ ఏం చేస్తుంది: "నువ్వు రిజైన్ చేయకపోతే మేమే పీకేస్తాం.. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పాడుచేస్తాం" అని హెచ్ఆర్ (HR) రూమ్‌లలో కూర్చోబెట్టి ఒత్తిడి చేస్తుంది. ఉద్యోగి భయపడి సంతకం చేస్తే, అది 'స్వచ్ఛంద రాజీనామా' అయిపోతుంది కాబట్టి కంపెనీ సేఫ్ జోన్‌లోకి వెళ్తుంది.
మీకున్న హక్కు ఏంటి: ఒకవేళ కంపెనీ మిమ్మల్ని భయపెట్టి బలవంతంగా రాజీనామా చేయిస్తే, దానిని "Coerced Resignation" (బలవంతపు తొలగింపు) గా పరిగణిస్తారు. కంపెనీ ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆఫీస్ ఈమెయిల్స్ లేదా చాట్ స్క్రీన్‌షాట్లు ఆధారంగా లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
కక్షపూరిత PIPలకు ఇలా చెక్
కంపెనీ ఏం చేస్తుంది: ఒక ఉద్యోగి పర్ఫార్మెన్స్ బాగోలేదని తీసేయాలంటే మొదట PIP (Performance Improvement Plan)లో పెడుతుంది.
ఎందుకు పెడుతుంది: ఉద్యోగికి లీగల్‌గా రూపాయి ఇవ్వకుండా కంపెనీ నుంచి తీసేయడానికి PIPని వాడుతుం టాయి. ఇందులో సాధించలేని టార్గెట్లు ఇచ్చి, గడువు ముగిసాక "అవకాశం ఇచ్చినా నిరూపించుకోలేదు" అని రికార్డులు క్రియేట్ చేస్తాయి.
మీ హక్కు ఏంటి: ఒకవేళ మీ గత పర్ఫార్మెన్స్ రేటింగులు బాగుండి, సడన్‌గా PIP లో పెడితే.. మీ పాత అప్రిసియేషన్ ఈమెయిల్స్, క్లయింట్ ఫీడ్‌బ్యాక్‌ను సాక్ష్యాలుగా వాడుకుని కంపెనీ కంపెనీ కక్షపూరితంగా వ్యవహరించిందని లేబర్ కోర్టులో సవాలు చేయచ్చు.
జీతం తగ్గించడానికి వీల్లేదు
కంపెనీ ఏం చేస్తుంది: చాలా కంపెనీలు ఉద్యోగిని నేరుగా తీసేయకుండా, వారి హోదాను (Designation) తగ్గించడం లేదా జీతాన్ని తగ్గించడం (Salary Cut) చేస్తుంటాయి.
మీ హక్కు ఏంటి: ఉద్యోగి అంగీకారం లేకుండా, సరైన కారణం చూపకుండా కంపెనీలు రోల్ మార్చడానికి లేదా జీతం తగ్గించడానికి వీల్లేదు. ఇది ఉద్యోగ ఒప్పందాన్ని (Breach of Contract) ఉల్లంఘించడమే అవుతుంది. దీనిపై ఉద్యోగి సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు.
వాటిని చెక్ చేసే హక్కు కంపెనీకి లేదు!
కంపెనీ ఏం చేస్తుంది: ఉద్యోగిని ఆఫీస్ నుంచి సడన్‌గా పంపించేటప్పుడు వారి ఫోన్లు, వ్యక్తిగత వస్తువులను చెక్ చేస్తుంది.
మీ హక్కు ఏంటి: కంపెనీ ల్యాప్‌టాప్ లేదా ఆఫీస్ అకౌంట్లను తనిఖీ చేసే హక్కు యాజమాన్యానికి ఉన్నప్పటికీ, ఉద్యోగి యొక్క వ్యక్తిగత ఫోన్, పర్సనల్ మెయిల్స్ లేదా ప్రైవేట్ డేటాను బలవంతంగా లాగిన్ చేయించి చూసే హక్కు కంపెనీకి లేదు. అలాగే ఉద్యోగి సొంత వస్తువులను (Personal belongings) ఆఫీస్ లోనే నిలిపే అధికారం కంపెనీకి ఉండదు.
భారత లేబర్ చట్టాల ప్రకారం.. ఎవరైతే మేనేజర్, సూపర్‌వైజర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ హోదాలో ఉండి ఇతరులను కంట్రోల్ చేస్తుంటారో, వారు చట్టప్రకారం కార్మికులు (Workmen) కిందకు రారు. కాబట్టి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డెవలపర్లు కోర్టుకు వెళ్ళినప్పుడు "మేము టెక్నికల్ పనులు చేసే కార్మికులమే" అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే లేబర్ కోర్టుల నుంచి వేగంగా రక్షణ లభిస్తుంది.
legal rights employees india legal aspects of software employee rights employee rights india rights during layoff employee support company vs employee laws contractual rights labour laws in india for employees