`వ్యాపార అవసరాల దృష్ట్యా మీ పొజిషన్‌ను తొలగిస్తున్నాం. ఈ రోజే మీ చివరి పనిరోజు (Today is your last working day)`.. ఇదీ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ (Oracle).. తమ ఉద్యోగులకు ఉదయం పంపిన మెయిల్ సారాంశం. సాయంత్రం 6 గంటలకు హ్యాప్పీగా లాగాఫ్ అయిన ఉద్యోగి జీవితం.. కేవలం 12 గంటల్లో, తెల్లవారేసరికి పూర్తిగా తల్లకిందులైపోయింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంటే.. వైట్ కాలర్ జాబ్స్, లక్షల్లో జీతాలు, వీకెండ్ పార్టీలు అంటూ ఎంజాయ్ చేసేవారే కాదు.. ఈఎంఐలు, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలు కూడా మోసేవారు. మరి ఇలా కంపెనీలు ఎప్పుడు పడితే అప్పుడు, అకారణంగా ఉద్యోగం నుంచి ఉద్యోగులను తొలగించవచ్చా? ఉద్యోగులకు అండగా నిలిచే కార్మిక సంఘాలు ఏం ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం!
కాంట్రాక్ట్ రూల్స్ ఏం చెబుతున్నాయి
ఉద్యోగులు కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు సంతకం చేసిన 'Employment Contract' ఇక్కడ చాలా ముఖ్యం. ఒక ఉద్యోగిని కంపెనీలు ఎలా తొలగించవచ్చనేది ఈ నిబంధనలపైనే ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రధానంగా రెండు రకాల రూల్స్ ఉంటాయి.
నోటీస్ పీరియడ్ (Notice Period): కంపెనీ మిమ్మల్ని తీసేయాలనుకుంటే చట్టబద్ధంగా 1 నుంచి 3 నెలల ముందే నోటీస్ ఇవ్వాలి. ఒకవేళ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా "ఈ రోజే మీ చివరి రోజు" అని చెప్తే.. ఆ నోటీస్ పీరియడ్‌కు సమానమైన జీతాన్ని (Severance Pay) కంపెనీ ఉద్యోగికి నష్టపరిహారంగా చెల్లించాలి.
వెంటనే తీసేసే హక్కు (Immediate Termination): కంపెనీ డేటా దొంగిలించడం, ఆర్థిక మోసాలు, లేదా ఆఫీస్ ప్రవర్తనా నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించడం (Gross Misconduct) లాంటి తప్పులు చేస్తే మాత్రం.. కంపెనీలు ఎలాంటి నోటీస్ లేదా నష్టపరిహారం ఇవ్వకుండా క్షణాల్లో ఉద్యోగం నుండి తీసేసే పూర్తి హక్కును కలిగి ఉంటాయి.
ఐటీ కంపెనీల గేమ్స్
చట్ట ప్రకారం ఉద్యోగిని తీసేయడం అంత సులభం కాదు కాబట్టి, కంపెనీలు లీగల్‌గా ఎదురయ్యే చిక్కుల నుండి తప్పించుకోవడానికి కొన్ని వ్యూహాత్మక పద్ధతులను సాకుగా చూపిస్తుంటాయి.
బలవంతపు రాజీనామాలు (Forced Resignations):
- "మీరు రిజైన్ చేయకపోతే మేమే టెర్మినేట్ చేసేస్తాం. అప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పాడవుతుంది. దీనివల్ల మీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది." అని భయపెట్టి ఉద్యోగులతో సొంతంగా రాజీనామా చేయిస్తాయి.
- ఉద్యోగి సొంతంగా రిజైన్ చేస్తే అది 'స్వచ్ఛంద రాజీనామా' కిందకు వస్తుంది, కాబట్టి చట్టపరంగా కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు.
తక్కువ పనితీరు (Poor Performance/PIP):
- ఒక ఉద్యోగి సరిగ్గా పనిచేయడం లేదని కంపెనీ భావిస్తే, నేరుగా తీసేయకుండా మొదట PIP (Performance Improvement Plan) లో పెడుతుంది.
- ఇందులో ఆచరణకు సాధ్యం కాని కఠినమైన టార్గెట్లు ఇస్తారు. వీటిని పూర్తిచేసేందుకు 30 నుంచి 90 రోజులు గడువు ఇస్తారు.
- గడువు ముగిసాక `అవకాశం ఇచ్చినా ఉద్యోగి నిరూపించుకోలేదు` అని రికార్డులు సృష్టించి సులభంగా సాగనంపుతారు.
సైలెంట్ లే-ఆఫ్స్ (Stealth Layoffs):
- పెద్ద కంపెనీలు ఒకేసారి వందల మందిని తీసేసిందనే వార్త మీడియాలో వస్తే కంపెనీ ప్రతిష్ట దెబ్బతింటుంది. దీనిని తప్పించుకోవడానికి కంపెనీలు "సైలెంట్ లే-ఆఫ్స్" పద్ధతిని వాడతాయి.
- ఇందులో ప్రతి వారం లేదా ప్రతి నెల కొంతమందిని పిలిచి, పర్ఫార్మెన్స్ బాగోలేదనో లేదా ప్రాజెక్ట్ బడ్జెట్ తగ్గిందనో చెప్పి మెల్లగా సాగనంపుతారు. దీనివల్ల బయటి ప్రపంచానికి లే-ఆఫ్స్ జరుగుతున్నట్లు తెలియదు.
పరస్పర అంగీకారంతో సెపరేషన్ (MSA):
- కంపెనీలు చట్టపరమైన చిక్కుల నుండి తప్పించుకోవడానికి దిగ్గజ టెక్ సంస్థలు వాడే అత్యంత శక్తివంతమైన టూల్ 'మ్యూచువల్ సెపరేషన్ అగ్రిమెంట్' (MSA).
- ఇందులో `నేనూ, కంపెనీ ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం. భవిష్యత్తులో నేను కంపెనీపై ఎలాంటి కోర్టు కేసులు వేయను" అని ఉంటుంది. దీనిపై సంతకం పెడితేనే 'Severance Package' (నష్టపరిహారం) ఇస్తాయి.
ఏ.ఐ. మరియు ఆటోమేషన్ స్క్రీనింగ్:
- ఒక ఉద్యోగి రోజుకు ఎన్ని గంటలు ఆఫీస్ సిస్టమ్ లాగిన్ లో ఉన్నాడు, ఎంత కోడ్ రాశాడు, స్లాక్ (Slack) లో ఎంత యాక్టివ్‌గా ఉన్నాడు, ఏం పని చేశాడు - ఈ డేటాను కంపెనీలు ఇంటర్నల్ టూల్స్ ద్వారా సేకరిస్తున్నాయి.
- దీనిని ఏ.ఐ టూల్స్, అల్గారిథమ్స్ పూర్తిగా విశ్లేషించి ఒక లిస్ట్‌ను తయారు చేస్తున్నాయి. మేనేజర్లతో సంబంధం లేకుండా, వారికి ఆటోమేటిక్‌గా టెర్మినేషన్ మెయిల్స్ పంపే ట్రెండ్ పెరుగుతోంది.
లొకేషన్ మార్పుతో ఒత్తిడి (Forced Attrition via Relocation):
- ఉద్యోగిని నేరుగా పీకేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని భావించినప్పుడు కంపెనీలు ఈ మైండ్ గేమ్ ఆడతాయి.
- ఉదాహరణకు హైదరాబాద్‌లో కుటుంబంతో స్థిరపడిన ఒక ఉద్యోగిని ఎలాంటి అలవెన్సులు ఇవ్వకుండా నోయిడాకో లేదా విదేశాల్లోని ఏ రిమోట్ ఏరియాకో బదిలీ చేస్తారు. అందరినీ వదిలి ఉద్యోగి ఆ లొకేషన్‌కు వెళ్లలేడు కాబట్టి అతనితో రాజీనామా చేయిస్తారు.
బాండ్ల లూప్‌హోల్ (Employment Bonds):
- చాలా కంపెనీలు (ముఖ్యంగా ఫ్రెషర్స్ లేదా సర్వీస్ బేస్డ్ కంపెనీలు) జాయిన్ అయ్యేటప్పుడు 1 లేదా 2 సంవత్సరాల బాండ్ రాయిస్తాయి. "మధ్యలో వెళ్ళిపోతే ₹2 లక్షలు కట్టాలి" అని నిబంధన పెడతాయి.
- కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ బాండ్ రూల్స్ కేవలం ఉద్యోగికి మాత్రమే. అయితే ప్రాజెక్ట్ లేకపోతే, బాండ్ పీరియడ్‌లో ఉన్నా సరే ఉద్యోగిని ఎప్పుడైనా తీసేసే హక్కు మాత్రం కంపెనీదే.
ఉద్యోగులకు బెంచ్ గండం:
- సాఫ్ట్‌వేర్ రంగంలో చాలామంది ఉద్యోగులు కంపెనీకి డైరెక్ట్ వర్కర్స్ అయినప్పటికీ, వారు క్లయింట్ ప్రాజెక్టుల్లో పనిచేస్తుంటారు. ఒక ప్రాజెక్ట్ అయిపోయాక, మరో ప్రాజెక్ట్ దొరకనప్పుడు ఉద్యోగిని 'బెంచ్' మీద పెడతాయి.
- 30 నుంచి 90 రోజులు బెంచ్ మీద ఉంచి శాలరీ ఇస్తాయి. ఆ లోపు కొత్త ప్రాజెక్ట్ రాకపోతే, రిసోర్స్ అవసరం లేదంటూ చాలా సులభంగా నిరుద్యోగులుగా మారుస్తాయి.
మేనేజర్లు సూపర్‌వైజర్లే 'వైట్ కాలర్' ఉద్యోగులు
భారతదేశంలో Industrial Disputes Act, 1947 మరియు ఆయా రాష్ట్రాల Shops and Establishments Act ప్రకారం ఒక ఉద్యోగిని సరైన కారణం లేకుండా (Without Reasonable Cause) తీసేయడం చట్టవిరుద్ధం. కానీ ఐటీ ఉద్యోగుల విషయంలో ఒక పెద్ద లూప్‌హోల్ ఉంది.
మేనేజర్లు, సూపర్‌వైజర్లు కార్మికులు కాదు: ఐటీ కంపెనీలలో ఎవరైతే మేనేజ్‌మెంట్ హోదాలో అంటే మేనేజర్లు, సూపర్‌వైజర్లులా ఉంటారో లేదా ఇతరుల పనిని పర్యవేక్షిస్తుంటారో, వారు చట్టప్రకారం 'కార్మికులు' (Workmen) కిందకు రారు. వారిని 'వైట్ కాలర్ ప్రొఫెషనల్స్' గా గుర్తిస్తారు. 'వైట్ కాలర్' ఉద్యోగులకు లేబర్ చట్టాల పరిమితి ఉంది. ఫలితంగా వీరికి సాధారణ లేబర్ చట్టాలు వర్తించవు.
ఐటీ ఉద్యోగుల కోసం యూనియన్స్..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్ని కంపెనీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పీకేస్తే.. వారికి రక్షణగా గతంలో ఐటీ ఉద్యోగులకు ఎటువంటి సంఘాలు లేవు. కానీ ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ మారుతోంది.
- NITES (Nascent Information Technology Employees Senate) మరియు KITU (Karnataka IT Employees Union) వంటి ఐటీ యూనియన్లు ఏర్పడ్డాయి.
- FITE (Forum for IT Employees): తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఐటీ ఉద్యోగుల సంక్షేమం కోసం పని చేస్తున్న మరో ప్రముఖ వేదిక.
- AITUC & CITU (IT Wings): ఈ జాతీయ లేబర్ యూనియన్ల ఐటీ విభాగాలు కూడా ఉద్యోగులకు అవసరమైన చట్టపరమైన సలహాలు, మద్దతును అందిస్తాయి.
- కంపెనీలు అన్యాయంగా, బలవంతంగా ఉద్యోగులతో రాజీనామాలు చేయిస్తుంటే.. ఈ యూనియన్లు కేంద్ర, రాష్ట్ర లేబర్ మినిస్ట్రీలకు ఫిర్యాదులు చేస్తూ ఉద్యోగులకు అండగా నిలుస్తున్నాయి. అలాగే లేబర్ కోర్టును ఆశ్రయించవచ్చు.
కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగాలు శాశ్వతం కాకపోవచ్చు, కానీ మీ శ్రమకు రక్షణగా నిలిచే చట్టాలు ఎప్పుడూ శాశ్వతమే. ఉద్యోగిగా మీ బాధ్యతలను నిర్వర్తించడం ఎంత ముఖ్యమో, మీ చట్టపరమైన రక్షణ కవచాలను వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మీ హక్కులే మీ ఆయుధాలు!
termination of software employee illegal termination of employee software employee termination termination rules for employees in india company terminate employee terminate employee without cause IT employee rules for employee termination contract rules IT unions for employees