ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ పుణ్యమా అని సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితం, పని విధానం ఉహించని విధంగా మారిపోయింది. గతంలో ల్యాప్‌టాప్ ముందు ఎన్ని గంటలు ఉన్నారనే విషయం కంటే.. చెప్పిన సమయానికి ఇచ్చిన టాస్క్ పూర్తిచేశారా? లేదా? అని మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ల్యాప్‌టాప్ ముందు ఎన్ని గంటలు ఉంటున్నారు? ఎంత సమయం ఖాళీగా ఉంటున్నారు? ఏఏ అంశాలపై పనిచేస్తున్నారు? ఇలా ప్రతి సెకనును ఏఐ టూల్స్ లెక్కించేస్తున్నాయి. వాళ్లు పంపే మెయిల్స్, చాట్ ఆధారంగా కంపెనీలో ఉంటారా ఉండరా అని కూడా అంచనా వేసేస్తున్నాయి. ఇలాంటి టూల్స్ కంపెనీలు ఎందుకు వాడుతున్నాయి? దీనికి గల కారణాలేం టి? ఫలితంగా ఉద్యోగుల ఆరోగ్యంపై ఈ టూల్స్ ఎలాంటి ప్రభావితం చూపుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!
వర్క్, ప్రొడక్టివిటీ అనాలిసిస్ టూల్స్
ఇవి ఉద్యోగులు ఏయే యాప్స్‌లో ఎంత సమయం గడుపుతున్నారు, కోడింగ్ లేదా టాస్క్‌లు ఎంత వేగంగా పూర్తి చేస్తున్నారనే దాన్ని ఏఐ ద్వారా ట్రాక్ చేస్తాయి.
Sapience: ఇది ఉద్యోగుల పని విధానాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో సైలెంట్‌గా అనలైజ్ చేస్తుంది. యాక్టివ్ టైమ్, మీటింగ్ టైమ్ మరియు బ్రేక్స్ డేటాను ఆటోమేటిక్‌గా మేనేజర్లకు అందిస్తుంది.
ActivTrak: ఏయే వెబ్‌సైట్లు లేదా సాఫ్ట్‌వేర్‌లు ఉత్పాదకతను పెంచుతున్నాయి, ఏవి సమయాన్ని వృథా చేస్తున్నాయో (Productive vs Unproductive) AI బేస్డ్ రిపోర్ట్స్ ఇస్తుంది.
ఆటోమేటిక్ స్క్రీన్ & టైమ్ ట్రాకర్స్
ఉద్యోగి సిస్టమ్ ముందు యాక్టివ్‌గా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఇవి వాడతారు.
Time Doctor: నిర్ణీత సమయంలో అంటే ప్రతి 3 నుంచి 9 నిమిషాలకు ఒకసారి ఉద్యోగికి తెలియకుండా స్క్రీన్‌షాట్లు తీస్తుంది. కీబోర్డ్, మౌస్ కదలికలు లేకపోతే 'Idle Time' అని రికార్డ్ చేస్తుంది.
Hubstaff: ఇది ఉద్యోగి ఏయే యాప్స్ వాడుతున్నారో ట్రాక్ చేయడంతో పాటు, మౌస్ మూవ్‌మెంట్స్ శాతాన్ని (Activity Percentage) లెక్కగట్టి మేనేజర్లకు పంపుతుంది.
కోడింగ్ & డెవలప్‌మెంట్ ట్రాకింగ్
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కోడ్ క్వాలిటీ, గిట్‌హబ్ (GitHub) యాక్టివిటీ మరియు టాస్క్ మేనేజ్‌మెంట్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేక టూల్స్ ఉన్నాయి.
Waydev / GitPrime (Pluralsight Flow): ఇవి గిట్‌హబ్, బిట్‌బకెట్ వంటి ప్లాట్‌ఫార్మ్స్‌తో కనెక్ట్ అయ్యి, ఒక డెవలపర్ రోజుకు ఎన్ని లైన్ల కోడ్ రాశారు, ఎన్ని కమిట్స్ (Commits) చేశారు, కోడ్ రివ్యూలకు ఎంత సమయం పట్టిందనేది AI అల్గారిథమ్స్ ద్వారా అంచనా వేస్తాయి.
Jira Premium AI: ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్ అయిన జీరాలో AI ఫీచర్లు ఉన్నాయి. ఒక డెవలపర్‌కు కేటాయించిన టాస్క్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా? లేదా? అనేది ఇది ముందే ఊహిస్తుంది.
Jellyfish: డెవలపర్ పనితీరును విశ్లేషించి ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తవుతుందో లేదో ముందే అంచనా వేస్తుంది.
స్కీన్ యాక్టివిటీ లైవ్ రికార్డింగ్
Teramind: ఇది అత్యంత కఠినమైన, శక్తిమంతమైన నిఘా టూల్. ఉద్యోగుల స్క్రీన్ యాక్టివిటీని లైవ్‌గా రికార్డ్ చేయడమే కాకుండా, కంపెనీ డేటాను బయటకు పంపకుండా చూసే సెక్యూరిటీ ఫీచర్లు (DLP) ఇందులో ఉన్నాయి. AI ద్వారా అసాధారణ ప్రవర్తనను అంటే ఉదాహరణకు కంపెనీ డేటాను పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించినా లేదా పర్సనల్ మెయిల్‌కు పంపినా వెంటనే పట్టుకుంటుంది.
చాట్‌ని బట్టి మానసిక స్థితి చెప్పే టూల్
ఉద్యోగుల ఇంటర్నల్ చాట్స్ (Slack, MS Teams, Emails)లో భాష ఆధారంగా వారి మానసిక స్థితి మరియు కంపెనీపై వారి అభిప్రాయాన్ని ఏఐ స్కాన్ చేస్తుంది.
KeenCorp / Erdit: ఉద్యోగులు పంపే ఈమెయిళ్ళు, చాట్ మెసేజ్‌లలోని భాషను (Language patterns) ఈ AI టూల్స్ విశ్లేషించి.. ఉద్యోగులు ఒత్తిడిలో ఉన్నారా (Burnout), కంపెనీ మారాలని చూస్తున్నారా? లేదా అసంతృప్తిగా ఉన్నారా? అనేది మేనేజ్‌మెంట్‌కు గ్రాఫ్‌ల రూపంలో చూపిస్తాయి.
కంపెనీ మాటల వెనుక మర్మమేమిటి?
తమ ఉద్యోగుల ఉత్పాదకతను (Productivity), పనితీరు, సమయాన్ని పర్యవేక్షించడానికి (Monitor) ఈ ఏఐ మరియు డేటా అనలిటిక్స్ టూల్స్‌ను వాడుతున్నామని చెబుతున్నాయి సాఫ్ట్‌వేర్ కంపెనీలు.
వర్క్‌ఫ్రమ్‌హోంపై మేనేజర్ల నిఘా: ఉద్యోగులు ఇంటి నుండి పనిచేస్తున్నప్పుడు, వారు నిజంగా ప్రాజెక్ట్‌లపై ఎంత సమయం కేటాయిస్తున్నారో ట్రాక్ చేయడం మేనేజర్లకు కష్టమవుతుంది. ఈ AI టూల్స్ కీబోర్డ్ క్లిక్స్, అప్లికేషన్ల వాడకాన్ని ఆటోమేటిక్‌గా రికార్డ్ చేయడం ద్వారా మేనేజర్లకు ఒక స్పష్టమైన విజిబిలిటీని ఇస్తాయి.
పని చేస్తున్నారా.. ఖాళీగా ఉన్నారా?: ఒక డెవలపర్ రాసిన కోడ్ క్వాలిటీ, సాల్వ్ చేసిన టికెట్లు, డిజైన్ చేసిన టాస్క్‌లను AI విశ్లేషిస్తుంది. దీనివల్ల ఎవరైనా ఉద్యోగి పని చేయకుండా ఖాళీగా ఉన్నారా లేదా అనవసరమైన వెబ్‌సైట్లలో సమయం వృథా చేస్తున్నారా అనేది సులువుగా తెలిసిపోతుంది.
ప్రాజెక్ట్ ప్లానింగ్ & వనరుల కేటాయింపు: ఒక ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయడానికి AI గత డేటాను విశ్లేషిస్తుంది. ఏ టీమ్‌పై ఎక్కువ పనిభారం ఉంది, ఏ టీమ్ ఖాళీగా ఉందో తెలుసుకుని మేనేజర్లు పనులను సమానంగా కేటాయించడానికి ఇది సహాయపడుతుంది.
డేటా భద్రత, రహస్యాల రక్షణకు: క్లయింట్ డేటా మరియు కోడింగ్ (Intellectual Property)కు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ లేదా కోడ్‌ను అనధికారికంగా డౌన్‌లోడ్ చేస్తున్నారా, వ్యక్తిగత ఈమెయిల్స్‌కు పంపిస్తున్నారా అనేది ఈ టూల్స్ గుర్తించి, డేటా లీక్ అవ్వకుండా అలర్ట్ చేస్తాయి.
ఉద్యోగం మానేయకముందే అలర్ట్!: ఒక ఉద్యోగి వరుసగా ఎక్కువ గంటలు పని చేస్తూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడా అనే విషయాన్ని వారి కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ ద్వారా ఏఐ టూల్స్ గుర్తిస్తాయి. దీనివల్ల వారు ఉద్యోగం మానేయకముందే (Employee Turnover) కంపెనీలు వారి పనిభారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాయి.
తేడా వస్తే.. ఈ రిపోర్టులే సాక్ష్యాలు
కంపెనీలు కేవలం నిఘా పెట్టడానికే కాకుండా, ఉద్యోగుల పనితీరు సరిగ్గా లేకపోయినా లేదా కంపెనీ నిబంధనలు ఉల్లంఘించినా ఉద్యోగం నుంచి తొలగించడానికి ఈ టూల్స్ ఇచ్చే డేటాను ప్రధాన సాక్ష్యంగా వాడుతున్నాయి.
ఖాళీ రిపోర్టుతో తొలగించేయచ్చు: ప్రస్తుతం Sapience, ActivTrak వంటి AI టూల్స్ ఉద్యోగి ఎంత సమయం ఖాళీగా (Idle) ఉన్నాడు, ఏయే వెబ్‌సైట్లు చూస్తున్నాడు అనే నివేదికలను ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తాయి. వీటి ఆధారంగా వారిని తక్కువ పెర్మార్మెన్స్ కేటగిరీల్లో చేర్చి.. ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించే అవకాశం ఉంటుంది.
మూన్‌లైటింగ్‌కి చెక్: వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగులు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీలలో పని చేయడం ప్రారంభించారు. కంపెనీల్లోని సెక్యూరిటీ AI టూల్స్ ఉద్యోగుల కీబోర్డ్ టైపింగ్ ప్యాటర్న్స్, బ్యాక్‌గ్రౌండ్ ఐపీ అడ్రస్‌లు, మరియు గిట్‌హబ్ లాగిన్స్ ద్వారా దీనిని కనిపెట్టి టెర్మినేట్ చేయచ్చు.
డేటా లీకైతే ఇంటికే: కంపెనీకి చెందిన క్లయింట్ ఇన్ఫర్మేషన్ లేదా కోడ్‌ను ChatGPT లేదా ఇతర పబ్లిక్ AI టూల్స్ లో పేస్ట్ చేయడం ఇప్పుడు పెద్ద నేరం. కంపెనీ పాలసీని దాటి ఆఫీస్ ఫైల్స్ బయటకు పంపితే, అది 'గ్రాస్ మిస్‌కాండక్ట్' (Gross Misconduct) కిందకు వస్తుంది. Teramindలో ఇలాంటివి బయటపడితే తక్షణమే డిస్మిస్ చేస్తారు.
ఉద్యోగుల బాధ వర్ణణాతీతం..
నిరంతరం కంపెనీ నిఘా నీడలో పని చేయడం వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తీవ్రమైన మానసిక మరియు శారీరక ఒత్తిడికి లోనవుతున్నారు.
‘కనిపెడుతున్నారు’ అనే ఆందోళన: సిస్టమ్ ముందు కూర్చున్న ప్రతి సెకన్ తనను ఎవరో గమనిస్తున్నారనే భావన ఉద్యోగులలో తీవ్ర ఆందోళనను (Anxiety) కలిగిస్తుంది.
కదలాలంటే భయం: మంచి నీళ్లు తాగడానికో, ఏదైనా వస్తువు తెచ్చుకోవడానికో సీటు వదిలి లేచినా, Time Doctor లేదా Hubstaff లాంటి టూల్స్ 'ఐడల్ టైమ్' (Idle Time) కింద రికార్డ్ చేస్తాయి. దీనివల్ల టీమ్ లీడ్ లేదా మేనేజర్ ఏమంటాడో, రేటింగ్ తగ్గిపోతుందేమో అనే భయం నిరంతరం వెంటాడుతుంది.
‘పని’ కంటే ‘లాగిన్’ ముఖ్యం: ఎన్ని గంటలు స్క్రీన్ ముందు ఉన్నాడు, ఎన్ని కీబోర్డ్ క్లిక్స్ కొట్టాడు అనే సంఖ్యలకే టూల్స్ ప్రాధాన్యత ఇస్తున్నా యి. దీంతో ఉద్యోగులు ప్రాజెక్ట్, కోడ్ గురించి ఆలోచించడం కంటే తమ సిస్టమ్ లాగౌట్ కాకుండా చూసుకోవడానికి, మౌస్ కదులుతూ ఉండేలా చేయడానికి (Mouse Jiggling) ప్రాధాన్యతమిస్తూ మానసిక శ్రమకు గురవుతున్నారు.
మైక్రోమేనేజ్‌మెంట్ ఒత్తిడి: గతంలో వారానికి ఒకసారి లేదా రోజుకు ఒకసారి స్టేటస్ అప్‌డేట్ ఇస్తే సరిపోయేది. ఇప్పుడు Waydev, Sapience వంటి టూల్స్ ప్రతి గంటకు పనితీరును విశ్లేషించి రిపోర్టులను మేనేజర్లకు పంపుతాయి. చిన్నచిన్న విషయాలకు కూడా మేనేజర్లు ప్రశ్నించడం వల్ల ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
తీవ్రమైన శారీరక సమస్యలు: ఈ నిఘా టూల్స్ వల్ల ఉద్యోగులు బ్రేక్స్ తీసుకోవడం తగ్గించేశారు. ఎక్కువసేపు కదలకుండా కంప్యూటర్ల ముందే కూర్చోవడం వల్ల తీవ్రమైన వెన్నునొప్పి, కళ్ల అలసట, నిద్రలేమి, డిప్రెషన్ , జీర్ణక్రియ సమస్యల బారిన పడుతున్నారు. దీని వల్ల Work-Life Balance పూర్తిగా దెబ్బతింటోంది.
సృజనాత్మకత లోపించడం: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో కొత్త ఐడియాలు రావాలన్నా, క్లిష్టమైన సమస్యలకు కోడింగ్ సొల్యూషన్స్ దొరకాలన్నా ప్రశాంతమైన ఆలోచన అవసరం. అయితే, టైమ్ ఆటోమేటిక్‌గా రన్ అవుతూ స్క్రీన్‌షాట్లు పడుతుంటాయనే టెన్షన్‌లో కొత్తగా ఆలోచించే శక్తి లోపించి, ఉద్యోగులు యంత్రాల్లా మారిపోతున్నారు.
ఏఐ టూల్స్‌కి ముందు
ఫలితాలకే ప్రాధాన్యత: గతంలో కంపెనీలకు ఉద్యోగులు రోజంతా ఏం చేస్తున్నారని పట్టించుకునేవి కాదు. ఇచ్చిన ప్రాజెక్ట్ లేదా టాస్క్ అనుకున్న సమయానికి (Deadline) పూర్తి చేశారా లేదా అనేదే చూసేవి.
నమ్మకం (Trust Factor): ఉద్యోగి సిస్టమ్ ముందు కూర్చుని ఆలోచిస్తున్నాడా, సహోద్యోగులతో డిస్కస్ చేస్తున్నాడా లేదా బ్రేక్ తీసుకున్నాడా అని మేనేజర్లు లెక్కలు వేసేవారు కాదు. ఉద్యోగుల ప్రైవసీకి గౌరవం ఉండేది.
లాగిన్ అవర్స్ మాత్రమే: ఆఫీస్‌కు వచ్చి ఐడీ కార్డ్ స్వైప్ చేయడం లేదా ఇంటి నుండి లాగిన్ అయి 8-9 గంటలు ఆన్‌లైన్‌లో కనిపిస్తే సరిపోయేది.
ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత
సెకన్ల వారీగా లెక్కింపు (Micro-Surveillance): ఇప్పుడు కేవలం ఉద్యోగులు లాగిన్ అయితే సరిపోదు. కీబోర్డ్ పైన ఎన్నిసార్లు నొక్కారు, మౌస్ ఎన్ని డిగ్రీలు కదిలిందనేది కూడా AI లెక్కిస్తోంది.
అపనమ్మకం & అనుమానం: ఉద్యోగి ల్యాప్‌టాప్ ముందు నుండి లేచి కాస్త ప్రశాంతంగా ఆలోచిద్దామన్నా AI ఒప్పుకోదు. 3 నుండి 5 నిమిషాలు కదలిక లేకపోతే మిమ్మల్ని 'పని దొంగ' (Idle) గా డిక్లేర్ చేస్తుంది.
నలిగిపోతున్న మనుషులు: మనిషి ఆలోచించే విధానాన్ని కాకుండా, కేవలం సిస్టమ్ రన్ చేసిన నంబర్లను మాత్రమే కంపెనీలు నమ్ముతున్నాయి.
టెక్నాలజీ అభివృద్ధి చెందడం మంచిదే అయినా, అది ఉద్యోగుల మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా మారకూడదు. మెషిన్ల నంబర్ల కంటే మనుషుల శ్రమకు విలువనిచ్చినప్పుడే ఐటీ రంగానికి నిజమైన భవిష్యత్తు.
using ai to monitor employees employers using ai to monitor employees ai at work ai employee monitoring using ai to track employees monitor remote employees ai employee monitoring companies using ai to monitor employees ai tools employee software companies monitor software employees work