పెయిడ్ రివ్యూలు చేస్తున్నామని చెప్పకుండా బొంకే వారు చెప్పే కారణాలు ఏమిటి?

చేసేది పెయిడ్ రివ్యూ.. కానీ మాట‌లు మాత్రం అది ఏమాత్రం పెయిడ్ రివ్యూ కాద‌నేలా, చూస్తున్న ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టేలా ఉంటాయి! ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఇదే న‌యా ట్రెండ్‌. పెయిడ్ రివ్యూని క‌వ‌రింగ్ చేస్తూ.. అదేదో తామే నిజంగానే ఆ ప్రొడ‌క్టును కొని వాడిన‌ట్టు బ‌ట‌ర్ పూసిన మాట‌లు చెబుతూ ప్ర‌జ‌ల్ని బురిడీ కొట్టించే రివ్యూయ‌ర్లు, ఇన్‌ఫ్లూయ‌న్స‌ర్లదే ఇప్పుడు హ‌వా. మ‌రి, పెయిడ్ రివ్యూలు చేస్తున్నామ‌ని చెప్ప‌కుండా ఇలా బురిడీ కొట్టించే వారు చెప్పే సాకులు ఏంటి? వారు జనాలను నమ్మించడానికి ఆడే సెంటిమెంట్ డ్రామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

నిజాయితీ ముసుగులో బుకాయింపులు
వ్యక్తిగత అనుభవం డ్రామా: ఇది నా సొంత డబ్బులతో కొని వాడుతున్న ప్రొడక్ట్, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను అని నమ్మిస్తారు.
సబ్‌స్క్రైబర్ల సెంటిమెంట్: నా ఫాలోవర్స్‌కు మంచి సమాచారం అందించడమే నా ధ్యేయం తప్ప, నాకిందులో ఎలాంటి స్వార్థం లేదు అని కలరింగ్ ఇస్తారు.
ఉచిత ప్రొడక్ట్ సాకు: నాకు కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, కేవలం రివ్యూ కోసం ప్రొడక్ట్ పంపారు, మళ్ళీ తీసేసుకుంటారు- అని నమ్మిస్తారు. కానీ తెరవెనుక వారికి వేరే రూపంలో లబ్ధి చేకూరుతుంది.
స్మార్ట్ రివ్యూ టెక్నిక్: ప్రొడక్ట్ నిజమైనదే అని నమ్మించడానికి అందులో ఉన్న చిన్న చిన్న లోపాలను పెద్దగా చేసి చూపిస్తారు. దీనివల్ల - లోపాలు కూడా చెప్తున్నారు, కాబట్టి ఇది పెయిడ్ రివ్యూ కాదు అనే భ్రమ కలుగుతుంది.
యాధృచ్ఛికంగా జరిగింది: ఒకే సమయంలో ఒకే బ్రాండ్‌పై అందరూ రివ్యూలు చేస్తుంటే.. మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉందని నేను కూడా చేశాను, బ్రాండ్ ఆఫర్ కాదు- అని బుకాయిస్తారు.


త‌ప్పించుకునే స్మార్ట్ మార్గాలు
అన్‌బాక్సింగ్ ముసుగు: "నేను దీని గురించి మంచి, చెడులు చెప్పడం లేదు, కేవలం బాక్స్‌లో ఏముందో చూపిస్తున్నాను (Unboxing) లేదా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్తున్నాను" అని తప్పుకుంటారు.
లింక్ లొసుగులు: డిస్క్రిప్షన్‌లో అఫిలియేట్ లింక్స్ (Affiliate links) పెట్టి.. "మీరు వెతుక్కునే పనిలేకుండా లింక్ ఇచ్చాను" అంటారు. కానీ ఆ లింక్ ద్వారా కొంటే వారికి వచ్చే కమీషన్ నిజాన్ని దాచేస్తారు.
గివ్ అవే రాజకీయం: "ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది, అందుకే నా సొంత డబ్బులతో 5 ప్రొడక్ట్స్ కొని నా సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా ఇస్తున్నాను" అని చెప్తారు. నిజానికి ఆ 5 ప్రొడక్ట్స్ సదరు కంపెనీయే వారికి ఫ్రీగా ఇచ్చి ఉంటుంది.
మాట మార్చడం: గతంలో అదే ప్రొడక్ట్‌ను తిట్టినవారే, డబ్బులు అందిన తర్వాత.. "కంపెనీ వాళ్ళు పాత లోపాలను సరిదిద్దారు, కొత్త అప్‌డేట్ ఇచ్చారు, ఇప్పుడు ఇది చాలా బాగుంది" అని కలరింగ్ ఇస్తారు.


సానుభూతి డ్రామాలు
ఒకవేళ జనాలు అనుమానించినా లేదా పూర్తిగా దొరికిపోయినా, ప్రేక్షకుల నుంచి సానుభూతి సంపాదించి తప్పించుకోవడానికి ఈ కింది ఎమోషనల్ కార్డ్స్ ప్లే చేస్తారు.
ఆర్థిక ఇబ్బందుల విక్టిమ్ కార్డ్: నేనూ మీలాంటి సామాన్యుడినే, నాకూ కుటుంబం ఉంది, ఇల్లు గడవాలి, ఈ ఛానల్ నడవాలంటే ఖర్చులు ఉంటాయి కదా? అందుకే చిన్న చిన్న స్పాన్సర్‌షిప్స్ చేయాల్సి వస్తోంది అని చెబుతారు.
కుట్ర సిద్ధాంతం: "నేను నిజాయితీగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక కొందరు నాపై కావాలనే పెయిడ్ రివ్యూలు చేస్తున్నాననే ముద్ర వేస్తున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు" అని ఏడుస్తారు.
మానసిక ఒత్తిడి: "మీరు నన్ను పెయిడ్ రివ్యూవర్ అని పిలుస్తుంటే నా మానసిక ఆరోగ్యం పాడవుతోంది. రాత్రులు నిద్ర పట్టడం లేదు, తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్తున్నాను" అని మానసిక వేదనను వాడుకుంటారు.
సమాజ సేవ ముసుగు: నేను బ్రాండ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్న మాట నిజమే కానీ, ఆ డబ్బును నేను అనాథ ఆశ్రమాలకో, పేద‌ పిల్లల చదువులకో వాడుతున్నాను అని చిన్న సహాయాలను పెద్దగా చూపిస్తారు.
ప్రాంతీయ సెంటిమెంట్: "ఇది మన దేశానికి చెందిన చిన్న కంపెనీ, వీళ్లకు పెద్ద పెద్ద స్టార్లతో యాడ్స్ ఇప్పించే స్తోమత లేదు. మన వాళ్లను మనం కాపాడుకోకపోతే ఎలా?" అంటూ సెంటిమెంట్ మాట‌లు చెబుతారు.
చివరి అస్త్రం (క్షమాపణ): ఆఖరి అస్త్రంగా "తెలియక పొరపాటు చేశాను, నన్ను క్షమించండి. మనుషులన్నాక తప్పులు చేయడం సహజం కదా" అని చేతులు జోడించి ఎమోషనల్ అవుతారు.


మ‌రికొన్ని టెక్నిక్‌లతో బురిడీ
మా ఫ్యామిలీ మెంబర్స్‌ వాడారు: "ఈ ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ను మా ఇంట్లో వాళ్లు కూడా వాడారు. బాగుందని చెప్పారు" అని కుటుంబ సభ్యులను మధ్యలోకి తెస్తారు. దీనివల్ల చూసేవారికి నమ్మకం రెట్టింపు అవుతుంది.
చాలా రోజులు వెయిట్ చేశాను: "నేను ప్రొడక్ట్ రాగానే వెంటనే రివ్యూ చేయలేదు. కనీసం 3 నెలలు లేదా 6 నెలలు వాడిన తర్వాతే ఈ నిజాయితీ గల రివ్యూ ఇస్తున్నాను" అని టైమ్ ఫ్రేమ్ బిల్డప్ ఇస్తారు.
కంపెనీ పాలసీలను మార్పించాను: "నేను ఈ కంపెనీ వాళ్లతో మాట్లాడాను. మన సబ్‌స్క్రైబర్ల కోసం క్వాలిటీ పెంచమని, సర్వీస్ బాగుండాలని కండిషన్ పెట్టాను. వాళ్లు ఒప్పుకున్నాకే ప్రమోట్ చేస్తున్నాను" అని తామేదో వినియోగదారుల తరఫున పోరాడిన హీరోలా కలరింగ్ ఇస్తారు.
నా పాత వీడియోలు చూడండి: "నేను గతంలో కూడా ఎన్నో మంచి వస్తువులను రికమండ్ చేశాను కదా? నా హిస్టరీ చూడండి" అంటూ పాత క్రెడిబిలిటీని వాడుకుని ప్రస్తుత తప్పును కవర్ చేస్తారు.
కేవలం వాళ్లే అలా అంటున్నారు: "నా ప్రొడక్ట్ రివ్యూ చూసి ఎంతోమంది లబ్ధి పొందారు. కానీ కావాలనే కొందరు నాపై ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు" అని విమర్శించేవాళ్లనే తప్పుబడుతుంటారు.

"నాకు ఏ బ్రాండ్‌తోనూ సంబంధం లేదు కానీ...", "నేను ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా చెప్తున్నాను..." వంటి డైలాగులు విన్నప్పుడు వినియోగదారులు మరింత అలర్ట్‌గా ఉండాలి. ఏ రివ్యూనైనా గుడ్డిగా నమ్మకుండా, స్వయంగా రీసెర్చ్ చేసుకున్నప్పుడే ఇలాంటి పెయిడ్ మోసాల బారిన పడకుండా ఉండ‌గ‌లం.

Paid Reviews Influencer Marketing Fake Reviews Sponsored Content Consumer Awareness Hidden Agenda Influencer Drama Sympathy Card Affiliate Marketing Unboxing Deception FOMO marketing Fake Proofs