బీటెక్ విద్యార్థులకు మొదటి సవాల్ ‘సి లాంగ్వేజ్’ తోనే వస్తుంది. ఎందుకు?

బీటెక్ (B.Tech) చేరగానే మొదటి సంవత్సరంలో లేదా థర్డ్ సెమిస్టర్లో  సి లాంగ్వేజ్ (C Language) ఒక సబ్జెక్టుగా ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఈ సబ్జెక్టు నేర్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు. నాన్-ఐటీ (మెకానికల్, సివిల్, ఈఈఈ వంటి) బ్రాంచ్‌ల విద్యార్థులకే కాక, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు కూడా ఈ సబ్జెక్టు ఒక పెద్ద సవాల్‌గా ఉంటూ ఉంటుంది. దానికి గల ప్రధాన కారణాలను అర్థం చేసుకుంటే కేవలం సి లాంగ్వేజ్ (C Language) మాత్రమే కాక, మొత్తం ప్రోగ్రామింగ్, ఇతర ఇంజినీరింగ్ సబ్జెక్టులు కూడా తేలిక అవుతాయి.

కొత్త ఆలోచనా విధానం (Logical Thinking): పాఠశాల, ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు విషయాలను బట్టీకొట్టడం (Rote Learning) ఎక్కువగా అలవాటు చేసుకుంటారు. కానీ కోడింగ్ అనేది పూర్తిగా లాజికల్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఫార్ములాలనూ, ప్రోబ్లమ్స్‌నూ బట్టీకొట్టినట్లు ప్రోగ్రాములను బట్టీ కొట్టడం సాధ్యం కాదు, కొంత వరకూ సాధ్యమైనా చివరకు గందరగోళానికే దారి తీస్తుంది. ఎందుకంటే ఒక సమస్యనూ, దాని పరిష్కారాన్నీ నువ్వు సరిగ్గా  అర్థం చేసుకుంటే గానీ కంప్యూటర్‌కి అర్థమయ్యేలా చెప్పలేవు కదా..

సింటాక్స్ మరియు రూల్స్ (Strict Syntax): సమస్యను అర్థం చేసుకోవడం, దానికి పరిష్కారాన్ని ఎలా సాధిస్తామో అర్థం చేసుకోవడం రెండు వేర్వేరు దశలైతే, ఆ పరిష్కారం ఎలా సాధించాలో కంప్యూటర్‌కి అర్థమయ్యేలా చెప్పడం మూడో దశ, కీలకమైన దశ. అంటే నీకు సమస్యను కంప్యూటర్ కోణంలో చూసి, దాని భాషలో దానికి అర్థమయ్యేలా చెప్పాలి. దాని భాష అంటే ‘సి లాంగ్వేజ్‘ చాలా కఠినమైన గ్రామర్ నియమాలను కలిగి ఉంటుంది. ప్రోగ్రామింగ్‌కు సంబంధించిన గ్రామర్ నియమాలను సింటాక్స్ అంటారు. అవి ఎంత కఠినంగా ఉంటాయంటే, ఒక చిన్న సెమికోలన్ (;) మరచిపోయినా లేదా బ్రాకెట్ తప్పుగా పెట్టినా ప్రోగ్రామ్ రన్ అవ్వదు (Compilation Error). ఇలా చిన్న పొరపాటు కూడా చేయకుండా పనిచేయడం అనేది అంతకు ముందు వరకూ అలవాటులేని విద్యార్థులు ఈ చిన్న చిన్న తప్పులకే ప్రోగ్రాం ఆగిపోవడం వల్ల త్వరగా నిరాశకు గురవుతారు.

మానవ భాషకు, కంప్యూటర్ భాషకు తేడా: మనం మాట్లాడే భాషలో పదాలకు ‘సి లాంగ్వేజ్’లో పదాలకూ చాలా తేడా ఉంటుంది. అక్కడ పదాలు వేరుగా ఉంటాయి. printf, scanf, main() వంటి పదాలనూ, వాటి వెనుక ఉండే లాజిక్‌నూ మొదటిసారి చూసేటప్పుడు గందరగోళంగా అనిపిస్తుంది. కంగారు వేస్తుంది.

కష్టమైన కాన్సెప్ట్స్ (Complex Concepts): లాజికల్‌గా ఆలోచించడం, కఠినమైన గ్రామర్ నియమాలు పాటించాల్సిరావడం వల్ల ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు సి లాంగ్వేజ్‌లో ఉండే పాయింటర్స్ (Pointers), మెమొరీ అలొకేషన్ (Memory Allocation), స్ట్రక్చర్స్ (Structures) వంటి టాపిక్స్ చాలా క్లిష్టమైనవి ఉంటాయి. ఒక పట్టాన అర్థం కావు. ఉదాహరణకు కంప్యూటర్ లోపల మెమొరీ ఎలా పనిచేస్తుందో ఊహించుకోవడం (Visualization) ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. దీనివల్ల విద్యార్థులలో సబ్జెక్టు పట్ల భయమూ, అయిష్టతా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రాక్టికల్స్ పై అవగాహన లేకపోవడం వల్ల భయం: చాలా మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు కంప్యూటర్ మీద గేమ్స్ ఆడటం తప్ప మరొకటి రాదు, పల్లెటూళ్ల నుంచి వచ్చిన విద్యార్థుకు కంప్యూటర్ ముట్టుకోవడం, ఆపరేట్ చేయడం కూడా కొత్త కావచ్చు. ఈ బాక్‌గ్రౌండు నుంచి వచ్చిన విద్యార్థులు నేరుగా ప్రోగ్రామింగ్ బ్లాక్/బ్లూ స్క్రీన్ ముందు కూర్చుని కమాండ్ రాయడం ఏదో కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్లు అయి కంగారు పెడుతుంది. దీనివల్ల  విద్యార్థులు "ఇది మనకు రాదేమో" అనే ముందస్తు భయానికి (Mental Block) లోనయ్యే అవకాశం చాలా ఎక్కువ.

దీన్ని ఎలా అధిగమించవచ్చు?

బట్టీ కొట్టాలని, షార్ట్‌కట్‌లు గుర్తుపెట్టుకుని గండం గట్టెక్కాలనీ ప్రయత్నిస్తే ‘సి లాంగ్వేజ్’ కఠినమైన సమస్యగా మారడం ఖాయం. కానీ ‘సి లాంగ్వేజ్’ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజులకు పునాది వంటిది అనే విషయాన్ని గుర్తించి, దాని లాజిక్ అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. దాని కోసం చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌ను సొంతంగా రాసి, సిస్టమ్‌పై ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎవరి సహాయమూ లేకుండా పది లైన్ల ప్రోగ్రామైనా రాసి ఎక్జిక్యూట్ చేయడం వస్తే కాన్ఫిడెన్సు పెరుగుతుంది. దాని వల్ల సబ్జెక్టు మీద గ్రిప్‌ కూడా వస్తుంది.

మీరు బీటెక్ మొదటి సంవత్సరంలో ఉన్నారా లేదా సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఏదైనా ప్రత్యేకమైన టాపిక్‌లో ఇబ్బంది పడుతున్నారా? కింద కామెంట్లలో తెలియజేయండి.  ఈ సిరీస్‌లో తర్వాతి వ్యాసాలలో ఆయా టాపిక్‌లకు సంబంధించిన సులభమైన చిట్కాలను అందించగలము.

C Language B Tech Students Programming Challenges Study tips