ఏఐ నేర్చుకోకపోతే టెక్ ఉద్యోగం దొరికే అవకాశం లేదా?

ప్రస్తుతం AI అనేది ఒక ట్రెండిగ్ సబ్జెక్టు. సెర్చింగు, కథలు, కవితలు, పాటలు, బొమ్మలు, వీడియోలు, ప్రజంటేషన్లు, వెబ్‌సైట్లు, ప్రోగాములు AI ఏదైనా చేయగలదు అనేది ఎక్కడ చూసినా వినబడుతున్న, కనబడుతున్న ధోరణి. సాధారణమైన సోషల్ మీడియా విషయాల్లోనే AI వాడటం రాకపోతే అవుట్‌డేటెడ్ అయిపోయినట్లు భావించాల్సి వస్తోంది. ఇక సీరియస్ టెక్నికల్ ఉద్యోగాల్లో అయితే AI రాకపోతే ఉద్యోగం రాదు అనేది అందరి ఆలోచన. ఇది ఎంత వరకూ నిజం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కృత్రిమ మేధస్సు (AI) నేర్చుకోకపోతే టెక్ ఉద్యోగం అస్సలు దొరకదు అనేది పూర్తిగా నిజం కాదు, కానీ దాదాపుగా నిజం.  ముందు ముందు టెక్నికల్ జాబే కాదు ఏ ఉద్యోగం సాధించాలన్నా AI ని వాడటం నేర్చుకోవాల్సిందే, ఉద్యోగం నిలబెట్టుకోవాలన్నా, ప్రమోషన్లు సాధించాలన్నా కూడా AI తో దోస్తీ అవసరమే.

అయితే ఇక్కడే మనం ముఖ్య విషయం గుర్తించాలి. AI అనేది ఒక సాధనం మాత్రమే. అది మీకు పోటీ వచ్చే ఉద్యోగి కాదు. 30-40యేళ్ల క్రితం అన్ని ఉద్యోగాల్లోనూ కంప్యూటర్ల వాడకం పెరిగుతున్నప్పుడు కూడా ఇదే ప్రశ్న వచ్చింది. కంప్యూటర్ నేర్చుకోకపోతే ఉద్యోగం రాదా? అని..
ఇవాళ చూస్తే మనందరం ఉద్యోగాల్లోనూ, ఇంట్లోనూ ఏదో ఒక రకంగా కంప్యూటర్ వాడుతున్నాం, మీ స్మార్ట్ మొబైల్ కూడా కంప్యూటరే. వాట్సప్ వాడేవాళ్లూ, ఫోన్ పే చేసేవాళ్లూ అందరూ కంప్యూటర్ వాడుతున్నట్లే, మన ఫ్రిజ్జులూ, టీవీలూ, వాషింగు మెషీన్లూ కూడా ప్రోగ్రాములతోనే నడుస్తున్నాయి. కానీ ఎవరూ వాటిని ఒక ప్రత్యేకమైన టెక్ వస్తువులుగా చూడటం లేదు.

ఏఐతో అనుభవం కూడా దాదాపుగా అలాగే ఉండబోతోంది. ఎందుకంటే AI అనేది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ కాదు; అది కొత్త సాధనం. చాలా చాలా శక్తివంతమైన సాధనం. దాదాపుగా ప్రతి టెక్ ఉద్యోగంలోనూ తప్పనిసరి కాబోతున్న ముఖ్యమైన సాధనం (Tool).
ఏఐ అనేది ఒక సాధనం మాత్రమే అని గుర్తిస్తే, ఉద్యోగాల్లో దాని ప్రభావం గురించి
ఈ క్రింది విషయాలు అర్థం చేసుకోవచ్చు.  

AI మిమ్మల్ని భర్తీ చేయదు, కానీ AI వాడే వ్యక్తి చేస్తాడు: ప్రస్తుతానికి AI నేరుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు బదులుగా ఇతర టెక్ ఉద్యోగులకు బదులుగా పూర్తి స్థాయి పనులు చేయలేదు. కానీ, AI సాధనాలను (ఉదాహరణకు: GitHub Copilot, ChatGPT మొదలైనవి) ఉపయోగించితే పనుల వేగం, నాణ్యత ఎన్నోరెట్లు పెరుగుతాయి. అందుకే కంపెనీ AIతో పనిచేసే ఉద్యోగులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి.

AI ఉద్యోగాలను మాయం చేయదు, వాటి తీరును మారుస్తుంది.: AI వాడకం పెరగడం వల్ల టెక్ ఉద్యోగాల్లో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు కోడింగ్ మరియు డెవలప్‌మెంట్‌లో  కేవలం బేసిక్ కోడింగ్ మాత్రమే తెలిసిన వారి కంటే, AI సహాయంతో కోడ్‌ను త్వరగా రాసి, అందులోని తప్పులను సరిదిద్దగల (Debugging) సామర్థ్యం ఉన్నవారికి డిమాండ్ పెరుగుతోంది. AI టూల్స్ వాడటం వల్ల ఒక రోజులో అయ్యే పని కొన్ని గంటల్లోనే పూర్తవుతుంది. కాబట్టి ఈ టూల్స్ తెలియకపోతే మీరు ఇతరుల కంటే వెనుకబడిపోతారు.

AIబాగా వాడాలంటే, AIనిపుణుడు కానవసరం లేదు.

మీకు డ్రైవరు ఉద్యోగం కావాలంటే మీకు కారును బాగా డ్రైవ్ చేయడం వస్తే చాలు, కారు తయారీ రానవసరం లేదు కదా అలాగే AI విషయం కూడా. AIకి సంబంధించి ఉద్యోగాలు రెండు రకాలు. మొదటి రకం- రకరకాల AI మోడల్స్ తయారు చేసే సైంటిస్ట్ లేదా రీసెర్చర్ ఉద్యోగాలు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగాలు పెద్దసంఖ్యలో రాబోతున్నాయి. నిజంగా కోడింగ్ మీదా, కంప్యూటర్ ప్రోగ్రామింగు మీద మీకు చాలా ఇష్టం ఉంటే మీరు ఆ స్థాయికి ఎదగవచ్చు.
ఇక రెండో రకం
AIని ఉపయోగిస్తూ చేసే సాధారణ ఉద్యోగాలు. వీటిలో మామూలు ప్రోగ్రామింగ్ ఉద్యోగాలూ, ఇతర టెక్ ఉద్యోగాలూ కూడా ఉంటాయి. వీటి కోసం మీరు AI నిపుణులు కావాల్సిన పనిలేదు. కానీ, AI అప్లికేషన్ మైండ్‌సెట్ ఉండాలి. అంటే, మీ రోజువారీ టెక్ ఉద్యోగంలో AI టూల్స్‌ను ఎలా ఉపయోగించుకోవాలి (Prompt Engineering)?, మీ ప్రాజెక్ట్‌లలో AI ఫీచర్లను ఎలా ఇంటిగ్రేట్ చేయాలి?, డేటాను విశ్లేషించడానికి AI ని ఎలా వాడాలి? అనేది తెలిసి ఉండాలి.

AI ప్రభావం దాదాపుగా లేకుండా లేదా చాలా తక్కువగా ఉండే రంగాలు కూడా ఉంటాయి.
కొన్ని ఉద్యోగాలలో
AI టూల్స్ వాడకంపై కనీస అవగాహన చాలు. వాటిలో రాణించాలంటే మానవ నైపుణ్యాలు (Human Skills) చాలా కీలకం. ఉదాహరణకు క్రిటికల్ థింకింగ్ అండ్  ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు ఆలోచించడం AI కి పూర్తిగా సాధ్యం కాదు. అలాగే సిస్టమ్ ఆర్కిటెక్చర్ అంటే పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌ను డిజైన్ చేయడం.

ఇంకా కమ్యూనికేషన్ మరియు లీడర్‌షిప్ అంటే  క్లయింట్లతో మాట్లాడటం, టీమ్‌ను నడపడం ఇవేమీ AI

ముగింపు:
టెక్ ఉద్యోగం అసలు దొరకదు అని భయపడాల్సిన అవసరం లేదు, కానీ మీరు టెక్ రంగంలో ఎక్కువ కాలం కొనసాగాలన్నా, మంచి జీతం పొందాలన్నా మీ ప్రస్తుత నైపుణ్యాలకు AI టూల్స్ వాడకాన్ని (AI Literacy) జోడించడం తప్పనిసరి.

మీరు ప్రస్తుతం ఏ రకమైన టెక్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో (ఉదాహరణకు: వెబ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, టెస్టింగ్) కామెంట్ల ద్వారా చెబితే దానికి సరిపోయే ఏఐ టూల్స్ ఏవో రాబోయే వ్యాసాలలో సూచించగలము.

AI Tech Employment Employment Future Jobs Human Skills