ఏఐ.. ఏఐ.. ఏఐ.. ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఇదే జపం చేస్తోంది. ఏఐకి పెరుగుతున్న క్రేజ్‌ని ఉపయోగించుకుని మార్కెట్ చేసుకోవాలని దిగ్గజ కంపెనీల ఆశ ఒకవైపు.. ఈ కృతిమ మేథస్సు వల్ల తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో భయం మరోవైపు పెరుగుతోంది. ప్రస్తుతం AI చుట్టూ ఉన్న ఈ హైప్ చూస్తుంటే.. గతంలో 2000 సంవత్సరంలో వచ్చిన డాట్-కామ్ బబుల్ (.com bubble)ని గుర్తుచేస్తు న్నారు టెక్ విశ్లేషకులు. ఒకవేళ ఏఐ చుట్టూ ఉన్న రంగురంగుల మంచు తెరలు అన్నీ తొలగి..ఈ బబుల్ కనుక పగిలిపోతే ఐటీ మరియు సాఫ్ట్‌వేర్ రంగాల పరిస్థితి ఏంటి? ఏఐ బబుల్ బరస్ట్ అయితే డెవలపర్లు, ఏఐ ఆధారంగా పుట్టుకొచ్చిన కంపెనీలు, ఉద్యోగాలు, యాప్‌ల పరిస్థితి ఎలా మారుతుందనే అంశాలు ఈ పార్ట్-1 ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఏఐ ఇంజనీర్లు తగ్గొచ్చు
- ప్రస్తుతం: టెక్ కంపెనీట్లో ఏఐ టూల్స్ విపరీతంగా పెరగడం వల్ల.. AI ప్రాంప్ట్ ఇంజనీర్, AI ఎథిక్స్ స్పెషలిస్ట్ వంటి వారికి విపరీతమైన డిమాండ్ పెరిగింది.
- ఏం మారుతుంది: ప్రాంప్ట్ ఇంజనీర్ డిమాండ్ తగ్గి కోర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ (AWS/GCP), డేటాబేస్ మేనేజ్‌మెంట్ మరియు డేటా స్ట్రక్చర్స్ (DSA) తెలిసిన డెవలపర్లకే మళ్లీ డిమాండ్ పెరుగుతుంది.
డెవలపర్స్‌కు మళ్లీ డిమాండ్
- ప్రస్తుతం: బేసిక్ కోడింగ్, డాక్యుమెంటేషన్, లేదా చిన్న చిన్న మార్పులు చేయడానికి ఫ్రెషర్స్/జూనియర్ డెవలపర్ల పని అంతా ఏఐ చేసేస్తోంది. దీంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగుల వైపు కంపెనీలు చూడటం లేదు. లే ఆఫ్ ల్లోనూ వీరే ఎక్కువమంది ఉంటున్నారు.
- ఏం మారుతుంది: ఏఐ వల్ల తమ ఉద్యోగాలు ఊడిపోతాయేమో అని భయపడుతున్న సాధారణ ఉద్యోగులకు కోడర్స్, డెవలపర్స్, జూనియర్స్, కస్టమర్ సపోర్ట్ సిబ్బంది కొంతకాలం పాటు ఊరట లభిస్తుంది.
లాజికల్ థింకింగ్ పెరుగుతుంది
- ప్రస్తుతం: ప్రతి చిన్న కోడ్‌కు, లాజిక్‌కు పూర్తిగా ఏఐపై ఆధారపడటం వల్ల డెవలపర్ల సొంత ఆలోచనా శక్తి, కోడింగ్ నైపుణ్యాలు దెబ్బతింటున్నాయి. ఏఐ ఇచ్చిన కోడ్‌ను కాపీ-పేస్ట్ చేయడం వల్ల ప్రాజెక్టుల్లో సెక్యూరిటీ లోపాలు కూడా వస్తున్నాయి.
- ఏం మారుతుంది: ఒక క్లిష్టమైన సమస్యకు లాజిక్ ఎలా రాయాలో తట్టనప్పుడు మాత్రమే ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తారు. ఏఐ అనేది ఒక ప్రత్యేక ఉద్యోగంగా కాకుండా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కోడ్ వేగంగా రాయడానికి వాడే ఒక సాధారణ టూల్ (ఉదాహరణకు: GitHub Copilot లాగా) గా మారిపోతుంది.
కస్టమర్ సపోర్ట్‌లో సమతుల్యత
- ప్రస్తుతం: ఐటీ కంపెనీల టెక్నికల్ సపోర్ట్ మరియు కస్టమర్ కేర్ విభాగాలలో మనుషుల్లానే మాట్లాడే జనరేటివ్ AI బాట్‌లు వచ్చాయి. దీంతో కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగాలకు ఎసరు పెట్టిందీ ఏఐ.
- ఏం మారుతుంది: కస్టమర్ కేర్ మొత్తం AI కే అప్పజెప్పడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ పడిపోతుందని కంపెనీలు గుర్తిస్తాయి. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి మనుషులు, సాధారణ ప్రశ్నలకు AI చాట్‌బాట్‌లు ఉండే ఒక సమతుల్య విధానం వస్తుంది.
డమ్మీ యాప్‌లు.. స్టార్టప్‌లు క్లోజ్
- ప్రస్తుతం: ఏఐ పుణ్యమా అని చిన్న చిన్న కంపెనీలు ఫండింగ్ తెచ్చుకుని ఏదో ఒక యాప్ తయారు చేసేస్తున్నాయి. ఏఐ హైప్‌ను క్యాష్ చేసుకోవాలని కొంతమంది క్యాపిటలిస్ట్‌లు వీటిలో కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. "మా యాప్‌లో AI ఉంది" అని ప్రచారం చేసుకుంటున్నారు.
- ఏం మారుతుంది: డమ్మీ యాప్‌లు, వాటిని తయారు చేసే చిన్న కంపెనీలు క్లోజ్ అవుతాయి. కేవలం చాట్‌బాట్‌ల మీద ఆధారపడే కంపెనీలు మూతపడతాయి. స్టార్టప్‌లకు నిధులు ఇచ్చే వెంచర్ క్యాపిటలిస్టులు ఏఐ ప్రాజెక్టుల నుంచి తప్పుకొంటారు. తమ నిధులను వెనక్కు తీసుకుంటారు.
కంప్యూటింగ్ ఖర్చులు తగ్గొచ్చు
- ప్రస్తుతం: ఒక AI యాప్‌ను డేటా సెంటర్ లో నడపాలంటే—GPU క్లస్టర్లు, NVMe స్టోరేజ్, వేగవంతమైన నెట్‌వర్కింగ్, మరియు అత్యంత ముఖ్యంగా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉన్న "AI-Ready Data Cente కావాలి. దీని నిర్వహణ కోట్లతో కూడుకున్నది.
- ఏం మారుతుంది: కృత్రిమ మేథస్సు ఏఐని నిర్వహించేందుకు అయ్యే కంప్యూటింగ్ ఖర్చులు (జీపీయూ, డేటాసెంటర్లు) తగ్గుతాయి. AI టెక్నాలజీ మరింత చౌకగా, సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది.
స్థిరమైన, నమ్మకమైన ఏఐ రావొచ్చు
ఏఐ బుడగ పగిలితే స్వల్ప కాలంలో ఆర్థిక నష్టాలు, ఉద్యోగ సమస్యలు ఎదురైనా దీర్ఘకాలంలో మరింత స్థిరమైన, నమ్మకమైన, ఉపయోగకరమైన టెక్నాలజీ చూడొచ్చంటున్నారు టెక్ విశ్లేషకులు.
- కంపెనీ వ్యూహాల్లో మార్పు: కంపెనీలు కేవలం "ఏఐ" అనే పదాన్ని వాడుకుంటూ బిజినెస్ చేయడం మానేసి, నిజమైన ఆదాయం మరియు లాభాలు తెచ్చే సాంప్రదాయ వ్యాపారాలపై దృష్టి పెడతాయి.
- ఆచరణాత్మక అప్లికేషన్లు: వైద్యం, సైన్స్, మరియు డేటా అనలిటిక్స్ వంటి రంగాలలో నిజంగా ఉపయోగపడే ఏఐ పరిశోధనలు మాత్రమే ముందుకు సాగుతాయి. నిత్యజీవితంలో ఉపయోగపడే AI కోడింగ్ టూల్స్, ఆటోమేషన్, హెల్త్‌కేర్ AI లాంటివి స్థిరంగా ఉండిపోతాయి.
ఈ ఏఐ బుడగ పగిలితే.. ప్రస్తుతం బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఏఏ అంశాలపై దృష్టిసారించాలి అనే అంశాలు పార్ట్-2 ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
is ai a bubble ai bubble crash will the ai bubble pop it industry it jobs ai jobs will ai stocks crash