ఏ.ఐ బుడ‌గ‌ అయితే ఐ.టీ విద్యార్థుల ప‌రిస్థితి ఏంటి?

బీటెక్ లేదా డిగ్రీలో చేరిన‌ విద్యార్థుల్లో ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) గురించి ఎన్నో సందేహాలు.. మ‌రెన్నో ప్ర‌శ్న‌లు! ఏఐ వల్ల ఐటీ రంగానికి భవిష్యత్తు ఉంటుందా లేదా? అనే భయం.. టెక్నాలజీ వేగంగా మారడం వల్ల ఏ కోర్సులు నేర్చుకోవాలో తెలియని అయోమయం విద్యార్థుల‌ను వెంటాడుతోంది. ప్ర‌స్తుతం ఏఐ చుట్టూ ఉన్న హైప్‌తో విద్యాసంస్థ‌లు ఏఐ విభాగాల్లో ప్ర‌త్యేక‌ కోర్సులు ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ ఏఐ బ‌బుల్ బ‌రస్ట్ అంటే.. ఏఐ చుట్టూ ఉన్న ఈ హైప్ అంతా తొల‌గిపోతే ఐటీ రంగానికి, ఐటీ ఉద్యోగులకి జ‌ర‌గ‌బోయే మార్పుల గురించి పార్ట్ -1 లో రాశాం. ఇప్పుడు ఐటీ విద్యార్థుల‌కు జ‌ర‌గ‌బోయే అంశాలు ఈ రెండో భాగంలో చూద్దాం.

కోర్ స‌బ్జెక్టులే ముఖ్యం 
ఏఐ టూల్స్ ఎన్ని వ‌చ్చినా ఐటీ ఇండ‌స్ట్రీకి పునాది.. కోర్ కంప్యూటర్ సైన్స్ బేసిక్స్ (Core CS) మాత్ర‌మే అని గుర్తుంచుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్ & నెట్‌వర్కింగ్ - ఇవి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌కు మూలస్తంభాలు అని గ‌మ‌నించాలి.
ఏం చేయాలి
- డేటా స్ట్రక్చర్స్ & అల్గారిథమ్స్ (DSA), ఆపరేటింగ్ సిస్టమ్స్ (OS), డేటాబేస్ మేనేజ్‌మెంట్ (DBMS), కంప్యూటర్ నెట్‌వర్క్స్ వంటి కోర్    సబ్జెక్టులను బట్టీ పట్టకుండా, సులువుగా అర్థం చేసుకుంటూ నేర్చుకోవాలి.
- AI/ML రంగంలో స్థిరపడాలంటే మ్యాథమెటిక్స్ (Linear Algebra, Calculus), స్టాటిస్టిక్స్ అల్గారిథమ్స్ నాలెడ్జ్ సాధించాలి.
- ఏ పెద్ద కంపెనీ అయినా ఇంటర్వ్యూలో మొదట చూసేది మీ లాజికల్ థింకింగ్ మాత్రమే అని గుర్తుంచుకోండి. 


కోడ్ కాపీ చేస్తే.. ఇంట‌ర్వూల్లో త‌డ‌బాటే
కాలేజీలోని ప్రాజెక్టుల స‌మ‌యంలో కోడ్‌, లాజిక్‌ సొంతంగా ఆలోచించే ధోర‌ణి విద్యార్థుల్లో త‌గ్గిపోయింది. ఏఐ టూల్స్‌ని కోడ్, లాజిక్ అడిగి అవి ఇచ్చిన కోడ్‌ను కాపీ.. పేస్ట్ చేసేస్తున్నారు. ఎక్క‌డైనా కోడ్‌లోని తప్పులను (Bugs) వెతికే ఓపిక కూడా ఉండటం లేదు. దీంతో ఇంటర్వ్యూలలో లైవ్‌గా కోడ్ రాయమన్నప్పుడు తడబడుతున్నారు.
ఏం చేయాలి
- ఏదైనా కోడింగ్ సమస్య వస్తే మొదట పెన్ను, పేపర్‌పై లాజిక్ రాసుకోండి. ఆ తర్వాతే కంప్యూటర్‌పై టైప్ చేయండి.
- ఏఐని "నాకు కోడ్ రాసివ్వు" అని అడగకుండా.. "ఈ లాజిక్ వెనుక ఉన్న సూత్రం ఏంటి" లేదా "నా కోడ్‌ను ఎలా మెరుగుపరచాలి" అని       అడగండి.
- కోడింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు GitHub, Copilot వంటి టూల్స్‌ను పూర్తిగా ఆఫ్ చేయండి.
- రోజుకు కనీసం ఒకటి లేదా రెండు డేటా స్ట్రక్చర్స్ & అల్గారిథమ్స్ సమస్యలను సొంతంగా సాల్వ్ చేయండి.
- కేవలం కోడింగ్ కాకుండా, ఒక సాఫ్ట్‌వేర్ లేదా అప్లికేషన్ వెనుక ఉండే ఆర్కిటెక్చర్ మరియు సిస్టమ్ డిజైన్ నేర్చుకోండి. 


పైథాన్ మాత్ర‌మే కీల‌కం కాదు
ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజన్స్‌, మెషిన్ లెర్నింగ్‌లో ఎక్కువ ఉప‌యోగిస్తున్న స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ పైథాన్‌. ఇది నేర్చుకుంటే భారీ ప్యాకేజీలు వ‌స్తాయ‌ని కోర్ స‌బ్జెక్టుల‌ను వ‌దిలి పైథాన్ పైనే దృష్టిపెడుతున్నారు. కేవ‌లం పైథానే పైనే ఆధార‌ప‌డ‌టం రిస్క్‌తో కూడుకున్న‌దంటున్నారు టెక్ విశ్లేష‌కులు.
ఏం చేయాలి
- పైథాన్ పాపుల‌ర్ లాంగ్వేజ్ అన‌డంలో సందేహం లేదు కానీ ప్రపంచంలోని 80% పైగా పెద్ద కార్పొరేట్ అప్లికేషన్స్ (Enterprise    Apps), బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఇప్పటికీ Java, C++, లేదా .NET (C#) పైనే నడుస్తున్నాయ‌ని తెలుసుకోండి.
- కేవలం పైథాన్ మాత్రమే కాకుండా, ఈ లాంగ్వేజ్‌లు నేర్చుకున్న వారికీ భారీ ప్యాకేజీలు ఉంటున్నాయని గ‌మ‌నించాలి. 


హ్యూమ‌న్‌ లాజిక్ ముఖ్యం
కోడ్ మొత్తం ఏఐ రాసేస్తుంద‌ని, ఏఐ వల్ల డెవ‌ల‌ప‌ర్స్‌, కోడ్ రాసేవాళ్ల‌కు భ‌విష్య‌త్ ఉండ‌ద‌నే అభిప్రాయం విద్యార్థుల్లో ఉంది. ముఖ్యంగా ఏఐ టూల్స్ Devin AI, Copilot వంటి వాటి వ‌ల్ల డెవ‌ల‌ప‌ర్స్ ఉద్యోగాలు పోతున్నాయ‌నే అపోహ చాలా మందిలో ఉంది. అందుకే ఈ విభాగాల వైపు విద్యార్థులు చూడ‌టం లేదు.
ఏం చేయాలి
- ఏఐ అనేది డెవలపర్‌ను తీసేయడానికి కాద‌ని వారి పనిని సులువు చేయడానికే ఉంద‌ని గ్ర‌హించాలి.
- ఏఐ టూల్స్ (Devin AI, Copilot వంటివి) కేవలం సహాయకారిగా మాత్రమే పనిచేస్తాయి.
- క్లయింట్ అవసరాలను అర్థం చేసుకోవడం, సిస్టమ్స్ డిజైన్ చేయడం కేవలం హ్యూమన్ బ్రెయిన్‌కే సాధ్యం.
- ఏఐ కోడ్ రాయగలదు కానీ, ఆ కోడ్‌లో వచ్చే తప్పులను (Bugs) సరిచేయాలన్నా, ఆ కోడ్‌ను అసలైన ప్రాజెక్ట్‌కి లింక్ చేయాలన్నా కోడింగ్    నాలెడ్జ్ మరియు లాజికల్ థింకింగ్ (DSA) పక్కాగా ఉండాల‌ని తెలుసుకోవాలి.
- కోడ్ రాయడం కంటే, రాసిన కోడ్‌ను రివ్యూ చేసే సామర్థ్యం ఉన్నవారికి డిమాండ్ ఇంకా పెరుగుతుంది. 


3 నెల‌ల కోర్సు జీవితం మార్చేయ‌దు
ఏఐ లేదా ఎంఎల్ కోర్సు మూడు నెల‌ల్లో నేర్చుకుంటే ల‌క్ష‌ల్లో ప్యాకేజీ వ‌స్తుంది అనే ఆలోచ‌న చాలా మంది విద్యార్థుల్లో వ్య‌క్త‌మవుతోంది. అయితే మార్కెట్లో విచ్చలవిడిగా పుట్టుకొచ్చిన ఫేక్ ఇన్‌స్టిట్యూట్‌లు సృష్టించిన హైప్ అని అంటున్నారు విశ్లేష‌కులు.
ఏం చేయాలి
కేవ‌లం మూడునెలల్లో ఒక ఏఐ టూల్ నేర్చుకుంటే అది జీవితం మార్చేయ‌దని, అదంతా ట్రైనింగ్ సెంట‌ర్ల గిమ్మిక్కు అంటున్నారు టెక్ నిపుణులు.
- క్లౌడ్‌పై లుక్కేయాలి: ఏఐ అప్లికేషన్స్ తగ్గినా, లేదా ఏఐ అప్లికేష‌న్లు వ‌చ్చినా వాటి యాప్స్ ర‌న్ అవ‌డానికి క్లౌడ్ సర్వర్లు (AWS/Azure)     కావాలని తెలుసుకోవాలి. అందువల్ల AWS, Azure లేదా Google Cloud వంటి క్లౌడ్ టెక్నాలజీలు మరియు సాఫ్ట్‌వేర్‌ను ఆటోమేట్     చేసే DevOps (Docker, Kubernetes) టూల్స్ నేర్చుకోండి.
- అప్లికేష‌న్ బిల్డ్ చేయండి: కేవలం ChatGPT కి ప్రాంప్ట్‌లు రాయడం లేదా వేరొకరి ఏఐ మోడల్‌ను కాపీ-పేస్ట్ చేయడం ఆపేయండి.   సొంతంగా ఒక అప్లికేషన్‌ను మొదటి నుండి చివరి వరకు ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకోండి.
- సైబర్ సెక్యూరిటీతో సుర‌క్షితం - మార్కెట్ ఎలా ఉన్నా, హ్యాకింగ్ మరియు డేటా లీక్ భయాలు కంపెనీలకు ఎప్పుడూ ఉంటాయి. అందువల్ల   సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హాకింగ్ కోర్సులు నేర్చుకుంటే, ఏఐ బుడగ పగిలినా మీ కెరీర్ చాలా సురక్షితంగా (Future-Proof)   ఉంటుంది.
- GitHub ఒక లైవ్ ప్రూఫ్‌: మీ రెజ్యూమే (Resume) లో మీరు సొంతంగా చేసిన కనీసం 3-4 వర్కింగ్ ప్రాజెక్ట్స్ ఉండాలని   గుర్తుంచుకోండి. మీరు రాసే ప్రతి కోడ్‌ను GitHub లో అప్‌లోడ్ చేయండి. మీ కోడింగ్ సామర్థ్యానికి గిట్‌హబ్ ప్రొఫైల్ ఒక లైవ్ ప్రూఫ్ లా   పనిచేస్తుంది.
- వెబ్ డెవలప్‌మెంట్ (MERN/Full-Stack) లేదా మొబైల్ యాప్ డెవలప్‌మెంట్, క్లౌడ్ టెక్నాల‌జీ, ఫుల్ స్టాక్ డెవ‌ల‌ప‌ర్‌ స్కిల్స్‌పై   దృష్టిపెట్టాలి. అన్ని రంగాల నాలెడ్జ్ ఉన్న "ఫుల్-స్టాక్ ఇంజనీర్" కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. 


టెక్నాలజీ ఎంత మారినా కోర్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, సొంతంగా కోడ్ రాసి, బ‌గ్స్ వెతికి వాటిని ప‌రిష్క‌రించే నైపుణ్యాలు బలంగా ఉన్న విద్యార్థులకు మార్కెట్‌లో ఎప్పుడూ తిరుగుండదు. కాబట్టి ఏఐని మీ నైపుణ్యాలు పెంచుకునే ఒక సహచరుడిగా వాడుకుంటూ ముందుకు సాగడమే విజయానికి ఏకైక మార్గం.

ai bubble pop ai bubble or not ai bubble burst the ai bubble IT students IT industry Btech students CSC students computer science future of IT students IT students’ career cse students ai future