నెట్ బ్యాంకింగ్ వాడేవారికి గుడ్ న్యూస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీలు ఎత్తేశారు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నెట్ బ్యాంకింగ్ వాడేవారికి శుభవార్త చెప్పింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో NEFT (National Electronic Funds Transfer), RTGS (Real Time Gross Settlement System) ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీల రద్దుతో ఆయా బ్యాంకుల కస్టమర్లకు ఎంతో ఊరట కలగనుంది. ఆర్బీఐ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలు ఎత్తివేయడం నిజంగా కస్టమర్లకు ఎంతో మేలని చెప్పవచ్చు. కాగా డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు దీనిని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.

RTGS, NEFT ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ. 'డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహించే లక్ష్యంలో భాగంగా ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ను వినియోగదారులు ఉపయోగిస్తే వసూలు చేసే ఛార్జీలను ఎత్తివేస్తున్నామని, బ్యాంకులు దీనిని అమలు చేయాలని  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.  RTGS, NEFT ద్వారా జరిగే ట్రాన్సాక్షన్‌లకు ఆర్బీఐ మినిమం ఛార్జీలను వసూలు చేస్తోంది. 

ఇదిలా ఉంటే కొద్ది రోజుల కిందట ఆర్టీజీఎస్ సమయాన్ని ఆర్బీఐ గంటన్నర పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. అంతకుముందు ఆర్టీజీఎస్ సమయం సాయంత్రం గం.4.30 వరకు ఉండగా ఇప్పుడు ఆర్బీఐ దీనిని సాయంత్రం గం.6.00 వరకు పొడిగించింది. ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్‌కు రాత్రి గం.7.45 వరకు పొడిగించింది. 

ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ కోసం ఆర్టీజీఎస్, రూ. 2లక్షల వరకు నగదు లావాదేవీల కోసం ఎన్ఈఎఫ్టీని సాధారణంగా వినియోగదారులు ఉపయోగిస్తుంటారు. వీటి ద్వారా నగదు బదిలీలు చేసినప్పుడు బ్యాంకులు కొంత ఛార్జీలు వసూలు చేస్తాయి. ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు SBI ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలపై రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్టీజీఎస్‌ లావాదేవీలపై రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది. ఈ ట్రాన్సాక్షన్స్ పైన బ్యాంకుల నుంచి ఆర్బీఐ ఛార్జీలు వసూలు చేస్తుండటంతో బ్యాంకులు కూడా కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి.
 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఆన్‌లైన్ లావాదేవీలు డిజిటల్ లావాదేవీలు ఆర్‌బిఐ నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్