ఈ-మెయిల్. కంప్యూటర్ వినియోగించే వారికి ఈ పదం కొత్తకాదు. నిత్యం అనేక మెయిళ్లను రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. మరిన్ని మెయిళ్లను పంపుతూ ఉంటాం. ఇక, సాఫ్ట్వేర్ ఉద్యోగులైతే.. చెప్పేదేముంది. నిత్యం వారికి మెయిళ్లతోనే పని. సాధారణ ఉద్యోగులు కూడా నిత్యం మెయిళ్లతోనే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరగాళ్లు.. అనేక ప్రయాత్నాల్లో డేటాను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేరగాళ్లు ఎక్కువగా `ఈ-మెయిల్`ను వినియోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ లింకులను పంపి వినియోగదారులను పక్కాగా మాయ చేస్తున్నారు.
ఇలాంటి కేసులు విచారిస్తున్న సైబర్ పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సైబర్ నేరస్తులు ఈ-మెయి ల్ ద్వారా హ్యాక్ చేసేందుకు, డేటా చోరీ చేసేందుకు వెనుకాడబోరని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి నకిలీ ఈ-మెయిళ్లపై సైబర్ సెక్యూరిటీ సంస్థ ``బర్రా క్యూడా నెట్వర్క్స్`` దృష్టి పెట్టింది. దాదాపు 3.6 లక్షల ఈ-మెయిళ్ల ను విశ్లేషించింది. ప్రజలు రిసీవ్ చేసుకున్న వాటిలో దాదాపు 12 అత్యంత ప్రమాదకర ఈమెయిళ్లు ఉన్నాయని పేర్కొంది. ఈ తరహా ఈ-మెయిళ్లు మీ ఇన్ బాక్స్‌ల్లో కనిపిస్తే.. వాటిని ఓపెన్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.. జాగ్రత్తపడండి.. ఏమాత్రం సందేహంగా తోచినా.. వాటిని వెంటనే డిలీట్ చేసేయండి. మరి అవేంటో తెలుసుకుందాం..
1. రిక్వెస్ట్ : కొందరు అదే పనిగా ఫ్రండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తుంటారు. వాటికి స్పందిస్తే.. అంతే సంగతులు
2. ఫాలో అప్ : మీ ఇన్ బాక్స్‌లో కనిపించే ఫాలో అప్ మెసేజ్‌లు అన్నీ కూడా మీకు సంబంధించినవే కావు. సో.. జాగ్రత్తగా చూసుకుని ఓపెన్ చేసుకోవాలి. మీరు పంపే మెయిళ్లకు ఫాలో అప్ అంటూ ఇలాంటి నకిలీవి మిమ్మల్ని బోల్తా కొట్టిస్తుంటాయి.
3. అర్జంట్/ ఇంపార్టెంట్ : ఇవి మనల్ని చాలా త్వరగా బురిడీ కొట్టిస్తాయి. సాధారణంగా అర్జంట్ అన్నా.. ఇంపార్టెంట్ అన్నా కూడా మనం వెంటనే స్పందిస్తాం. అయితే, ఈ తరహా వీక్నెస్ను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. వీటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.
4. మీరు సిద్ధంగా ఉన్నారా? / మీరు సిస్టమ్ ముందే ఉన్నారా? : ఇలాంటి అత్యంత ఆసక్తి కలిగించే మెయిళ్లు తరచుగా మనకు ఇన్‌బాక్స్‌లో కనిపిస్తుంటాయి. వీటిపట్ల ఏమరుపాటుగా ఉంటే .. మన డేటా చోరీకి గురికావడం ఖాయం. మనతో ఏదో పని ఉన్నట్టుగా ఈ మెయిల్ సందేశాలు ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేయడమే ఉత్తమం.
5. పేమెంట్ స్టేటస్: సాధారణంగా మనం ఆన్లైన్లో చెల్లింపు చేసినప్పుడు వెంటనే వాటికి సంబంధించిన స్టేట్మెంట్లు మనకు వస్తాయి. అయితే, మెయిల్‌కు కూడా ఇలాంటి సందేశాలు వచ్చినా.. అవి ఎంత వరకు జెన్యూన్ అనే విషయాన్ని పరిశీలించుకుని మనం వాటిని ఓపెన్ చేయాలి.
6. హలో: ఇలాంటి మెయిల్ సందేశాలు కామన్. మనతో పరిచయం పెంచుకునేందుకు హలో అని స్టార్ట్ చేసే ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
7. పర్చేజ్ : మనం చేసే కొనుగోళ్లకు సంబంధించిన అలెర్టుల రూపంలో కూడా నకిలీ ఈ-మెయిళ్లు మనల్ని బురిడీ కొట్టిస్తాయి. ఇలాంటి వాటి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
8. ఇన్ వాయిస్ డ్యూ: మనం చెల్లించే మొత్తంలో ఏదొ కొంత మేరకు బకాయి ఉన్నారంటూ.. వచ్చే ఈమెయిల్ ఇది. అయితే, ఇది ఎంత వరకు జెన్యూన్ అనేది చాలా నిక్కచ్చిగా తేల్చుకోవాలి. లేకుంటే మన పర్సుకు చిల్లు పడడం ఖాయం.
9. రీపేమెంట్: తిరిగి చెల్లింపులు. ఇలాంటివి కూడా కంప్యూటర్ వినియోగ దారులను బురిడీ కొట్టించేవే., సో.. చాలా అప్రమత్తంగా ఉండాలి.
10. డైరెక్ట్ డిపాజిట్స్: ఇలాంటి మెయిళ్లు సాధారణంగా అందరికీ వస్తుంటాయి. అయితే, వీటిలో నిజానిజాలు తెలుసుకుని ముందుకు వెళ్లాలి. లేకుండా కొంప కొల్లేరే!
11. ఎక్స్పెన్సెస్: మనం చేసే ఖర్చులకు సంబంధించిన ఈ-మెయిళ్లు. ఇవి కూడా మనకు టోకరా వేసేవే., కాబట్టి.. మనం జాగ్రత్తగా వ్యవహరించాలి.
12. పే రోల్: చెల్లింపుల విధానం. ఇలాంటి మెయిళ్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బుట్టలో పడడం కాయం.
12 dangerous emails