ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్‌ల న‌కిలీ యాప్స్ ఎలా ప‌నిచేస్తున్నాయో తెలుసా?

అమాయ‌క వినియోగ‌దారుల‌ను దోచుకోవ‌డానికి సైబ‌ర్ నేర‌గాళ్లు ఇప్పుడు నకిలీ బ్యాంకింగ్ యాప్స్ బాట‌ప‌ట్టారు. ఈ న‌కిలీ యాప్స్‌ద్వారా ‘‘వ‌డ్డీలేని రుణం, క్యాష్‌బ్యాక్‌, ఇంటికే న‌గ‌దు చేర‌వేత’’ అంటూ ఊరించి బురిడీ కొట్టిస్తున్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ భ‌ద్ర‌త సంస్థ ‘‘SOPHOS LABS’’ ఇటీవ‌ల విడుద‌ల చేసిన నివేదిక ప్రకారం... సైబ‌ర్ మోస‌గాళ్లు ఇప్ప‌టికే వివిధ బ్యాంకుల ఖాతాదారులైన‌ 1,60,000 మందిని మోసం చేశార‌ని అంచ‌నా. వీళ్లు జ‌నాన్ని ఎలా మోస‌గిస్తున్నారంటే:-
అస‌లు యాప్‌ల‌కు తీసిపోని న‌కిలీలు!
అస‌లైన బ్యాంకింగ్ యాప్‌ల రూపురేఖ‌ల‌కు (కొన్నిసంద‌ర్భాల్లో వినియోగ సౌల‌భ్యం కూడా) తీసిపోని రీతిలో మోస‌గాళ్లు న‌కిలీల‌ను రూపొందిస్తున్నారు. సాంకేతిక ప‌రిజ్ఞానం గురించి ఏమాత్రం తెలియ‌ని బ్యాంకుల వినియోగ‌దారులు చాలామంది వీటిని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. వీటిని ఇన్‌స్టాల్ చేసుకోగానే ఖాతాదారుల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను అవి కాజేస్తాయి. అటుపైన వాటి నిర్వహకులు ఆ వివ‌రాల‌ను సాధార‌ణంగా మార్కెట్‌లో అమ్మి సొమ్ముచేసుకుంటారు. ఇలా సంపాదించిన వివ‌రాల సాయంతో మోస‌గాళ్లు జ‌నం సొమ్ము స్వాహా చేస్తున్నారు.
ఏయే బ్యాంకులు న‌కిలీల‌బారిన ప‌డ్డాయి?
దేశంలోని ఏడు బ్యాంకుల‌ను ప్ర‌ధానంగా మోస‌గాళ్లు టార్గెట్ చేసిన‌ట్లు సోఫోస్ ల్యాబ్స్ రిపోర్ట్ పేర్కొంటోంది.  ఆ మేర‌కు ప్ర‌భుత్వ రంగంలో అతిపెద్ద‌దైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)స‌హా  ICICI, IOB, AXIS, BOB, YES, CITI బ్యాంకులకు చెందిన 1,60,000 మంది ఖాతాదారులు ఈ న‌కిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని మోస‌పోయారు.
న‌కిలీ యాప్‌లు ఎలా మాయ‌చేస్తాయి?
ప్ర‌త్యేక డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, వ‌డ్డీర‌హిత రుణం వ‌గైరాల రూపంలో ఖాతాదారులకు ఇవి వ‌ల‌వేస్తాయి. వీటిలో ఒక న‌కిలీ యాప్ ఏకంగా ఉచితంగా క్యాష్ విత్‌డ్రాయ‌ల్ కూడా ఆఫ‌ర్ చేసింది. మీకెంత న‌గదు కావాలో యాప్‌ద్వారా ఆర్డ‌ర్ చేస్తే బ్యాంక్ సిబ్బంది నేరుగా మీ ఇంటికే చేరుస్తార‌ని ఆశ‌చూపినట్లు సోఫోస్ ల్యాబ్స్ నివేదిక వెల్ల‌డించింది. అయితే, స‌ద‌రు యాప్‌లో ఆర్డ‌ర్ మేర‌కు కొన్ని సంద‌ర్భాల్లో న‌గ‌దు డెలివ‌రీ చేసినా, అది వాస్త‌వ ఖాతాదారుకు కాకుండా మోస‌గాళ్ల చేతికి అందిన‌ట్లు త‌మ అధ్య‌య‌నంలో తేలింద‌ని పేర్కొంది. పైగా వినియోగ‌దారుల‌లో న‌మ్మ‌కం క‌లిగించేందుకు ప్ర‌ముఖ న‌టులు (ఉదా.. అమితాబ్ బ‌చ్చ‌న్‌), చివ‌ర‌కు దేశ ప్ర‌ధాని మోదీ వంటి రాజ‌కీయ నాయ‌కుల బొమ్మ‌ల‌ను కూడా ఈ యాప్‌ల సృష్టికర్తలైన మోస‌గాళ్లు వాడుతున్నట్లు వెల్లడించింది.
న‌కిలీ యాప్‌లు కాజేసే స‌మాచారం ఎలాంటిది?
న‌కిలీ యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేశాక వాటిలో అధిక‌శాతం పేరు, చిరునామా, బ్యాంక్ ఖాతా నంబ‌రు, డెబిట్‌/క్రెడిట్ కార్డుల వివ‌రాలు, ఫోన్ నంబ‌ర్లు ఎంట‌ర్ చేసేవిధంగా ఖాతాదారుల‌కు సూచ‌న‌లిస్తాయి. ఇదంతా పూర్తిచేస్తేనే యాప్‌ను వాడుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని సూచిస్తాయి. మరికొన్ని న‌కిలీ యాప్‌లు ఆధార్, పాన్‌కార్డ్ వివ‌రాలను కూడా కోరుతున్నాయి.  అవి కోరిన విధంగా స‌మాచారం మొత్తం నింప‌గానే ఎలాంటి త‌నిఖీతో నిమిత్తం లేకుండా ఆ వివ‌రాల‌ను వ్య‌వ‌స్థీకృత హ్యాక‌ర్ల ముఠా నిర్వ‌హించే ఉమ్మ‌డి క‌మాండ్ సెంట‌ర్‌కు చేర‌వేస్తాయని సోఫోస్ ల్యాబ్స్ పేర్కొంది. దీనికంత‌టికీ గూగుల్ పాక్షికంగా కార‌ణ‌మ‌వుతున్న‌ద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ‘‘ఆండ్రాయిడ్ యాప్స్‌కు వేదికైన‌ ‘‘గూగుల్ ప్లే’’ద్వారా ఇలాంటి ప్ర‌మాద‌క‌ర మాల్‌వేర్ వ్యాపిస్తూ వినియోగ‌దారుల‌ను ప్ర‌మాదంలో ప‌డేస్తోంద‌’’ని వివ‌రించింది.
బ్యాంకుల స్పంద‌నేమిటి?
ఈ న‌కిలీ యాప్‌ల బెడ‌ద గురించి తాము కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ‌జేసిన‌ట్లు కొన్ని బ్యాంకుల యాజ‌మాన్యాలు తెలిపాయి. ఆ మేర‌కు ఎల‌క్ట్రానిక్స్‌-మాచార సాంకేతిక మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోని ‘‘ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’’ (CERT-In) స‌హాయం కోరిన‌ట్లు పేర్కొంటున్నాయి. కంప్యూట‌ర్ భ‌ద్ర‌త‌కు భంగం వాటిల్ల‌డాన్ని నివారించే జాతీయ నేతృత్వ‌ సంస్థ (National Nodal Agency) ఇదే. కాగా, త‌మ సైబ‌ర్ ఫ్రాడ్ విభాగం ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తోంద‌ని YES బ్యాంక్ తెలిపింది. అయితే, అతిపెద్ద జాతీయ, ప్రైవేటు బ్యాంకులైన SBI, ICICIస‌హా యాక్సిస్ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌లు మాత్రం త‌మ యాప్‌ల‌కు నకిలీల బెడ‌ద లేనేలేద‌ని ఢంకా బజాయిస్తుండటం గ‌మ‌నార్హం.

Banks  Fake apps  Cyber criminals