ఏటీఎం ఫ్రాడ్‌ల‌కు గురికాకుండా ఉండ‌డానికి ఏకైక సెక్యూరిటీ గైడ్‌

ఏటీఎం వ‌చ్చాక ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యం ఎంత పెరిగిందో దానికి త‌గ్గ‌ట్లే మోసాలు కూడా పెరిగిపోయాయి.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నోచోట్ల ఏటీఎంల్లో నిత్యం మోసాలు జ‌రుగుతున్నాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు, వాలెట్ల‌తో చెల్లింపుల్లోనూ జ‌నాన్ని దోచుకునే నేర‌గాళ్లు ప్రపంచం న‌లుమూల‌లా ఉన్నారు. మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే సౌల‌భ్యం కోసం తెచ్చిపెట్టుకున్న ఏటీఎం కార్డులు, ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ వంటి సౌక‌ర్యాలే మ‌న జేబుకు చిల్లు పెట్ట‌డం ఖాయం. అందుకే మ‌నీ ఫ్రాడ్‌కు గురికాకుండా ఏం చేయాలో చెప్పే గైడ్‌...   
క‌నిపెట్ట‌లేని పిన్ పెట్టుకోండి
ఎవ‌రూ క‌నిపెట్ట‌లేని, ఊహించ‌లేని విధంగా పిన్ నెంబ‌ర్ సెట్ చేసుకోవాలి. బ‌ర్త్‌డే, పెళ్లి రోజులాంటివి పెట్టుకుంటే ఈజీగా గుర్తించేస్తారు. ర‌క‌ర‌కాల నెంబ‌ర్లు, అక్ష‌రాలు, లోయ‌ర్ కేస్‌, అప్ప‌ర్ కేస్ సింబ‌ల్స్‌తో ఉండేలా పిన్ పెట్టుకోండి. దాన్ని ఎక్క‌డా రాయ‌కండి. స్టోర్ చేయ‌కండి. మ‌న‌సులోనే గుర్తు పెట్టుకోండి. ఏటీఎంల్లోగానీ, ఎక్క‌డైనా ఏదైనా వ‌స్తువు కొంటున్న‌ప్పుడుగానీ డెబిట్ కార్డ్ వాడుతుంటే పిన్ ఎవ‌రూ చూడ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డండి.

స్ట్రాంగ్ పాస్‌వ‌ర్డ్ క్రియేట్ చేసుకోండి
మీ నెట్ బ్యాంకింగ్ లేదా వాలెట్ల‌కు సంబంధించిన పాస్‌వ‌ర్డ్ కూడా ఇలాగే ఎవ‌రూ ఊహించ‌లేని విధంగా పెట్టుకోండి. మీ పేరు, భార్య పేరు, పిల్ల‌ల పేర్లు వంట‌వి పెడితే ఈజీగా గుర్తు ప‌ట్టేస్తారు. అందుకే నెంబ‌ర్లు, అక్ష‌రాలు, సింబ‌ల్స్ కాంబినేష‌న్‌తో పాస్‌వ‌ర్డ్ క్రియేట్ చేయండి. 

టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ త‌ప్పనిస‌రి
ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌న్నింటికీ టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ సెట్ చేసుకోండి. అంటే మీ పాస్‌వ‌ర్డ్‌తో పాటు దాని నుంచి మీ మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఈ ఓటీపీ కూడా ఎంట‌ర్ చేస్తేనే లాగిన్ అవ్వ‌గ‌ల‌రు. ఇలా ఉండ‌డం వ‌ల్ల ఒక‌వేళ మీ పాస్‌వ‌ర్డ్ ఎవ‌రైనా దొంగిలించినా ఓటీపీ మీ మొబైల్ నెంబ‌ర్‌కే వ‌స్తుంది కాబ‌ట్టి మోసం చేయ‌లేరు.

కార్డ్ స్వైపింగ్‌తో జాగ్ర‌త్త 
డెబిట్ కార్డ్‌ను స్వైప్ చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి. సెక్యూర్డ్‌గా ఉంటుంద‌నుకునే ఏటీఎంలు, స్టోర్ల‌లోనే వాడండి. ఏటీఎంలో ఏమైనా అనుమానాస్పందంగా క‌నిపిస్తే అక్క‌డ ట్రాన్సాక్ష‌న్ చేయ‌కుండా వ‌చ్చేయండి. 

మాల్‌వేర్‌, పిషింగ్ కాల్స్‌తో ప్ర‌మాదం
మొబైల్ బ్యాంకింగ్ వ‌చ్చాక మాల్‌వేర్‌తో మీ డ‌బ్బుల‌కు కూడా ప్ర‌మాదం పొంచి ఉంది. మెయిల్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఎలాంటి మాలిషియ‌స్ మెసేజ్‌లు వ‌చ్చినా స్పందించ‌కండి. ఊరూపేరూ లేని నెంబ‌ర్లు, మెయిల్స్ నుంచి గిఫ్ట్‌లు వ‌చ్చాయి, స‌ర్‌ప్రైజ్‌లు, టూర్ ప్యాకేజీలు అంటే వెంట‌నే రిప్ల‌యి ఇవ్వ‌కండి. ఇలాంటి ఫోన్ కాల్స్ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌గా ఉండండి. ఫోన్ల‌లోగానీ ఎస్ఎంఎస్‌, మెయిల్ ద్వారాగానీ ఎవ‌రైనా మీ బ్యాంక్ అకౌంట్‌, కార్డ్ వివ‌రాలు, పిన్‌, ఓటీపీ అడిగినా, ఆఖ‌రికి తాము బ్యాంక్ అధికారుల‌మ‌ని చెప్పినా కూడా న‌మ్మ‌కండి. బ‌య‌ట పీసీల్లో మ‌నీ ట్రాన్సాక్ష‌న్లేమీ చేయ‌కండి. 

డాక్యుమెంట్స్‌ను వ‌దిలేయ‌కండి
ఏటీఎంలో డ‌బ్బులు తీసుకున్నాక వ‌చ్చే స్లిప్‌ను అక్క‌డే వ‌దిలేయ‌కండి. అలా వ‌దిలేస్తే చింపి ముక్క‌లు చేసి పాడేయండి. అలాగే మీ డెబిట్ కార్డ్‌, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ ప్రింట‌వుట్లు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డేయకండి. వాటిలోని వివ‌రాలతో మీ అకౌంట్‌ను యాక్సెస్ చేసే ప్ర‌మాద‌ముంది. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఈ బిల్స్, ఈ స్టేట్‌మెంట్సే తీసుకోండి. అవి మీమెయిల్‌కు వస్తాయి కాబ‌ట్టి ప్రింట‌వుట్లు బ‌య‌ట‌కు పోతాయ‌న్న భ‌యం ఉండ‌దు. 

ఫోన్ సెక్యూరిటీ 
నెట్ బ్యాంకింగ్‌, ఈవాలెట్ ట్రాన్సాక్ష‌న్లు ఇప్పుడు అంద‌రం ఫోన్‌లోనే చేసేసుకుంటున్నాం. అందుకే మ‌న స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ చాలా కీల‌కం.  పిచ్చి పిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేయ‌కండి. పిల్ల‌ల గేమింగ్ యాప్స్‌, అశ్లీల సైట్ల ద్వారానే ఎక్కువ‌గా ఇలాంటి వైర‌స్‌లు ఫోన్‌లోకి చొర‌బ‌డి మీ డేటాను లాగేస్తాయి. జాగ్ర‌త్త‌. ఫోన్ సెక్యూరిటీకి పాస్‌వ‌ర్డ్ పెట్టుకోండి. అలాగే మీ ఫోన్‌లోని బ్యాంకింగ్‌, ఈవాలెట్‌, షాపింగ్ యాప్స్‌కి స్ట్రాంగ్ పాస్‌వ‌ర్డ్ పెట్టుకోవ‌డం మ‌ర్చిపోకండి. యాప్ లాక్స్ వాడ‌డమూ మంచిదే. 

లో బ్యాల‌న్స్ చాలు
ఈ వాలెట్ల‌లో ఎక్కువ బ్యాల‌న్స్ ఉంచ‌కండి. ఎప్పుడు కావాల‌టే అప్పుడు ఆన్‌లైన్లోనే లోడ్ చేసుకుని వాడుకునే సౌక‌ర్యం ఉంది కాబ‌ట్టి అందులో 100, 200 కంటే ఎక్కువ బ్యాల‌న్స్ ఉంచ‌డం అన‌వ‌సరం.

ట్రాన్సాక్ష‌న్‌ను డ‌బుల్ చెక్ చేయండి
ఈవాలెట్లు, బ్యాంకింగ్ యాప్స్‌తో ట్రాన్సాక్ష‌న్ చేశాక మ‌ళ్లీ ఒక‌సారి చెక్ చేసుకోండి. ఎవ‌రికైనా డ‌బ్బులు పంపితే వాళ్ల‌కు అందాయో లేదో అడిగిగ చెక్ చేసుకోండి. ఒక‌వేళ ట్రాన్సాక్ష‌న్ మ‌ధ్య‌లో ఫెయిల‌యితే మీ మనీ ఏమ‌యిందో క‌న్ఫ‌ర్మ్ అయ్యేవ‌ర‌కు రెండోసారి మ‌ళ్లీ అదే ట్రాన్సాక్ష‌న్ చేయ‌కండి. 

లాగ్ అవుట్ అవ్వండి
ఈవాలెట్లు, బ్యాంకింగ్ యాప్స్‌, నెట్ బ్యాంకింగ్ సైట్స్ ఇలా ఏది ఓపెన్ చేసినా క‌చ్చితంగా లాగ్ అవుట్ అవ‌డం మాత్రం మ‌ర్చిపోవ‌ద్దు. లాగ‌వుట్ అయిందో లేదో  రీ చెక్ చేసుకోండి. 

Atm frauds Online frauds cyber security Security guide ఏటీఎం మోసాలు ఆన్‌లైన్ మోసాలు Â