ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి మెయిల్ వచ్చిందా.. అయితే ఈ ఆర్టిక‌ల్ మీకోస‌మే!

ఆదాయ‌పు పన్ను రిట‌ర్న్స్ చెల్లించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త‌! మిమ్మ‌ల్ని వ‌ల‌లో ప‌డేయ‌డానికి హ్యాక‌ర్లు ర‌క‌ర‌కాల మార్గాల్లో సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ-మెయిల్స్ రూపంలో మోసగించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ-మెయిల్ అడ్ర‌స్ నుంచే వ‌చ్చిన‌ట్లు మాయ‌చేసి.. మెయిల్స్ పంపుతున్నారు. ప్ర‌స్తుతం ర‌క‌ర‌కాల ఫేక్ లింక్స్ స‌ర్క్యులేట్ అయిపోతున్నాయి. బ్యాంకింగ్ వివ‌రాలు ఇస్తే.. రిఫండ్ అమౌంట్ ఇచ్చేస్తామంటూ ఫేక్ మెయిల్స్ ట్యాక్స్ పేయ‌ర్లను బోల్తా కొట్టిస్తున్నాయి.  ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి మెయిల్ వ‌చ్చింద‌ని తెలియ‌గానే కంగారు ప‌డిపోవ‌ద్ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

లింక్‌లో తేడాలు గ‌మ‌నించండి
ప్ర‌స్తుతం ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పంపిన‌ట్లు వ‌స్తున్న న‌కిలీ మెయిల్ అడ్ర‌స్ donotreply@incometaxindiaefiling.gov.in ఇలా ఉంటోంది. అస‌లైన మెయిల్ donotreply@incometaxindiafilling.gov.in ఉండాలి. ఈ మెయిల్స్‌ని గ‌మ‌నిస్తే.. filingకి e అనే అక్ష‌రం అద‌నంగా, filing అనే ప‌దానికి బ‌దులుగా filling ఉంది. వీటిని గ‌మ‌నించ‌క‌.. మ‌నం సులువుగా బోల్తా కొట్టేస్తాం. ఈ ఆన్‌లైన్ మోసాల గురించి ట్యాక్స్ పేయ‌ర్స్‌కు వెబ్‌సైట్‌తో పాటు మెసేజ్ రూపంలోనూ హెచ్చ‌రిస్తూ త‌గు సందేశాలు జారీచేశామ‌ని ఆదాయ‌పు ప‌న్ను శాఖాధికారి తెలిపారు. అనుమానాస్పంద‌గా క‌నిపించిన‌ మెయిల్స్‌కి స్పందించ‌కుండా ఉండ‌ట‌మే మంచిద‌ని హెచ్చ‌రించారు. ఇటువంటి మెయిల్స్‌కి స్పందించి.. బ్యాంక్ అకౌంట్ వివ‌రాలు, క్రెడిట్ కార్డు వివ‌రాలు ఇవ్వొద్ద‌ని సూచించారు. ఈ వివ‌రాలు ఆదాయపు ప‌న్ను శాక అడ‌గ‌ద‌ని స్ప‌ష్టంచేశారు. 

మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే
ఐటీ వెబ్‌సైట్‌లో ఎటువంటి హెచ్చ‌రిక‌లు లేక‌పోయినా.. చార్టెట్ అకౌంటెట్స్‌, ట్యాక్స్ రిట‌ర్న్ ప్రిపేర‌ర్స్ (టీఆర్‌పీ).. వాట్సాప్‌లో కొన్ని జాగ్ర‌త్త‌లు పంపుతున్నారు. ఇలాంటి ట్యాక్స్ రిఫండ్ ఇస్తామంటూ వ‌స్తున్న ఈమెయిల్స్‌ను ప‌ట్టించుకోవ‌ద్దని సూచిస్తున్నారు. వీట‌న్నింటినీ హ్యాక‌ర్లు పంపుతున్నార‌ని, ఒక‌సారి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే.. నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజ్‌కి వెళుతుంద‌ని వివ‌రిస్తున్నారు. ఇందులోకి లాగిన్ అయితే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిపోతుంద‌ని చెబుతున్నారు. ఈ రిఫండ్ ఇచ్చే ముందు ఆదాయ‌పు ప‌న్ను శాఖ నోటీసులు పంపిస్తుందంటూ అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఈ రిట‌ర్న్స్ ఫైల్ చేసేందుకు గ‌డువు(జూలై 31) స‌మీపిస్తున్న కొద్దీ ఇటువంటి మోసాలు మ‌రింత ఎక్కువ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని ముంబైకి చెందిన టీఆర్‌పీ సుష్మా బందేల్క‌ర్ తెలిపారు. తాము ఐటీ డిపార్ట్‌మెంట్ అని చెబుతున్న వారితో పాటు, ఎవ‌రికీ త‌మ వ్య‌క్తిగ‌త స‌మాచారం చెప్ప‌వ‌ద్దని ట్యాక్స్ పేయ‌ర్ల‌కు సూచించారు. ఒక‌వేళ ఏమైనా మార్పులుంటే స‌వ‌ర‌ణ ధ్రువ‌ప‌త్రాన్ని రిఫండ్ తీసుకునే ముందే ఇవ్వాల‌ని వివ‌రించారు.

income tax cyber tax payer email deceive fake ఈమెయిల్ ఆదాయ పన్ను రిటర్న్స్ బ్యాంకు డీటెయిల్స్