భారతీయ రైల్వే IRCTCలోని 1,268 యూజర్ ఐడీలను డీ-యాక్టివేట్ చేయనుంది. దేశంలోని 100కుపైగా నగరాల్లో నిశిత తనిఖీ నిర్వహించిన అనంతరం 1,875 షెడ్యూ్ల్డ్ ఈ-టికెట్లను రద్దుచేసింది. రైలు టికెట్ల జారీ వేదిక ఐఆర్‌సీటీసీలో చట్టవిరుద్ధంగా టికెట్ల బుకింగ్ చేస్తున్న కొన్ని యూజర్ ఐడీల ఆచూకీని రైల్వే పోలీస్ ఫోర్స్ అధికారులు తమ తనిఖీల సందర్భంగా కనుగొన్నారు. ఈ నేపథ్యంలో సదరు యూజర్ ఐడీల రద్దుకు రైల్వే శాఖ నిర్ణయించింది.
• సుమారు 185 మంది వ్యక్తులు ఈ ఐడీలతో ఆన్‌లైన్ టికెటింగ్ మోసాలకు పాల్పడుతున్నట్లు వారు గుర్తించారు. తదనుగుణంగా వారి ఆనుపానులను పసిగట్టి తూర్పు, పశ్చిమ రైల్వేల పరిధిలోగల 40 మందిని అరెస్ట్ చేశారు.
• చట్టవిరుద్ధంగా రిజర్వ్ చేసుకున్న 1,875 టికెట్లను రద్దు చేశామని, వీటి విలువ రూ.35 లక్షలని రైల్వేశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
• ఈ సైబర్ క్రైమ్‌కు సంబంధించి రైల్వే చట్టంలోని సెక్షన్ 143 కింద 166 కేసులు నమోదుచేసి, పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహిస్తోంది.
ఇంతకూ అసలేం జరిగింది?
ఒడిసాలోని బాలాసోర్ జిల్లా జాలేశ్వర్ పట్టణంలోని యాత్రా సంస్థ ‘ఒడిషా కమ్యూనికేషన్’పై రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. అటుపైన రైల్వే సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేసి, చట్టవిరుద్ధంగా ఈ-టికెట్లను అక్రమ పద్ధతిలో బుక్ చేసే సాఫ్ట్‌వేర్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారమంతా ‘ఒడిషా టీవీ’లో ప్రసారమైంది. హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో ఈ సంస్థ అక్రమంగా ఆన్‌లైన్ బుకింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 12 ఈ-టికెట్లను, రూ.62 లక్షల విలువైన సాఫ్ట్‌వేర్‌ను, రూ.23,000 నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో మోసాలు జోరుగా సాగుతున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులే కాకుండా వార్తా కథనాలు కూడా వచ్చాయి.
• ఈ నేపథ్యంలో గతనెల ముంబైలో 2వేలకుపైగా రైలు టికెట్లను కొనుగోలు చేసి, విచ్చలవిడిగా విక్రయిస్తున్న ఒక వ్యక్తిపై రైల్వే చట్టం సెక్షన్ 143 కింద కేసు నమోదు చేశారు. ఈ టికెట్ల విలువ రూ.57.69 లక్షలు కావడం గమనార్హం.
• అసోం రాజధాని గువహటిలో ఈ-టికెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో రైల్వే రక్షక దళం (RPF)లోని నేరపరిశోధక విభాగం బృందం ‘ప్రకాష్ ట్రావెల్ ఏజెన్సీ’ ప్రాంగణంలో దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.6వేల విలువైన 8 రైలు టికెట్లను స్వాధీనం చేసుకుంది.
• ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌పై వాడకంలోగల ఒక సాఫ్ట్‌వేర్‌ను గుర్తించిన భారతీయ రైల్వే శాఖ 19 వెబ్‌సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా కేంద్ర ఎలక్ట్రానిక్-సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖను కోరింది. వీటిలో myrailinfo.in; www.tatkalaap.com; www.tatkalsoftservice.com వంటివి ఉన్నాయి.
చట్ట సవరణ యోచనలో రైల్వేశాఖ
ఆన్‌లైన్ టికెటింగ్‌లో ఇలాంటి అనేక మోసాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో రైల్వే యాక్ట్-1989కు సవరణలు చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ నేరానికి పాల్పడేవారికి ప్రస్తుతం మూడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నప్పటికీ, దీనికి అదనంగా 2 లక్షల రూపాయల జరిమానా విధించేలా సదరు సవరణను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. కాగా, ఆన్‌లైన్ టికెట్ల ఫ్రాడ్ ఈనాడు కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు... ఇంతకుముందు 2011లోనూ కేవలం కొన్ని నెలల వ్యవధిలో 4.4 లక్షల యూజర్ ఐడీలను IRCTC బ్లాక్ చేసింది. అలాగే చట్టవిరుద్ధ, అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 71,484 ఈ-మెయిల్ ఐడీలను కూడా తొలగించింది.
E-Ticketing  Indian Railways  IRCTC  Online Fraud