వాట్సాప్‌లో  ఒక ఇమేజ్ పంపించి మిమ్మల్ని ఏం చేయొచ్చో తెలుసా?

మీకు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్‌లో ఒక ఇమేజ్ వచ్చింది. దాన్ని మీరు ఓపెన్ చేసి చూస్తే ఏమవుతుంది? మీరు ఎక్కడున్నారో చెప్పేయొచ్చు.  మిమ్మల్ని ఫాలో కూడా కావచ్చు.  ఆన్‌లైన్ స్టాకింగ్‌తో ఇలాంటివి ఎన్నో చేసి మిమ్మల్ని వేధించవచ్చు.  ఆన్‌లైన్ స్టాకింగ్ నేరం.  కానీ దురదృష్టవశాత్తు ఇండియాలో నెటీజన్స్ చాలామందికి ఈ విషయం తెలియదు.  అస‌లు ఆన్‌లైన్ స్టాకింగ్ అంటే ఏంటి?  దాన్ని ఎలా అడ్డుకోవాలో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం.
 

ఆన్‌లైన్ స్టాకింగ్ అంటే..
మీ సోష‌ల్ మీడియా పోస్ట్‌ల ద్వారా మీరెక్క‌డున్నారో లొకేట్ చేస్తారు. లేదంటే ఈ మెయిల్‌, ఎస్ఎంస్ ఆఖ‌రికి వాట్సాప్ ఇమేజ్ ద్వారా అయినా స‌రే మీకు ర‌హ‌స్య లింక్‌ను మీకు పంపిస్తారు. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీ లొకేష‌న్ ఏంటో వారికి తెలిసిపోతుంది.  అంటే ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ ఊళ్లో ఆఖ‌రికి ఏ ట‌వ‌ర్ ప‌రిధిలో ఉన్నారో కూడా తెలుసుకోవ‌చ్చు. దాన్ని బ‌ట్టి మీ యాక్టివిటీని ట్రేస్ అవుట్ చేయొచ్చు. అలా ట్రాక్ చేసిన స‌మాచారంతో మిమ్మ‌ల్ని ఫాలో అవ్వ‌చ్చు. లేదంటే మిమ్మ‌ల్ని వేధించే అవ‌కాశం కూడా ఉంది. ముఖ్యంగా అమ్మాయిల విష‌యంలో ఇది మ‌రింత ప్ర‌మాద‌కరం.

ఎలా జ‌రుగుతుంది
చాలామంది తమ ఆన్‌లైన్ ప్రైవసీని పెద్దగా గుర్తించరు.  అందుకే సోష‌ల్ మీడియాలో ప్రైవ‌సీని ప‌ట్టించుకోకుండా పోస్టులు పెట్టి  ఆన్‌లైన్ స్టాకింగ్ బారిన పడుతున్నారు. అలాగే మీకు తెలియ‌ని వ్య‌క్తులు మెసేజ్‌లు, ఆఖ‌రికి వాట్సాప్‌లో ఓ జిఫ్ లేదా ఫోటో పంపి కూడా మిమ్మ‌ల్ని స్టాకింగ్ చేయొచ్చు. మీరు ఆ ఇమేజ్ లేదా మెసేజ్‌ను క్లిక్ చేయ‌గానే అందులో ఉన్న ర‌హ‌స్య లింక్ మీ లొకేష‌న్‌ను ట్రేస్ అవుట్ చేస్తుంది. సాధార‌ణంగా ఇలాంటివి పంపేవారు ఆ మల్టీమీడియా ఫైల్ లేదా ఇమేజ్ లేదా మెసేజ్‌లో ఒక లింక్‌ను యాడ్ చేస్తారు. ఇది  ఒక ఐపీ లాగర్ క్లయింట్‌లా పని చేస్తుంది. ఈ లింక్ క్రియేట్ చేయ‌డం కూడా క‌ష్టం కాదు. ఎందుకంటే ఇలాంటి ఐపీ లాగ‌ర్ వెబ్‌సైట్లు గూగుల్‌లో  బోలెడన్ని ఉన్నాయి. కాబ‌ట్టి ఎవ‌రైనా మీకు ఇలాంటి లింక్ పంపేయొచ్చు. దీన్ని మీరు క్లిక్ చేయ‌గానే  లొకేష‌న్‌ను సెండ‌ర్‌కు చేర‌వేస్తుంది. ఇది మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టాల‌నుకునేవారికి, వేధించాల‌నుకునేవారికి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆ లింక్ పట్టుకుని వాళ్లు అక్క‌డికి వ‌స్తే మీరు ఎక్క‌డికి వెళుతున్నారో వాళ్ల‌కు తెలుస్తుంది. ముఖ్యంగా ఆడ‌పిల్ల‌ల్ని వేధించాల‌నుకునేవారు, వెంట‌ప‌డేవాళ్లు దీన్ని వాడే ప్ర‌మాద‌ముంది.

ఏం చేయాలి?
* సోష‌ల్ మీడియాలో పోస్టింగ్‌లు చేసేట‌ప్పుడు మీ ప‌ర్స‌న‌ల్ ఫోటోస్ పెట్టేటప్పుడు జాగ్ర‌త్త‌.

* అలాగే తెలియ‌ని నెంబ‌ర్ల నుంచి మెసేజ్‌లు వ‌స్తే ఓపెన్ చేయ‌కండి. ఒక‌వేళ ఓపెన్ చేసినా అందులో ఉన్న లింక్‌ల‌ను క్లిక్ చేయవ‌ద్దు. మెయిల్స్‌తో కూడా ఇలాగే జాగ్ర‌త్త‌గా ఉండండి.

* అన్నింటికంటే ముఖ్యంగా వాట్సాప్‌కి వ‌చ్చే ఇలాంటి మెసేజ్‌లతో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ట్రూ కాల‌ర్‌లో ఆ నెంబ‌ర్ చూడండి. అది మీకు బాగా తెలిసిన‌వారిది అయితేనే ఆ మెసేజ్ ఓపెన్ చేయ‌కండి. ఆ ఫోటోస్‌, జిఫ్‌ల మీద, కింద ఏదైనా లింక్ ఉంటే టచ్ చేయ‌కండి.

* Getlinkinfo.com లాంటి స‌ర్వీసుల‌తో ఆ లింక్‌ను ప్ర‌మాద‌క‌ర‌మో కాదో కూడా తెలుసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్ స్టాకింగ్‌ సైబ‌ర్ క్రైమ్‌ వాట్సాప్ ఇమేజ్‌తో మీ లొకేష‌న్ షేర్ చేయ‌డం online Stalking Cyber crime whatsapp image