వాట్సాప్‌లో ఫేక్ వీడియోలు షేర్ చేస్తున్నారా? ఈ ఆర్టిక‌ల్ మీ కోస‌మే!

వాట్సాప్‌లో స‌ర్క్యులేట్ అవుతున్న ఫేక్ మెసేజ్‌లు, వీడియోలు అమాయ‌కుల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఒకే ఒక్క మెసేజ్‌, వీడియో.. అభంశుభం తెలియ‌ని వాళ్లపై ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు భావ‌న క‌లిగేలా చేసేలా చేస్తోంది. చివ‌ర‌కు భౌతిక దాడుల‌కు ఉసిగొల్పుతోంది. ఇలాంటి సంఘ‌ట‌నే క‌ర్ణాట‌క‌లోని మారుమూల గ్రామంలో జ‌రిగింది. పిల్ల‌ల్ని ఎత్తుకుపోయే వాళ్లు తిరుగుతున్నార‌నే ప్ర‌చారం.. చివ‌ర‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాన్నే తీసివేసేలా చేసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌తో పాటు సుమారు 24 మందిని క‌ర్ణాట‌క‌ పోలీసులు అరెస్టు చేశారు. 

పిల్ల‌ల్ని ఎత్తుకుపోయే వాడ‌ని..
క‌ర్ణాట‌క పోలీస్ అధికారి దిలీప్ సాగర్ తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మ‌హ్మ‌ద్ అజ‌మ్‌(32) క‌ర్ణాట‌క‌లోని కాల్ సెంట‌ర్‌లో ప‌నిచేస్తున్నాడు. సుమారు 400 మంది కిడ్నాప‌ర్లు బెంగ‌ళూరులో తిరుగుతున్నారని, వీరిలో కొంద‌రు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ‌జూపి ముగ్గురు చిన్నారుల‌ను ఎత్తుకువెళ్లిపోయారనే వీడియో ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో బాగా స‌ర్క్యులేట్ అయింది. జూలై 13వ తేదీన‌.. క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్‌ గ్రామానికి త‌న బంధువుతో క‌ల‌సి వెళ్లారు. ఆ గ్రామంలోని చిన్న పిల్ల‌కు చాక్లెట్ ఇస్తుండ‌టాన్ని గ‌మ‌నించిన 50 మంది గ్రామ‌స్తులు.. వారు పిల్ల‌ల్ని ఎత్తుకుపోయే కిడ్నాప‌ర్లుగా భావించి దాడి చేశారు. విష‌యం తెలిసిన పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. గ్రామ‌స్తుల బారి నుంచి అజ‌మ్‌తో పాటు ఆయ‌న బంధువును ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ గ్రామ‌స్తులు పోలీసుల మాట విన‌లేదు స‌రిక‌దా.. వారిపైనా దాడికి దిగారు. చివ‌ర‌కు వీరి దాడిలో అజ‌మ్ మృతిచెందాడు. ఆయ‌న బంధువు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి సుమారు 24 మందిని పోలీసులు జూలై 15న అరెస్టు చేశారు. వీరితో పాటు ఈ ఫేక్  మెసేజ్ స‌ర్క్యులేట్ అయిన‌ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

ఫార్వ‌ర్డ్ మెసేజ్‌ల‌కు క‌ళ్లెం!
ఈ ఏడాదిలో ఇలా స‌ర్క్యులేట్ అవుతున్న ఫేక్ మెసేజ్‌లు, వీడియోల ద్వారా ఎంతోమంది అమాయ‌కుల‌పై జ‌రిగిన దాడుల్లో ముగ్గురు చ‌నిపోగా, మ‌రెంతోమంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  ఈ నేప‌థ్యంలో కేంద్ర ఐటీ శాఖ‌.. ఇటీవ‌ల వాట్సాప్‌కి లేఖ రాసింది. ఈ ఫేక్ మెసేజ్‌లు, వీడియోలకు క‌ళ్లెం వేసేలా స‌మ‌గ్ర చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. దీనిపై వాట్సాప్  స్పందిస్తూ.. ఈ ఫేక్ మెసేజ్‌లు ఎలా గుర్తించాల‌నే అంశంపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్న‌ట్లు తెలిపింది. అంతేగాక ఫార్వ‌ర్డ్ మెసేజ్‌ల‌కు లేబుల్ ఆప్ష‌న్ ఫీచ‌ర్ కూడా త్వ‌ర‌లో అందుబాటులోకి తీసుకొస్తోంది.

whatsapp social media fake message fake videos person killed kidnapper వాట్సాప్ ఫేక్ మెసేజ్ వీడియోస్ గ్రూప్ అడ్మిన్