బెట్టింగ్ గురించి తెలియనివాళ్లు ఉండరు.. క్రికెట్ మ్యాచ్‌లను ఫాలో అయ్యేవాళ్లకు బెట్టింగ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఐపీఎల్ లాంటి లీగ్‌లు నడుస్తున్నప్పుడు ఈ బెట్టింగ్ భారీ స్థాయిలో ఉంటుంది. లావాదేవీలు కోట్ల స్థాయిలో జరుగుతాయి. చట్టరీత్యా ఇది నేరం కానీ జూదగాళ్లు మాత్రం ఎక్కడా తగ్గరు. మ్యాచ్‌లు జరిగేటప్పుడు ఎక్కడ ఉన్నా బరిలో దిగుతారు. అయితే బెట్టింగ్ ఒకవైపు ఉంటే ఆన్‌లైన్ గేమింగ్ అనేది మరోవైపు నడుస్తూ ఉంటుంది. ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడడం ద్వారా డబ్బులు సంపాదించడం దీని ప్రధాన ఉద్దేశం. ఒక టీమ్‌ను ఎంపిక చేసుకుని దాని ద్వారా మనం క్రికెట్ ఆడి ఒక్కొక్క ఆటగాడు ఎంత కొడతాడు అన్న దానిపై కూడా ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. మరి బెట్టింగ్‌కు, ఆన్‌లైన్ గేమింగ్ మధ్య తేడా ఏమిటి?
బెట్టింగ్, గేమింగ్‌లకు సంబంధించిన నియమ నిబంధనలు మన రాజ్యాంగంలోనే ఉన్నాయి. ఇటీవలే కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ ఈ లాస్ గురించి పార్లమెంట్ సమావేశాల్లో చర్చించారు కూడా. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేందర్‌రెడ్డి సంధించిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇలా స్పందించారు. బెట్టింగ్, గేమింగ్ అనేది కచ్చితంగా నిబంధనలకు లోబడే ఉంటుందని శ్రుతిమించితే ఇది చట్టరీత్యా నేరం అవుతుందని కూడా ఆయన చెప్పారు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఫాంటసీ క్రికెట్, డ్రీమ్ 11 లాంటి ఎన్నో గేమింగ్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. అవి యాప్‌ల ద్వారా మన ఫోన్లలోకి కూడా వచ్చేశాయి. మీరు జస్ట్ ఒక టీమ్‌ను ఎంపిక చేసుకుని ఆడితే చాలు ఆ జట్టు గెలిస్తే లేదా ఫలానా ఆటగాడు బాగా ఆడితే మీరు ఆ ఆటగాడిపై పెట్టిన డబ్బులకు రెట్టింపు వచ్చేస్తాయి అని చెబుతున్నారు. ఇలాంటి సైట్లకు సాక్ష్యాత్తూ మహేంద్రసింగ్ ధోని లాంటి స్టార్లే ప్రచారం కూడా చేస్తున్నారు.
అయితే క్రీడల్లో బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా ఎలాంటి మోసాలు జరగకుండా క్రీడా బిల్లును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు శశి థరూర్ కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు. స్పోర్ట్స్ బెట్టింగ్ అనేది రాష్ట్రాల పరిథిలోకి వస్తుంది. అదే స్పోర్ట్స్ గేమింగ్ అనేది పార్లమెంట్ పరిథిలోకి వచ్చే అంశం. అయితే రోజు రోజుకి ఆన్‌లైన్ గేమింగ్ పెరిగిపోతున్న నేపథ్యంలో దీన్ని నియంత్రించాలని కేంద్రం భావిస్తోంది. బ్లాక్ మనీకి ఇది అడ్డగా మారడంతో ఈ గేమింగ్‌ను రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఆదాయం కూడా పొందొచ్చనేది ప్రభుత్వ ఆలోచన. గతంలో ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులరైజ్ గురించి కొన్ని ప్రతిపాదనలు వచ్చినా అవి అమల్లోకి రాలేదు. మున్ముందు మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
status online gaming bettting India cricket