దేశంలోని అతిపెద్ద జాతీయ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్ రోజువారీ పరిమితిని రూ.20,000కు తగ్గించింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.40వేలు కాగా, తగ్గింపు పరిమితి ఈ నెల 31 నుంచి అమలులోకి వస్తుంది. ఏటీఎం, డెబిట్ కార్డుల మోసాలపై ఖాతాదారుల ఫిర్యాదులతోపాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ చెబుతోంది. ఈ మేరకు ‘‘ఏటీఎంలలో మోసాలపై వివిధ బ్యాంకులకు అందే ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అంతేకాకుండా నగదురహిత, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు వీలుగా ‘క్లాసిక్, మ్యాస్ట్రో’ డెబిట్ కార్డులతో ఏటీఎంలలో రోజువారీ తీసుకునే నగదు పరిమితిని తగ్గించాలని నిర్ణయించాం’’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల కార్డుదారుల వివరాలను మోసగాళ్లు కాజేసినా, ఖాతాదారులు స్వల్ప నష్టంతో బయటపడతారని కూడా చెబుతోంది. ఏదేమైనా మోసం గురించి తెలిసిన తక్షణమే బ్యాంకుకు లేదా వినియోగదారుల సేవా విభాగానికి తెలియజేసి కార్డును బ్లాక్ చేయించాలని సూచించింది.
ఏటీఎం మోసాల్లో ‘స్కిమ్మింగ్’పై అత్యధిక ఫిర్యాదులు
బ్యాంకు ఏటీఎంలలో అత్యంత సాధారణమైపోయిన మోసం ‘‘స్కిమ్మింగ్’’ (డెబిట్ కార్డ్ పిన్ చౌర్యం). రహస్య కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలతో నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడతారు. దీనివల్ల దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల ఖాతాదారులు లక్షలాది రూపాయలు కోల్పోయారు. ఈ ప్రక్రియలో ఖాతాదారుల ఏటీఎం కార్డు సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు రహస్యంగా సేకరిస్తారు. ఇందుకోసం ఏటీఎంలోని కార్డ్ స్లాట్‌లో ఓ చిన్న ‘‘స్కిమ్మర్’’ (పరికరం)ను నేరగాళ్లు అమరుస్తారు. ఇవి డెబిట్ కార్డు వెనుకగల మాగ్నటిక్ స్ట్రిప్‌లో ఉన్న మన సమాచారాన్ని కాజేస్తాయి. మరోవైపు మనం ఎంటర్ చేసే నాలుగు అంకెల పిన్ నంబరును కీ ప్యాడ్‌కు ఎగువన దాచిన కెమెరా చిత్రీకరిస్తుంది. ఈ వివరాలతో మోసగాళ్లు నకిలీ కార్డులను తయారుచేసి మన ఖాతాల్లోని డబ్బును ఇతర ఏటీఎంలద్వారా దోచుకుంటారు లేదా ఆన్‌లైన్ షాపింగ్‌తో మన ఖాతాను ఖాళీచేస్తారు. కొన్నిసార్లు మోసగాళ్లు ఏటీఎం కీ ప్యాడ్ కింద పలుచటి ఫిల్మ్‌ను చొప్పించి మనం నొక్కే అంకెలను తెలుసుకుంటారు.
స్కిమ్మర్‌ను గుర్తించడం ఎలా?
ఏటీఎంలలో కార్డ్ రీడర్ స్లాట్ సాధారణంగా కన్నా కొంచెం పొడవుగా కనిపిస్తుంది. కార్డ్ రీడర్ స్లాట్ మామూలుకన్నా వదులుగా ఉందేమో పరీక్షించేందుకు ముందుకు లాగి చూడాలి. వదులుగా ఉన్నట్లయితే స్కిమ్మర్ ఉందని గుర్తించాలి. అలాగే కీ ప్యాడ్‌పై మరో పొరలా కనిపిస్తే దాన్ని చేత్తో తడిమినప్పుడు అది ఉబ్బినట్లు తెలుస్తుంది. దీన్నిబట్టి ప్రమాదాన్ని గుర్తించాలి. అలాగే రహస్య కెమెరాతో పిన్‌ను తెలుసుకోకుండా ఏటీఎం కీ ప్యాడ్‌ను రెండో చేత్తో మూసిఉంచి, నాలుగు అంకెలను నొక్కాలి. మీ కార్డు వివరాలు అపహరణకు గురైనట్లు అనుమానం కలిగితే వెంటనే మీ బ్యాంకుకు సమాచారం ఇవ్వాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సమాచారం ఇవ్వడంలో ఆలస్యమయ్యేకొద్దీ నష్టం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.
ATM Debit card SBI