స్పోర్ట్స్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ల‌కి ఆధార్ లింక్ చేస్తే?

బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్ మార్కెట్‌ మ‌న దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. ప‌దులు, వంద‌లు, వేలు కాదు.. ల‌క్ష‌ల కోట్ల‌లో వ్యాపారం శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. వీటిలో సంఘ వ్య‌తిరేక శ‌క్తుల‌కు నెల‌వైన‌ అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా పాత్ర‌ ఎక్కువ‌గా ఉండ‌టంతో నేరాలు, చ‌ట్ట వ్య‌తిరేక‌మైన కార్య‌క‌లాపాలు జ‌రిగే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో కేంద్ర న్యాయ శాఖ ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకురాబోతోంది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌కు కొన్ని దేశాల్లో చ‌ట్ట బ‌ద్ద‌త ఉన్న విష‌యం తెలిసిందే! ఇప్పుడు మ‌న దేశంలోనూ వీటికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించాల‌ని కేంద్ర న్యాయ శాఖ‌కు లా క‌మిష‌న్.. ప్ర‌తిపాదించింది. ప్ర‌తి ప‌థకానికీ ఆధార్‌తో లింక్ చేసినట్లుగానే.. దీనికి కూడా ఆ ప‌ద్ధ‌తినే అనుస‌రించాల‌ని సూచించింది. 

నివేదిక‌లో ఏముంది?

బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌పై గ‌ల‌ నివేదిక‌లు, రిపోర్టులను పూర్తిగా క్రోడీక‌రించిన‌ లా క‌మిష‌న్‌.. ఒక స‌మ‌గ్ర నివేదికను రూపొందించింది. ఇందుకు గ‌ల కార‌ణాలు, ప్ర‌యోజ‌నాల‌ను స‌వివరంగా వివ‌రిస్తూ.. Legal Framework: Gambling and Sports Betting including Cricket in India’ పేరుతో రిపోర్టును కేంద్ర న్యాయ శాఖ‌మంత్రి ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్‌కు అంద‌జేసింది. పార్ల‌మెంటు కూడా ఈ ప్రతిపాదన‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని గ్యాంబ్లింగ్‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే అంశాల‌ను ప‌రిశీలించాల‌ని సూచించింది. భార‌త రాజ్యాంగంలోని 249 లేదా 252 ఆర్టిక‌ల్స్‌లో క‌ల్పించిన ప్ర‌త్యేక అధికారాల సాయంతో ఈ ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని తెలిపింది.  

చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పిస్తే.. 

బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌డంలో, చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించ‌డంలోనూ విఫ‌ల‌మైతే.. అది సంఘ వ్య‌తిరేక శ‌క్తులకు మ‌రింత బ‌లం చేకూర్చిన‌ట్టేన‌ని హెచ్చ‌రించింది. దీని వ‌ల్ల ఈ శ‌క్తులు మ‌రింత‌ విజృంభించే అవ‌కాశం ఉంది. బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌లో వ‌చ్చిన సొమ్ము ఉగ్ర‌వాదుల‌కు చేరి.. వారికి ఆర్థికంగా మ‌రింత చేయూత అందుతుంది. నేరాలు ఎక్కువ‌గా జ‌రిగితే దేశంలో అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితులు ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది. వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించాల‌ని వివ‌రించింది. దీని వ‌ల్ల దేశంలో నిరుద్యోగుల‌కు ఉపాధి ల‌భిస్తుంద‌ని, ఇది దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని లా క‌మిష‌న్ తెలిపింది. 

ఆధార్‌తో బ్లాక్‌మ‌నీకి చెక్‌

ఈ ప్ర‌క్రియ‌లో మ‌రో కీల‌మైన ప్ర‌తిపాద‌న ఏంటంటే.. గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్‌కు ఆధార్‌తో అనుసంధానం చేయ‌డం! స్పోర్ట్స్ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్ అంటే ఆస‌క్తిగ‌ల వారు.. త‌మ ఆధార్‌ను బెట్టింగ్ ఫ్రొఫైల్‌కు లింక్ చేసుకుని ఆన్‌లైన్లోనే సులువుగా ఆడుకోవ‌చ్చు. ఆధార్ లేదా పాన్ కార్డును అనుసంధానం చేసుకుంటారో వాళ్ల అకౌంట్లన్నీ చ‌ట్ట‌ప‌రిధిలోకి వ‌చ్చేస్తాయి. లావాదేవీల‌న్నీ పారద‌ర్శ‌కంగా ఉంటాయి. ఫ‌లితంగా బ్లాక్ మ‌నీ పెరిగే అవ‌కాశ‌మే ఉండ‌దు. సులువుగా వీరికి వ‌చ్చే ఆదాయంపై ట్యాక్స్ విధించొచ్చు. అయితే ప్ర‌తి బెట్టింగ్‌ను ఆట‌కీ అనుమ‌తించ‌కూడ‌ద‌ని లా క‌మిష‌న్ సూచించింది.  నైపుణ్యాధారిత‌(skill based) ఆట‌ల‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని తెలిపింది. మ‌న‌దేశంలో అత్యంత ఆద‌ర‌ణ గ‌ల క్రికెట్‌లో బెట్టింగ్ ప్ర‌వేశ‌పెట్టాలా? వ‌ద్దా? అనే అంశంపై మాత్రం లా క‌మిష‌న్‌ ఎటువంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

betting gambling aadhar leagalize cricket law commission లా కమిషన్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఆధార్