స్మార్ట్ ఫోన్... ఆధునిక నిత్యావసరాల్లో ఒకటిగా- కాదు... కాదు...జీవితంలోనే ఒక భాగమై చివరకు నేడు ఒక వ్యసనం (Nomophobia) స్థాయికి చేరింది. కాబట్టే ‘‘ఫోన్ లేనిదే నేనిప్పుడు బతకలేను... అది నా జీవితావసరాలు తీర్చే వనరు. దాన్ని నా వినోదం కోసం కూడా వాడుకుంటుంటాను. నేను కాసేపయినా నిద్రపోతానుగానీ, దానికి విశ్రాంతి (switch off) లేనేలేదు’’ అని చాలామంది చెబుతుంటారు కూడా. నిజమే... అదీఇదీ అని లేకుండా ప్రతి పనికీ ఫోన్ ప్రధాన ఉపకరణంగా మారిపోయిన రోజులివి. రకరకాల యాప్‌లు రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఫోన్ సామర్థ్యాన్నిబట్టి మన రక్తపోటు గురించి, తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ మన ఆరోగ్య సంరక్షణ బాధ్యతనూ అవి స్వీకరించిన తరుణమిది. అయితే, ఇలా ఫోన్‌కు బానిసలైపోవడాన్ని ప్రస్తావిస్తూ- ఇది మన మెదడు పనితీరును కూడా మార్చేస్తోందని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఫోన్ ప్రధానంగా ఉపయోగపడేది కాల్స్ చేయడం కోసమే. కానీ, ఇవాళ అదొక బహుళ ప్రయోజన ‘జీవిత భాగస్వామి’ అయిపోయింది. అడుగడుగునా ఫోన్ సాయం నేడు తప్పనిసరిగా మారింది. మన పనుల్లో భాగం పంచుకోవడమే కాదు... వినోదంద్వారా విసుగునుంచి విముక్తి కల్పించడంలో కూడా అదొక కీలక ఉపకరణమైపోయింది. మన ఆలోచనలను, అవసరాలను జ్ఞాపకం ఉంచుకుని, సమయానికి వాటిని గుర్తుచేసే సహాయకుడి పాత్రను స్మార్ట్ ఫోన్ ఇప్పుడు సమర్థంగా పోషిస్తోంది. ఇవన్నీ అటుంచితే ఫోన్ ఒక వ్యసనంగానూ తయారై మన మెదడును ఎంతలా కలుషితం చేసే పరిస్థితి ఏర్పడిందంటే- ఈ వ్యసనాన్ని వదిలించుకోవడానికి మనం రకరకాల పద్ధతులను ఆశ్రయించే దుస్థితి వచ్చింది. చివరకు ‘‘యజమాని తననుంచి ఎలా విముక్తి పొందాలో సేవక స్మార్ట్ ఫోన్లే’’ చెప్పే రోజొచ్చిందిప్పుడు:-
స్క్రీన్-టైమ్; డిజిటల్ వెల్-బీయింగ్
ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ మన ఫోన్ వాడకం పర్యవేక్షణలో సాయపడగల అప్లికేషన్లను రూపొందించాయి. నిద్రపోవాల్సిన సమయం రాగానే ఇక ఫోన్ వాడొద్దని అవి మనకు సూచిస్తాయి. ఇందులో ‘iOS 12’ స్క్రీన్ టైమ్ డిఫాల్ట్‌గా ఆన్ అయ్యే సదుపాయంతో వచ్చింది. రాత్రి 10 గంటలు కాగానే ఫోన్లోని అప్లికేషన్లన్నీ డిమ్ అయిపోతాయి. స్క్రీన్ మీద క్లిక్ చేయగానే అవర్ గ్లాస్ ప్రత్యక్షమై ‘‘Ignore Screen Time for 15 minutes’’ అని లేదా ‘‘Ignore it for the day’’ అని ఆప్షన్ ఇస్తుంది. ‘స్క్రీన్ టైమ్’లో రోజువారీ, వారంవారీ ఫోన్ వాడకం నివేదిక ఉంటుంది. పైగా ఇది ‘సోషల్ నెట్ వర్కింగ్, ప్రాడక్టివిటీ, క్రియేటివిటీ’’ విభాగాలుగా వర్గీకరించబడి ఉంటుంది. అత్యధికంగా వాడిన యాప్స్, ఓ గంటలో ఎన్నిసార్లు పోన్ వాడిందీ, నోటిఫికేషన్ల ఫ్రీక్వెన్సీ తదితరాలన్నీ ఉంటాయి. వీటన్నిటి ఆధారంగా ‘డౌన్‌టైమ్’ టైమింగ్స్ సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 7:00 గంటలుగా డౌన్‌టైమ్ సెట్ చేశామనుకుందాం. రాత్రి 10:30 గంటలకు ఇక 5 నిమిషాలు ఉందనగా డౌన్‌టైమ్ మొదలు కాబోతోందన్న మెసేజ్ చూపుతుంది. అది మొదలయ్యాక మనం అన్‌చెక్ చెయ్యని యాప్స్ తప్ప మిగిలినవన్నీ స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత మనం స్వయంగా ఏదైనా యాప్ ఓపెన్ చేసి ‘‘ignore Downtime’’ను సెలెక్ట్ చేస్తేతప్ప ఏ నోటిఫికేషన్లూ రావు.
ప్రపంచవ్యాప్తంగా ఫోన్ బానిసత్వం ఒక వాస్తవ సమస్యగా గుర్తించిన కారణంగానే గూగుల్, యాపిల్ ఈ అప్లికేషన్లను రూపొందించి ఉండొచ్చు. ఈ ‘డిపెండెన్స్ సిండ్రోమ్’ బారినుంచి మనం వాస్తవ ప్రపంచంలోకి వచ్చేందుకు ఇలా ఫోన్ వాడకపు సమాచారం ఇవ్వడమన్నది తొలి అడుగుగా భావించవచ్చు. వ్యసనమంటే.. ఒకసారి అలవాటుపడ్డాక దాన్నుంచి బయటపడటం చాలాచాలా కష్టమైనది. కానీ, మనసుంటే మార్గమూ ఉంటుందన్న సూక్తిని ఇక్కడ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అందులో భాగంగా మనం సవ్యంగా వ్యవహరించేలా వెలుపలినుంచి ఒకరకమైన ఒత్తిడి ఉండటం కూడా మంచిదే. ఈ దిశగా తప్పటడుగైనా వేయడం కోసం ఈ యాప్ కాస్త సాయం పడుతుంది కాబట్టి ఇప్పటికైతే దీన్ని మన వ్యసనాన్ని వదిలించే సత్ప్రయత్నంగానే భావించాలి.
Nomophobia  Android  iOS  Apps