ఫుడ్ బ్లాగర్ల ప్రమోషన్.. రెస్టారెంట్లకు వరమా? శాపమా? ఒక హోటల్‌ను అమాంతం పైకి లేపాలన్నా.. క్షణాల్లో కిందకి పడేయాలన్నా సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లకే సాధ్యం అవుతున్న రోజులివి. అయితే, వ్యాపారాన్ని పెంచుతారనుకున్న ఈ బ్లాగర్ల వల్లే.. ఇప్పుడు చాలా మంది రెస్టారెంట్ యాజమాన్యాలకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందనే ఆందోళన మొదలైంది. మరి వీరి వల్ల హోటల్ బిజినెస్ ఎలాంటి సవాళ్లు, నష్టాలు ఎదుర్కొంటోంది? దీని వెనుక ఉన్న నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఆర్థిక వేధింపులు & అనైతిక ప్రవర్తన
ఉచితాల కోసం బెదిరింపులు: తక్కువ ఫాలోవర్లు ఉన్న బ్లాగర్లు కూడా ఉచితంగా ఆహారం డిమాండ్ చేస్తున్నారు. బిల్లు కట్టకపోతే సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూలు పెడతామని ఓనర్లను ఓపెన్‌గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
డబ్బుల కోసం అబద్ధాలు: భారీగా డబ్బులు తీసుకుని, క్వాలిటీ లేని హోటళ్లను కూడా ఇన్ఫ్లూయన్సర్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ ఫేక్ ప్రమోషన్లు నమ్మి వెళ్లిన కస్టమర్లు మోసపోయామని గ్రహించి, ఆ రెస్టారెంట్ వైపు చూడట్లేదు.
పోటీదారుల కుట్రలు: ప్రత్యర్థి రెస్టారెంట్ల నుంచి డబ్బులు తీసుకుని, ఒక నిర్దిష్ట హోటల్‌పై నెగటివ్ ప్రచారం చేసే వ్లాగర్లు పెరిగారు. ఫుడ్‌లో పురుగులు వచ్చాయంటూ ఫేక్ వీడియోలు సృష్టించి ఇమేజ్డ్యామేజ్ చేస్తున్నారు.
చిన్న హోటళ్లపై ఆర్థిక వేధింపులు: ఉచితంగా ఇవ్వకపోతే బ్లాగర్లు చేసే... నెగటివ్ ప్రచారానికి భయపడి, నష్టాల్లో ఉన్నా వీరికి చిన్న స్ట్రీట్ ఫుడ్ బండ్ల లేదా చిన్న హోటళ్ల నిర్వాహకులు ఉచితంగా ఫుడ్ పెట్టాల్సి వస్తోంది.
కమీషన్ల కోసం కక్కుర్తి: రెస్టారెంట్ల నుండి రహస్యంగా కమీషన్లు ఆశించిన కొంతమంది ఇన్ఫ్లూయన్సర్లు.. ఏవరేజ్ ఫుడ్ ఉన్న చోట కూడా "మస్ట్ ట్రై" అంటూ చెప్తారు. దీనివల్ల కస్టమర్ల సమయం, డబ్బు వృథా అవుతున్నాయి.
రెస్టారెంట్ కస్టమర్లకు ఇబ్బందులు
కస్టమర్ల ప్రైవసీ భంగం: రింగ్ లైట్లు, కెమెరాలతో టేబుళ్ల చుట్టూ తిరుగుతూ షూటింగ్స్ చేయడం వల్ల కస్టమర్లకు ఇబ్బంది కలుగుతుంది. పక్క టేబుల్స్ వారి ముఖాలు కూడా వీడియోలో పడి వారి ప్రైవసీ దెబ్బతింటుంది.
ప్రశాంతమైన వాతావరణం నాశనం: కెమెరా ముందు అతిగా, వింత హావభావాలతో అరుస్తూ ఇన్ఫ్లూయన్సర్లు రివ్యూలు ఇస్తుంటారు. దీనివల్ల రెస్టారెంట్లో ప్రశాంతమైన వాతావరణం దెబ్బతింటుంది.
మెనూ ధరల పెరుగుదల: ఇన్ఫ్లూయన్సర్ల ప్రమోషన్ల ఖర్చులను కవర్ చేయడానికి ఓనర్లు డిషెస్ ధరలను పెంచేయడం వల్ల సాధారణ కస్టమర్ల జేబులకు చిల్లు పడుతోంది.
మేనేజ్మెంట్ సవాళ్లు - నాణ్యత లోపాలు
రద్దీతో మేనేజ్మెంట్ వైఫల్యం: రీల్ వైరల్ అయితే, మరుసటి రోజు నుంచే కస్టమర్లు హోటల్‌కు క్యూ కడతారు. అంతమందికి సరిపడా స్టాఫ్, మెటీరియల్ లేకపోవడం వల్ల సర్వీస్ ఆలస్యమై, రెస్టారెంట్‌కు చెడ్డపేరు వస్తుంది.
ఫుడ్ క్వాలిటీ పడిపోవడం: ఒకేసారి వచ్చే భారీ క్రౌడ్‌ను తట్టుకోవడానికి కిచెన్ స్టాఫ్ కంగారుగా వండాల్సి వస్తుంది. దీనివల్ల వంటల్లో నాణ్యత, రుచి తగ్గిపోయి కస్టమర్లు నెగటివ్ ఇంప్రెషన్‌తో వెనుదిరుగుతారు.
వన్-టైమ్ వండర్ సిండ్రోమ్: హైప్ చూసి వచ్చే జనాలు కేవలం ఒక్కసారి ట్రై చేయడానికి వస్తారు తప్ప, వారు రెగ్యులర్ కస్టమర్లు కారు. సోషల్ మీడియా ట్రెండ్ అయిపోగానే రెస్టారెంట్ మళ్లీ ఒక్కసారిగా ఖాళీ అయిపోతుంది.
అదనపు పెట్టుబడి భారం: రద్దీని తట్టుకోవడానికి ఓనర్లు కొత్త స్టాఫ్‌ను నియమించి, భారీగా మెటీరియల్ కొంటారు. కానీ ట్రెండ్ ముగిశాక ఆ పెంచిన ఖర్చులు, స్టాఫ్ జీతాలు రెస్టారెంట్‌కు పెద్ద ఆర్థిక భారంగా మారుతాయి.
ఆహార నాణ్యత, పరిశుభ్రత & వృథా
విజువల్స్‌కే ప్రాధాన్యం: ఇన్ఫ్లూయన్సర్లకు రుచి కంటే కెమెరాలో అది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందనేదే ముఖ్యం. చీజ్ ఎక్కువగా లాగడం, ఫుడ్ కలర్స్ వాడమని కిచెన్ స్టాఫ్‌ను ఒత్తిడి చేసి అసలు రుచిని మారుస్తున్నారు.
భారీగా ఆహార వృథా: థంబ్‌నైల్స్ అందంగా కనిపించడం కోసం టేబుల్ నిండా పదుల సంఖ్యలో ఐటమ్స్ ఆర్డర్ చేస్తారు. కేవలం కెమెరా ముందు ఒక్క ముద్ద తిని, షూట్ అయిపోయాక ఆ ఆహారాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతారు.
కిచెన్ హైజీన్‌ను దెబ్బతీయడం: హెయిర్ నెట్స్, గ్లోవ్స్ వంటి కనీస నియమాలు పాటించకుండా కిచెన్ లోపలికి ఇన్ఫ్లూయన్సర్లు వెళ్లడం వల్ల ఆహార పరిశుభ్రత దెబ్బతింటుంది.
అనారోగ్యకరమైన వంటకాలకు ప్రచారం: ఆయిల్, చీజ్, బటర్ వేసే వంటకాలను ఎక్కువగా ప్రమోట్ చేయడం పరోక్షంగా ప్రజల ఆరోగ్య అలవాట్లను దెబ్బతీస్తోంది. ఒక రకంగా జంక్ ఫుడ్ వైపు వెళ్లేలా చేస్తోంది.
అల్గారిథం నష్టాలు
అనుభవరాహిత్యంతో రేటింగ్స్: నేటి ఇన్ఫ్లూయన్సర్లలో చాలా మందికి ఆహార తయారీపై కనీస అవగాహన లేకపోవడంతో తమకు నచ్చకపోతే, అది చెత్త ఫుడ్ అని డిజిటల్‌గా ముద్ర వేసేస్తారు.
రివ్యూల ఆధారిత నకిలీ అల్గోరిథం: యావరేజ్ హోటళ్లు కూడా ఇన్ఫ్లూయన్సర్ల రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో టాప్‌లో కనిపిస్తాయి. దీంతో రుచి, క్వాలిటీని అందించే ప్రామాణికమైన హోటళ్లు వెనకబడుతున్నాయి.
రెస్టారెంట్లు ఇన్‌ఫ్లూయన్సర్లపై మాత్రమే ఆధారపడటం మాని, తమ ఫుడ్ క్వాలిటీ, కస్టమర్ సర్వీస్‌ను నమ్ముకోవాలి. అలాగే బ్లాగర్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, రుచికి మరియు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిజాయితీ గల రివ్యూలు ఇచ్చినప్పుడే అటు రెస్టారెంట్ పరిశ్రమ, ఇటు సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ రంగం రెండూ నష్టపోకుండా మనుగడ సాగించగలవు.
Food Bloggers Restaurant Business Social Media Influencers Food Blogging Downside Influencer Marketing Digital Extortion Fake Reviews Paid Promotions Food Wastage Restaurant Losses Overhyped Food Privacy Issues Restaurant Industry Hospitality Challenges Food Reviews Restaurant Management Food Industry News Social Media Hype Instagram Food Bloggers Influencer Culture Business Risks Consumer Trust