వాట్సాప్‌లో లేనివి కింబోలో ఉన్న 7 ఫీచ‌ర్లు తెలుసా మీకు

సోష‌ల్ మెసేంజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌, హైక్‌, ఫేస్‌బుక్ వంటివి అగ్ర‌స్థానంలో ఉన్నాయి. వీటికి పోటీగా ఏ యాప్ వ‌చ్చినా.. అది వాటి రేంజ్‌కి వెళ్ల‌లేకపోతోంది. కానీ ఒకే ఒక్క యాప్ ఇప్పుడు వీటితో స‌మానంగా క్రేజ్ సంపాదించింది. యాప్ విడుద‌లైన మూడు గంట‌ల్లోనే దాదాపు 15 ల‌క్ష‌ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ అనూహ్య‌మైన, భారీ స్పంద‌న‌, సైట్‌ ట్రాఫిక్ త‌ట్టుకోలేక‌ కొద్ది స‌మ‌యంలోనే దీనిని బ‌ల‌వంతంగా తొల‌గించారు. మ‌రి ఇంత‌టి ఆద‌ర‌ణ పొందిన యాప్‌.. ప‌తంజ‌లి క‌మ్యూనికేష‌న్స్ రూపొందించిన Kimbho. ఆయుర్వేద ఉత్ప‌త్తుల్లోనే కాదు.. టెలీ క‌మ్యూనికే షన్ రంగంలోనూ ప‌తంజ‌లి అడుగుపెట్టింది. సోష‌ల్ మెసేంజింగ్ యాప్స్‌కి పోటీగా త‌యారుచేసిన ఈ యాప్.. ఆగ‌స్టు 27 నుంచి ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ప్లేస్టోర్‌ల‌లో మ‌రోసారి అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీనిపై ఎందుకింత క్రేజ్ ఏర్ప‌డింది?  వాట్సాప్‌లో లేని ఈ యాప్‌లో ఉన్న ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్లు ఏంటి? అనే సందేహం రాక‌మాన‌దు. వీటి మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం ఏంటో తెలుసుకుందాం!

* `స్వ‌దేశీ వాట్సాప్` పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌లో.. వాట్సాప్‌లో లేని 7 టాప్ ఫీచ‌ర్లు ఉన్నాయి. వాట్సాప్‌లో ముఖ్య‌మైన‌ డాక్యుమెంట్లు, సాఫ్ట్‌కాపీలు సులువుగా పంపించే వెసులుబాటు ఉండ‌టంతో ఎవ‌రూ ఈమెయిల్స్ ఉప‌యోగించ‌డం లేదు. అయితే వీటిలో కొన్నిసార్లు మార్పులు చేయాలంటే క‌ష్టం. ఈ కింబో యాప్‌లో  డాక్యుమెంట్లు పంపించ‌డంతో పాటు.. వాటిలో మార్పులు, చేర్పులు చేసుకునే ఆప్ష‌న్ కూడా ఉంటుంది.  

* వాట్సాప్‌ను ఒక‌టి కంటే ఎక్కువ డివైజెస్‌లో ఉప‌యోగించ‌లేం. కానీ కింబో మ‌ల్టిపుల్ డివైజెస్‌లో యాక్సెస్ చేయచ్చు. లాగిన్ ఐడీ ద్వారా.. ఎక్కువ డివైజెస్‌లో ఒకే స‌మ‌యంలో లాగిన్ అవ్వొచ్చు. అంతేగాక డెస్క్‌టాప్ బ్రౌజ‌రోలోనూ ఉప‌యోగించ‌వ‌చ్చు. 

* మ‌రో ముఖ్య‌మైన ఫీచ‌ర్ ఏంటంటే.. కాల్ ట్రాన్స్ఫ‌ర్‌! ఒకేసారి రెండు డివైజెస్‌లో లాగిన్ అయితే.. ఒక డివైజ్‌కి కాల్ వ‌చ్చిన సమ‌యంలో వేరొక‌రు ఫోన్ చేస్తే.. మ‌ధ్య‌లో అంత‌రాయం క‌ల‌గ‌కుండా, పాజ్ చేయ‌కుండా కాల్‌ని మ‌రో డివైజ్‌కి సులువుగా బ‌దిలీ చేసుకోవ‌చ్చు. 

* వాట్సాప్‌లో లానే కింబో యాప్‌లోనూ ప్రొఫైల్ పిక్చర్‌(డీపీ)ని పెట్టుకోవ‌చ్చు. కొంత స‌మ‌యం త‌ర్వాత ఆటోమేటిక్‌గా దీనిని తొల‌గించే ఆప్ష‌న్ కూడా ఉంటుంది. ముఖ్య‌మైన రోజులు, పుట్టిన‌రోజు వంటి స‌మ‌యాల్లో ప్రొఫైల్ పిక్చ‌ర్ మారుస్తూ ఉంటాం. కేవ‌లం ఆ రోజు మాత్ర‌మే డీపీ కనిపించి.. త‌ర్వాత డీపీ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయేలా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవ‌చ్చు. 

* వీడియో కాల్ మాట్లాడుతున్న స‌మ‌యంలోనే జూమ్ చేసే ఆప్ష‌న్ ఈ యాప్‌లో ఉంది. నెట్‌వ‌ర్క్ క‌నెక్ష‌న్ స‌రిగా లేని స‌మ‌యంలో, ఇంట‌ర్నెట్ స్పీడ్ త‌క్కువ‌గా ఉన్నప్పుడు.. ఈ ఆప్ష‌న్ మ‌రింత మెరుగ్గా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

* స్వ‌దేశీ ఎమోజీలు, స్టిక్క‌ర్లు అందుబాటులో ఉంటాయి. ఇప్ప‌టికే హైక్ ఇటువంటి వాటిని ప్ర‌వేశ‌పెట్టింది. వాట్సాప్‌లో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ కూడా ఇదే! కింబో యాప్‌లో ఈ స్వ‌దేశీ ఎమోజీలు, డూడుల్స్‌, స్టికర్స్ భారీ మొత్తంలో ఉంటాయి. 

* ఈ కింబో యాప్ ద్వారా యూపీఐ ఆధారిత‌ పేమెంట్స్ కూడా చేయ‌వ‌చ్చు. ఈ ఆప్ష‌న్‌ను యాప్‌లో తీసుకొస్తామ‌ని ప‌తంజలి క‌మ్యూనికేష‌న్స్ తెలిపింది. ప్ర‌స్తుతం ఈ ఆప్ష‌న్ వాట్సాప్‌లో ఉన్నా.. కొన్ని సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో స‌ర్వీస్ నిలిచిపోయింది. ఈ పేమెంట్స్ విష‌యంలో వాట్సాప్‌ని కింబో అధిగ‌మించే అవ‌కాశం ఉంది. 

kimbho patanjali telecommunication app whatsapp vs kimbho hike facebook new features in kimbho