వాట్సాప్‌లో వ‌స్తున్న పాపుల‌ర్ బ్రాండ్ నేమ్స్ వోచ‌ర్స్‌-తస్మాత్ జాగ్ర‌త్త‌

పాపుల‌ర్ బ్రాండ్‌ల పేరిట ఇటీవ‌ల వాట్సాప్‌లో ఫేక్ న్యూస్‌లతో పాటు వెబ్‌సైట్ లింకులు విప‌రీతంగా స‌ర్క్యులేట్ అవుతున్నాయి. వీటి మీద క్లిక్ చేసి వ్య‌క్తిగ‌త స‌మాచార‌మంతా ఇచ్చేస్తున్న‌ వారి సంఖ్య పెరుగుతోంది. ముందూ వెనుక చూసుకోకుండా ఇలాంటి సైట్ల‌లో స‌మాచారం ఇవ్వొద్ద‌ని సైబ‌ర్ పోలీసులు, నిపుణులు స్ప‌ష్టంచేస్తున్నారు. ఫేక్ వోచ‌ర్స్‌తో అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే మ‌న వ్య‌క్తిగ‌త‌ స‌మాచారాన్ని మ‌న‌మే నేర‌గాళ్ల చేతుల్లో పెట్టిన‌ట్లు అవుతుంద‌ని  చెబుతున్నారు.

డీమార్ట్‌కు ప్ర‌జ‌ల ప‌రుగులు
ప్ర‌స్తుతం ఇలా వాట్సాప్‌లో స‌ర్క్యులేట్ అయిన లింకుల‌పై క్లిక్ చేసి మోస‌పోయిన వాళ్లు పోలీస్‌స్టేష‌న్ల ముందు బారులు తీరుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు కేసులు న‌మోద‌య్యాయ‌ని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటిదే మ‌రో కేసు మ‌రొక‌టి జూన్ మొద‌టి వారంలో న‌మోదైంద‌ని తేలింది. “D-Mart is giving FREE INR2500 shopping voucher to celebrate its 17th anniversary. Click here to get yours (link). Enjoy”, అంటూ వాట్సాప్‌లో లింక్ విప‌రీతంగా చ‌క్కెర్లు కొట్టింది. ఈ లింక్‌పై క్లిక్ చేసి వ్య‌క్తి గ‌త స‌మాచారాన్ని ఇచ్చేశార‌ని పోలీసులు తెలిపారు. ఈ లింక్‌ను నిశితంగా గ‌మ‌నిస్తే ఈ వెబ్‌సైట్ లింక్లో ‘i’ అనే అక్ష‌రాన్ని.. అలా క‌నిపించే అక్ష‌రంతో మార్చార‌ని వివ‌రించారు. ఇలా స‌మాచార‌మిచ్చిన వారంతా  చివ‌ర‌కు D-Mart స్టోర్‌ల‌కు ప‌రుగులు పెట్టారు. తాము మోస‌పోయామ‌ని గమ‌నించి.. పోవాయ్ పోలీస్ స్టేష‌న్‌లో జూన్ 19న ఫిర్యాదు చేశార‌ట‌. ఈ కేసు విచార‌ణ చేసిన పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈ లింక్‌ను కెనడాలోని కొన్ని స‌ర్వ‌ర్ల‌ నుంచి అప్‌లోడ్ చేసిన‌ట్లు గుర్తించామ‌న్నారు. చాలామంది ఇందులో త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను న‌మోదు చేశార‌ని వివ‌రించారు. 

ఇలాంటి లింకులే మ‌రికొన్ని..
ఈ ఏడాది మేలో వాట్సాప్‌లో Jet Airways పేరిట మ‌రో లింక్ విప‌రీతంగా సర్క్యులేట్ అయింది. “Jetairways Airline is giving 2 Free Tickets to everyone. To celebrate their 25th anniversary. Click here to get yours (link).” అయితే ఇది ఫేక్ అని Jet Airways ట్వీట్ చేసింది. ఇదే విధంగా ఫిబ్ర‌వ‌రిలోనూ అడిదాస్ కంపెనీకి చెందిన మెసేజ్ పాపుల‌ర్ అయింది. “Adidas is giving away 3000 Free Pair of shoes to celebrate its 93rd anniversary. Get your free shoes at (link),” అంటూ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయింది. త‌ర్వాత దీనిపై అడిదాస్ క్లారిటీ ఇచ్చింది. ఇటువంటి ఆఫ‌ర్ తాము ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టంచేసింది. 

వెబ్‌సైట్ అడ్రస్‌లో మార్పులు
ఇలాంటి ఫేక్ లింక్‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌తో పాటు నిపుణులు సూచిస్తున్నారు. ఈ లింకుల ద్వారా ప్ర‌జ‌ల స‌మాచారాన్ని సేక‌రించి డేటాబేస్‌లో ఉంచుతార‌ని, త‌ర్వాత ఒక్కొక్క‌రినీ ల‌క్ష్యంగా చేసుకుంటార‌ని, ఈ లింకుల‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని మ‌హారాష్ట్ర ఐజీ(సైబ‌ర్ క్రైమ్‌) బ్రిజేష్ సింగ్ తెలిపారు. నేర‌గాళ్లు `వెబ్‌సైట్ స్పూఫింగ్‌` కు పాల్ప‌డుతుంటార‌ని మ‌రో అధికారి తెలిపారు. ఎవ‌రికీ ఎటువంటి అనుమానం రాకుండా, అస‌లైన వెబ్‌సైట్‌ను పోలిన మ‌రో వెబ్‌సైట్‌ను రూపొందిస్తార‌ని వివ‌రించారు. ఎవ‌రూ గుర్తించ‌లేని చిన్న‌చిన్న మార్పులు ఈ అడ్ర‌స్‌లో చేస్తార‌ని వివ‌రించారు. ఫ‌లితంగా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఒరిజిన‌ల్ సైట్‌లోనే ఉన్నామ‌నే క‌లిగించేలా మాయ‌చేస్తార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం పాపుల‌ర్ బ్రాండ్‌ల పేరుతో మోస‌గించ‌డం ఒక ట్రెండ్‌లా మారిపోయింద‌ని, ఈ ఫేక్ వెబ్‌సైట్లు ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి డ‌బ్బులు డిమాండ్ చేస్తుంటాయ‌ని సైబ‌ర్ ఎక్స్‌ప‌ర్ట్ విక్కీ షా తెలిపారు.

 

watsapp vouchers links cyber popular brands వాట్సాప్ వోచర్లు వెబ్ సైట్ అడిడాస్ ఫేక్ పాపులర్ సైబర్ నేరాలు