తక్షణ మెసేజ్ (IM)లు 1990 ద‘శకం’లో ప్రారంభమయ్యాయి. ఆనాటి తొలి మెసేజింగ్ వేదికలలో AOL, యాహూ యాజమాన్యంలోని Ytalk ముఖ్యమైనవి. అయితే, అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు రంగ ప్రవేశం చేశాక ఈ తక్షణ మెసేజింగ్‌ను విప్లవాత్మక రీతిలో మార్చేసి, మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. ఈ కొత్త యుగపు తక్షణ మెసేజింగ్ యాప్‌లకు వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ ప్రధాన నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అయితే, వీటికన్నా భిన్నమైనవేగాక తమదైన విశిష్ఠత, ప్రత్యేకతలున్న IM అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్‌లు చాలానే ఉన్నాయి. వాటిలో ఆండ్రాయిడ్, ఐవోఎస్ వేదికలు రెండింటిలోనూ ఉపయోగపడే ఓ ఐదింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం:
1) HIKE
ఈ ఉచిత మెసెంజర్ 2012లో రూపొందించబడింది. దీన్ని 10 భాషల్లో టెక్స్ట్ మెసేజింగ్‌కు వాడుకునే వెసులుబాటు మాత్రమేగాక ఆడియో కాల్స్ చేసుకునే వీలుంది. ఆఫ్‌లైన్‌లోనూ మెసేజింగ్ అవకాశం ఉండటం ఈ యాప్‌లోని కీలక సదుపాయాల్లో ఒకటి. అంటే దీని వాడకందారులకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా తక్షణ మెసేజ్‌లు పంపించడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్న మాట! ఇందులోని Hidden modeతోపాటు 20వేల స్టిక్కర్లు, మెరుగైన సెక్యూరిటీసహా మరెన్నో ఆసక్తికరమైన ఫీచర్లున్నాయి. వినియోగదారులు తమ చాట్‌ను నిర్దిష్ట కాంటాక్ట్స్‌తో హైడ్ చేసుకోవచ్చు. అప్పుడవి మెయిన్ చాట్ స్క్రీన్‌పై కనిపించవు. హైక్‌లో 128-బిట్ ఎన్‌క్రిప్షన్‌ను ఎనేబుల్ చేసుకునే ఆప్షన్ ఉంది. అందువల్ల యూజర్లు, హ్యాకర్లు ఒకే వైఫై యాక్సెస్ పాయింట్‌లో కనెక్ట్ అయి ఉన్నా హైక్ మెసేజ్‌లను హ్యాక్ చేయడం వీలుకాదు.
హైలైట్: విస్తృత ఫీచర్లు
2) SKYPE
స్కైప్ మొదట 2003లో రంగంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు 2011లో మైక్రోసాఫ్ట్ దీన్ని 290 కోట్ల డాలర్ల భారీ మొత్తంతో టేకోవర్ చేసింది. వీడియో చాట్‌కు వీలు కల్పించిన తొలినాటి సాఫ్ట్‌వేర్‌లలో ఇదొకటి. దీని మొబైల్ వెర్షన్‌లో ఉచిత వాయిస్-వీడియో కాల్స్‌తోపాటు టెక్స్ట్ మెసేజింగ్ కూడా వీలవుతుంది. వీడియో కాల్స్ విషయానికొస్తే స్కైప్ మొబైల్‌ద్వారా సుమారు 24 కాంటాక్ట్స్‌తో ఒకేసారి కనెక్ట్ కావచ్చు. ఇతర IMల తరహాలోనే సేవ్డ్ కాంటాక్ట్స్‌తో మనం ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవచ్చు.
హైలైట్: అత్యుత్తమ వీడియో కాల్ సపోర్ట్
3) DISCORD
ఇదొక క్రాస్ ప్లాట్‌ఫామ్ టెక్స్ట్, వాయిస్ చాట్ యాప్. ప్రత్యేకించి గేమింగ్ ప్రియులకోసం ఇది రూపొందించబడింది. విభిన్నమైన టాపిక్స్, సబ్జక్ట్స్ కోసం ప్రత్యేక చానళ్లను దీనిలో సృష్టించుకోవచ్చు. తమ బృంద సభ్యుల్లో ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో, వారు ఏ గేమ్ ఆడుతున్నారో ఈ యాప్ వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. కొత్తవారిని నిర్దిష్ట గ్రూపులో చేరాల్సిందిగా కోరుతూ Discordద్వారా ఇన్‌వైట్ లింక్స్ పంపడం చాలా సులువు. ఇదొక వెబ్ ఆధారిత IM కాబట్టి వినియోగదారులు ఏ డివైజ్‌ద్వారానైనా లాగిన్ కావచ్చు. వీటన్నిటితోపాటు తమ స్క్రీన్ క్యాస్ట్‌ను మిత్రులు, భాగస్వాములతో వాడకందారులు షేర్ చేసుకోవచ్చు.
హైలైట్: గేమర్స్‌కు ప్రత్యేకం
4) SIGNAL
భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ రూపొందించినదే ‘సిగ్నల్.’ ఇది 2013లో ఉనికిలోకి రాగా, ఏకంగా 31 అంతర్జాతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇదొక ఓపెన్ సోర్స్ మెసేజింగ్ యాప్ కాబట్టి కోడ్ ఆడిటింగ్‌ద్వారా భద్రతను చెక్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఈ స్థాయి భద్రతనందించే ప్రైవేట్ మెసెంజర్ ‘సిగ్నల్’ ఒక్కటే. ఇది గ్రూప్‌చాట్, టెక్స్ట్ మెసేజింగ్, ఆడియో/వీడియో కాల్స్, ప్రైవేట్ మీడియా షేరింగ్‌లను సపోర్ట్ చేస్తుంది.
హైలైట్: భద్రత
5) SLACK
ఈ క్లౌడ్ ఆధారిత సంయుక్త ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ 2013లో ఏర్పాటైంది. గ్రూపులు, కమ్యూనిటీలు లేదా జట్లు నిర్దిష్ట ఇన్విటేషన్ లింక్‌ద్వారా లేదా టీమ్ అడ్మిన్‌ద్వారా మాన్యువల్‌గా ఇందులో చేరవచ్చు. ఇది GitHub, Google Drive, Dropbox, IBM Bluemix వంటి చాలా థర్డ్ పార్టీ సేవలను సమన్వయం చేస్తుంది. కంపెనీలలో సంబంధిత వాతావరణం సృష్టించేందుకు ‘శ్లాక్’ ఎంతో అనువైనది. ఇదొక ‘ఫ్రీమియమ్’ సాఫ్ట్‌వేర్ కాబట్టి... ఇందులోని ప్రాథమిక ఫీచర్లన్నీ ఉచితంగా వాడుకోవచ్చు. వాటికి అదనంగా అన్‌లిమిటెడ్ యాప్ ఇంటెగ్రేషన్, 10వేలకుపైగా ఆర్కైవ్డ్ మెసేజ్ సెర్చ్‌వంటి సదుపాయాలు కావాలంటే నిర్దిష్ట మొత్తంతో చందాదారు కాకతప్పదు.
Messengers  Best IMs  Highlights