స్మార్ట్‌ఫోన్‌ను కొంచెం పాతబడిందంటే దాని మీద మోజు తగ్గిపోతుంది. ఎప్పుడెప్పుడు కొత్త ఫోన్ కొందామా అని ఆతృతగా ఎదురు చూస్తుంటాం. దీనికి కారణం మన డివైజ్ అప్‌డేటెడ్‌గా లేకపోవడమే. అయితే కొత్త ఫోన్ కొనకపోయినా.. పాత ఫోన్‌తోనే కొత్త ఫీచర్లను వాడుకునే సౌలభ్యం వచ్చింది. దీనికి ఒక యాప్ అందుబాటులో ఉంది. అదే యాప్ పేరు కోర్. దీంతో మన రోజు వారి షెడ్యుల్‌ను ఒక క్రమపద్ధతిలో చేసుకోవచ్చు. ఇతర వ్యక్తిగత వివరాలను ట్రాక్ చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే మిమ్మల్ని మానిటర్ చేయడానికి ఇదో టూల్‌లో ఉపయోగపడుతుంది.
24/7 ట్రాకర్
మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో ప్లే స్టోర్‌కు వెళ్లి కోర్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది మీకు వారంలో 24 గంటలు మీకు ట్రాకర్‌గా హెల్ప్ చేస్తుంది. మీరు సులభంగా వాడటానికి, రోజు వారి యాక్టివిటీ తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీ దైనందిన జీవితానికి ఇదో సహాయకారిగా ఉంటుంది. ఉదయం వర్క్ ఔట్ నుంచి కారు టైర్లో గాలి వరకు.. మీ పెంపుడు కుక్కకు మేత దగ్గర నుంచి మీ డైరీ రాసే వరకు ఇది అన్ని విషయాలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ముందుగా మీ యాక్టివిటీలను యాడ్ చేయడమే. ప్రతి దానికి ఒక సమయాన్ని కేటాయించాలి. ఆ సమయానికి ముందే ఈ ట్రాకర్ మిమ్మలి అలెర్ట్ చేస్తుంది.
ఏ ఫోన్‌లోనైనా వాడుకోవచ్చు..
కోర్ యాప్‌ను మీ ఫోన్‌లో మాత్రమే కాదు ఏ ఫోన్‌లోనైనా వాడుకోవచ్చు. దీనికో ఐడీ, పిన్ నంబర్‌ను క్రియేట్ చేస్తే చాలు. మీ ఫోన్ల సైన్ ఔట్ చేసి వేరే ఫోన్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా చేయాలంటే ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కొన్ని పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో స్కోర్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే రోజు గడిచే సరికి మీరు ఎన్ని పనులు పూర్తి చేశారనేదే ఈ స్కోరు. మీ ఫోన్ క్యాలెండర్‌లోనూ మీరు పూర్తి చేసిన, పూర్తి చేయని టాస్క్‌ల వివరాలు కనబడుతూ ఉంటాయి.
ఇంకాస్త మెరుగైతే..
పాత ఫోన్లను కొత్త ఫోన్లకు పోటీగా ఉపయోగించేలా చేస్తున్న కోర్ యాప్ మరింత మెరుగైతే కస్టమర్లకు మరింత లబ్ధి చేకూరుతుంది. అంతేకాదు ఈ యాప్ ఎక్కువ ప్రాచుర్యంలోకి కూడా వస్తుంది. సాధారణంగా ఇప్పుడొస్తున్న స్మార్ట్‌ఫోన్లలో వాతావరణం అప్‌డేట్స్, గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ లాంటి ఆధునాతన ఫీచర్లు ఉంటున్నాయి. కోర్‌లోనూ ఈ ఫీచర్లు పెడితే ఇంకా సూపర్. త్వరలోనే ఈ యాప్ మరింత మెరుగ్గా అందుబాటులోకి వచ్చేఅవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.