పెద్దలకు మాత్రమే సినిమాల్లా టీనేజర్లకు మాత్రమే అంటూ ఫేస్ బుక్ కొత్త యాప్ తో ముందుకొస్తోంది. అవును.. త్వరలో టీనేజర్ల కోసం ఫేస్ బుక్ టాక్ అనే కొత్త యాప్ ఞకటి తీసుకురానుంది. ఇందుకు పెద్ద కారణమే ఉంది. ఫేస్ బుక్ ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుతున్నారు. నిజానికి ఫేస్ బుక్ లో అకౌంట్ తెరవాలంటూ కనీసం 13 సంవత్సరాల వయసు ఉండాలి. కానీ, వయసు ఎక్కువగా చూపించి పిల్లలు సైతం ఖాతాలు తెరుస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. దానివల్ల సమస్యలు మాత్రం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 19 ఏళ్ల లోపు వారు ఫేస్ బుక్ వేదికగా ఆన్ లైన్ మోసగాళ్లు , క్రిమినల్స్ బారిన పడి ఆర్థికంగా, లైంగికంగా మోసపోతున్నారట.
దీంతో అలాంటి వారి కోసం ఫేస్‌బుక్ కొత్తగా ఓ యాప్‌ను తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. ఆ యాప్ పేరు.. టాక్. టాక్ యాప్ ను ఫేస్‌బుక్ ప్రస్తుతం అంతర్గతంగా పరీక్షిస్తోంది. త్వరలోనే ఈ యాప్‌ను విడుదల చేయనున్నారు. ఈ యాప్‌ను వాడాలంటే ఫేస్‌బుక్ అకౌంట్ ఉండాల్సిన పనిలేదు.
ప్రధానంగా పిల్లల కోసం ఉద్దేశించిన ఈ సోషల్ మీడియా యాప్ లో పెద్దలు తమ పిల్లలను మోనిటర్ చేసే వీలుంటుంది. తమ పిల్లలు ఫేస్‌బుక్‌లో ఏం చేస్తున్నారో, ఎవరిని కాంటాక్ట్ అవుతున్నారో సులభంగా తెలుసుకునేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడనుంది. దీని వల్ల వారు మోసగాళ్ల బారిన పడకుండా తల్లిదండ్రులు ముందే జాగ్రత్త పడే వీలుంటుంది. అయితే... అసలు ఫేస్ బుక్ కు అలవాటు పడిన టీనేజర్లు దీన్ని ఎంతవరకు ఆదరిస్తారన్నది అనుమానమే. ఒకవేళ్ల పేరెంట్సు బలవంతంపై టాక్ అకౌంట్ ఓపెన్ చేసినా దాంతో పాటూ ఫేస్ బుక్ లోనూ కొనసాగరన్న నమ్మకమేంటి?