పాఠశాలలో పిల్లలు ఎలా చదువుతున్నారో... క్రమం తప్పకుండా క్లాస్‌లకు వెళుతున్నారా! టీచర్లు ఎలా చెబుతున్నారో! ఇవన్నీ తల్లిదండ్రులు సందేహాలు. కానీ వీటన్నిటిని తల్లిదండ్రులకు నేరుగా తెలుసుకునే అవకాశం ఉండదు. మరి తెలుసుకునే అవకాశం ఉంటే! అంతకంటే ఆనందం ఏముంటుంది. అలాంటి పేరెంట్స్‌కోసమే వచ్చింది ఐ బోర్డ్ యాప్. ఈ యాప్ ద్వారా తమ పిల్లలు సక్రమంగా పాఠశాలకు వెళుతున్నారా! సరిగా చదువుకుంటున్నారా అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడమే. పాఠశాలకు అనుసంధానమై ఉండే ఈ సాంకేతికత ద్వారా తల్లిదండ్రులకు మాత్రమే కాదు టీచర్లకు కూడా ఎంతో ప్రయోజనం ఉంది. పేరెంట్స్, టీచర్స్, మేనేజ్‌మెంట్ మధ్య ఈ యాప్ ఒక వారథిలా పని చేస్తుంది.
ఏ పాఠశాలలో అయినా అటెండెన్స్, ఫీజు, మార్కులు మాన్యువల్‌గా చేస్తారు. ఆ తర్వాత ఆ వివరాలన్నిటిని కంప్యూటర్‌లో భద్రపరుస్తారు. అయితే ఇదంతా చాలా సమయం తీసుకుంటుంది. అలా కాకుండా లైవ్‌లో అన్ని నేరుగా కంప్యూటర్‌కే అనుసంధానం అయి ఉంటే ఎంతో సమయం ఆదా అవుతుంది. అంతేకాదు ఏ విషయాన్నైనా అప్పటికప్పుడు పేరెంట్స్, టీచర్లు, విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లల యాక్టివిటీని పర్యవేక్షించడానికి ఐబోర్డ్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. వాళ్లు ఏ సమయంలో పాఠశాలలో ఉన్నారు. ఏ సమయంలో బయటకు వెళ్లారు. ఏ క్లాసుకు హాజరయ్యారు లాంటి వివరాలన్ని ఒక్క క్లిక్‌తో తెలుసుకునే వీలుంది.
బంక్ కొడితే అంతే
ఈ యాప్ పాఠశాలలకు మాత్రమే కాదు కళాశాలలకు కూడా బాగా పని చేస్తుంది. స్కూల్, కళాశాలకు వెళుతున్నామని చెప్పి బంక్ కొట్టడం విద్యార్థులకు మామూలే. ఐతే చాలా మంది ఇదే పనిలో ఉంటారు. చదువును పక్కనపెట్టి బయట తిరగడానికే ఇష్టపడతారు. అలాంటి వారి ఆటలకు ఈ యాప్‌తో అడ్డుకట్ట వేయచ్చు. ఈ యాప్‌లో అటెండెన్స్ ఆప్షన్‌పై ట్యాప్ చేయగానే.. తమ అబ్బాయి లేదా అమ్మాయి పాఠశాలకు హాజరయ్యాడో లేదో తెలిసిపోతుంది. ఒక వేళ హాజరు కాకపోతే వెంటనే పేరెంట్‌కు మెసేజ్ వెళుతుంది. దీంతో వారు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ప్రొగ్రస్ కార్డులో మార్కులు దిద్దుకోవడం కూడా కొంతమంది పిల్లలకు అలవాటే. ఈ యాప్‌తో అలాంటి చర్యలకు కూడా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. ఈ యాప్‌లో ఉంచిన మార్కుల జాబితాను ఎడిట్ చేయడం కుదరదు. ఇది ట్యాంపర్ ఫ్రూఫ్‌గా ఉంటుంది.
పిల్లలకే కాదు టీచర్లకు కూడా
ఈ యాప్ కేవలం పిల్లలను మోనిటర్ చేయడానికే కాదు టీచర్ల యాక్టివిటీని కనిపెట్టడానికి కూడా పనికొస్తుంది. ఈ యాప్‌లో టీచింగ్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. టీచర్లు తరగతి గదిలోకి వెళ్లగానే వాళ్ల ఫోన్లు ఆటోమెటిక్‌గా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. టీచర్ క్లాస్‌కు అటెండ్ అయినట్లు మేనేజ్‌మెంట్‌కు మెసేజ్ వెళుతుంది. సెలవులు, ఫ్యాకల్టీ వివరాలు, వారి మీటింగ్ వివరాలు అన్ని ఎప్పటికప్పుడు అందరికి తెలిసిపోతాయి. అకడమిక్ టైమ్‌టేబుల్, ఆన్‌లైన్ ఫీజుల వివరాలు దీనిలో ఉంటాయి. పాఠశాల, కళాశాలల గురించి సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఇంతటి ఉపయోగకరమైన యాప్‌ను తయారు చేసిన వాళ్లు మన తెలుగు కుర్రాళ్లే. కెన్సారో వీవా, మణికంఠ, వంశీకృష్ణ, విజయ్‌రెడ్డి, హర్ష, మురళీ ఈ యాప్‌ను రూపొందించి నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ యాప్‌ను ఉపయోగించేలా చేయాలనేది వీరి లక్ష్యం.