• తాజా వార్తలు

CCTV ప్రాజెక్ట్ లో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్న తెలంగాణా ప్రభుత్వం

 పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్సుమేంట్ ఆక్ట్ 2013 కు సవరణ  

“ ప్రజాస్వామ్యం లో అభివృద్ది పథకాలు అనేవి లబ్ది దారులను కూడా భాగస్వామ్యులను చేసినపుడే వాటికి సరైన ఫలితం దక్కుతుంది, ఏ ప్రాజెక్ట్ అయినా విజయవంతం అవ్వాలంటే సాధారణ పౌరులకు కూడా దానిపట్ల బాధ్యత కలిగించాలి అప్పుడే అది మరింత సమర్థవంతంగా ఉంటుంది” ఈ మాటలన్నది ప్రముఖ రాజకీయ మేధావి కెరోల్ పేట్ మాన్ . ఆమె అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకుందో ఏమోకానీ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన కమ్యూనిటీ CCTV ప్రాజెక్ట్ లో ప్రజలను భాగస్వామ్యులను చేసే చర్యలు వేగవంతం చేసింది.

ఈ మధ్య హైదరాబాద్ పోలీస్ శాఖ వారు కమ్యూనిటీ CCTV ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ లో ప్రైవేట్ ఎంటర్ ప్రైజ్ లూ, పబ్లిక్ సెక్టార్ యూనిట్ లూ, నివాస ప్రాంతాలలో ఉండే అసోసియేషన్ లూ మరియు వ్యక్తిగతంగా ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా ప్రణాళికలు రచించింది. దీని ప్రకారం వీరందరినీ ప్రభుత్వ అధీకృత CCTV సిస్టం లను కొని తమ ఏరియా లలో ఏర్పాటు  చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వీటి మానిటరింగ్ సెంటర్ వీరి సొంత కాలనీ లలో ఉంటూ సమీపం లోని పోలీస్ స్టేషన్ కూ, మరియు సెంట్రల్ కమాండ్ సెంటర్ కూ ఇవి అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ప్రకారం CCTV కెమెరాలను కొన్నవారు తమ నివాస ప్రదేశాలలో ముందు,వెనుకా, పార్కింగ్ ప్రదేశాలూ మరియు రోడ్డుకు 50 గజాల వరకూ కవర్ చేసే విధంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. స్టోరేజ్ మరియు మానిటరింగ్ స్క్రీన్ వీరి కాలనీ లలోనే ఒక చోట ఏర్పాటు చేసుకుంటారు. పోలీస్ స్టేషన్ లకూ, సెంట్రల్ కమాండ్ స్టేషన్ కూ వీటిని అనుసంధానం చేసే బాధ్యతను  తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది. ఆ విధంగా నగరం లోని ప్రతి అంగుళం ప్రదేశం పోలీస్ ల నిఘా పరిధిలోనికి వచ్చే విధంగా హైదరాబాద్ పోలీస్ చర్యలు చేపడుతుంది. అంతేగాక ఈ పనిలో ప్రజలను భాగస్వామ్యులను చేయడం ద్వారా ప్రజల్లో బాధ్యతను పెంపొందించినట్లు  అవుతుంది.

దీనిలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి ఈ దిశగా  తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్సుమేంట్ ఆక్ట్ 2013 ను సవరించింది. వివిధ స్థాయిలలో ఈ ప్రాజెక్ట్ ను విజయవంతం చేయడం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు నగరాన్ని ఆకర్షణీయ గమ్యం గా మార్చడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నప్పటికీ  నగర ప్రజల భద్రత, రక్షణకే ఈ ప్రాజెక్ట్ లో పెద్ద పీట వేశారు. నగరం మొత్తాన్నీ CCTV పర్యవేక్షణలో ఉంచుతూ అత్యంత నాణ్యమైన నిఘా వ్యవస్థ ను అందించాలంటే అది చాలా కష్టం తో కూడుకున్న పని. ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించే కంపెనీలను ఓపెన్ బిడ్డింగ్ పద్దతిలో ఎంపిక చేస్తారు డిజైన్, సప్లై, CCTV లను ఇన్ స్టాల్ చేయడం అయిదు సంవత్సరాల పాటు వాటిని నిర్వహించడానికి ఓపెన్ టెండర్ లను ఆహ్వానిస్తారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అత్యంత నాణ్యమైన ప్రమాణాలను అందించే సంస్థలకే ఈ బిడ్డింగ్ లో అవకాశం కల్పిస్తారు.వాస్తవానికి ఈ cctv సిస్టం లనేవి చాలా ఖరీదుతో కూడుకున్నవి. కాబట్టి ప్రజలు బృందాలుగా ఏర్పడి వీటిని తమ కాలనీ లలో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరుతుంది.

ఈ విధమైన CCTV నిఘా ను ఏర్పాటు చేసిన నగరాలలో హైదరాబాద్ ఏమీ మొదటిది కాదు. గుజరాత్ లోని సూరత్ నగరం అన్నింటికంటే ముందు ఉన్నది. ఆ తర్వాత మహారాష్ట్ర కు చెందిన ముంబై నగరం కూడా ఈ మధ్యనే ఈ జాబితాలో చేరింది. తాజాగా మన హైదరాబాద్ నగరం కూడా ఈ లిస్టు లో చేరి పోయింది. ఇప్పటికే సుమారు 200 కమ్యూనిటీ గ్రూప్ లు ఏర్పడి 4000 కి పైగా కెమెరా లను నగరం లో ఏర్పాటు చేశారు. అంతేగాక ఇది రోజురోజుకీ విస్తరిస్తూ ఉంది. నగరం మొత్తం సుమారు లక్ష కెమెరాలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

జన రంజకమైన వార్తలు