మీ వైఫైను ఎవరైనా మీకు తెలియకుండా దొంగతనంగా ఎలా వాడుకుంటున్నారో తెలుసుకోవడం ఎలాగో నిన్నటి ఆర్టికల్‌లో చూశాం. అలా వెరైనా మీ వైఫైని దొంగిలిస్తున్నట్లు తేలితే దానికి అడ్డుకట్ట వేయడం కూడా మీ చేతుల్లోనే ఉంది. వైఫై సిగ్నల్స్‌ను దొంగిలించి వేరే వాళ్లు వాడుకోవడం చాలాదేశాల్లో పెద్ద నేరమే. దీనికి జరిమానాలు కూడా విధిస్తారు. మనదేశంలోనూ ఇలాంటి చట్టాలున్నాయో లేవో తెలియదు కానీ అంత చిన్న విషయానికి కంప్లయింట్ చేయడం ఎందుకు అని చాలామంది అనుకుంటారు. అలాంటప్పుడు మీ వైఫైని మరింత సెక్యూర్డ్‌గా ఉంచుకోవాలి. అందుకు ఏం చేయాలో చూద్దాం.
పాస్‌వర్డ్ జాగ్రత్త
మీ వైఫైకి ఇప్పటికీ పాస్‌వర్డ్ లేదా. వెంటనే పాస్‌వర్డ్ పెట్టుకోండి. ఒకవేళ కంపెనీ ఇచ్చిన డిఫాల్ట్ రూటర్ నేమ్, పాస్‌వర్డ్‌నే ఇంకా వాడుతున్నారా? అది కూడా సేఫ్ కాదు. ఎందుకంటే మీకు దాన్ని అమర్చిన టెక్నికల్ టీమ్ దాన్ని ఎవరికైనా చెప్పొచ్చు. ఉదాహరణకు మీ రూటర్ నేమ్ డీలింక్ అని ఉందనుకోండి.. జనరల్‌గా కంపెనీలు ఇచ్చే పాస్‌వర్డ్‌లు 1234, 1122 ఇలా ఈజీగా యాక్సెస్ చేయగలిగినవే ఉంటాయి. కాబట్టి డీలింక్ అని వైఫై సిగ్నల్ కనపడగానే ఇలాంటి నెంబర్లతో పాస్‌వర్డ్ ప్రయత్నిస్తే చాలావరకు వర్కవుట్ అయిపోతుంది. అందుకే మీరు కంపెనీవాళ్లిచ్చిన డిఫాల్ట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను తక్షణం మార్చేయాలి. యూజర్‌నేమ్ ఏది ఉన్నా ఫర్వాలేదు గానీ పాస్‌వర్డ్ మీ ఫోన్ నెంబర్, పిల్లల పేర్లు, మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్‌లు పెట్టుకోవద్దు. మీ వైఫై సిగ్నల్స్ అందుబాటులో ఉండే చుట్టుపక్కల ఇళ్లవాళ్లకు ఇవన్నీ తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి పాస్‌వర్డ్‌లుగా వద్దు. రూటర్ అడ్మిన్ పేజీకి వెళితే మీ లాగిన్, పాస్‌వర్డ్‌లు మార్చుకునే ఆప్షన్స్ కనిపిస్తాయి.
రూటర్ పేరు, పాస్‌వర్డ్ ఎలా మార్చాలి?
* మీ రౌటర్ పేరు మార్చడానికి వైర్‌లెస్ సెట్టింగ్స్ మెనూలో ఉన్న Service Set identifier (SSID)లోకి వెళ్లి మార్చకోవాలి.
* మీ పాస్‌వర్డ్ మార్చుకోవాలంటే security settingsలోకి వెళ్లి PSK or Pre Shared Keyని క్లిక్ చేయండి.
* పాస్‌వర్డ్ మార్చగానే ఇప్పటికే పాత పాస్‌వర్డ్‌తో కనెక్ట్ అయి ఉన్న డివైస్‌లన్నీ వైఫై నుంచి డిస్‌కనెక్ట్ అయిపోతాయి. అంటే మీకు తెలియకుండా మీ వైఫై వాడుకుంటున్న వాళ్ల డివైస్‌లు కూడా డిస్ కనెక్ట్ అవుతాయి. కొత్త పాస్‌వర్డ్‌తో మళ్లీ కనెక్ట్ అవ్వండి
వైర్‌లెస్ నెట్‌వర్క్ ఎన్‌క్రిప్షన్ వాడండి
మీకు అందుబాటులో ఉన్న బలమైన వైర్‌లెస్ నెట్‌వర్క్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించుకోండి. ప్రస్తుతం ఇది WPA2పేరుతో ఉంది. అయితే మీ రూటర్ 2006 కంటే ముందే తయారయినదై ఉంటే అది WPA2 ఎన్‌క్రిప్షన్‌కు కంపాటబుల్‌గా ఉండదు. ఇలాంటప్పుడు మీరు కొత్త రూటర్ కొనుక్కోవడమే మంచిది. లేకపోతే మీ వైఫై డేటాను మాత్రమే కాదు సేఫ్టీని కూడా మీరు కోల్పోయే ప్రమాదముంది.