ఇప్పుడంతా ఆన్‌లైనే. కంప్యూటర్ ముందు కూర్చునే అన్ని పనులూ చక్కబెట్టేసుకోవచ్చు. బస్, రైల్ టికెట్ రిజర్వేషన్ నుంచి సినిమా టికెట్ కొనుక్కోవడం వరకు, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు కట్టడం నుంచి అన్నింటికీ ఒకప్పుడు లైన్లో నించునేవాళ్లం. ఇప్పుడవన్నీ కూడా ఆన్‌లైన్‌లో చక్కబెట్టేసుకుంటున్నాం. దీనికి తోడు ప్రతిదానికీ కంప్యూటర్‌తో చేసేయగలగడం మన పనినిఈజీ చేస్తుంది. అయితే కూర్చునే పొజిషన్ కరెక్ట్‌గా లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చోవడం మనకు ఎన్నోరకాల సమస్యలు తెచ్చిపెడుతుంది. నడుము నొప్పి, భుజాలు, మెడ నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే కంప్యూటర్ ముందు కూర్చునే భంగిమ (పోస్చర్) చాలా ముఖ్యమైంది. కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పనిచేసేవాళ్లు తప్పనిసరిగా పాటించాల్సిన ఆరు నియమాలు ఇవీ..
1.మానిటర్ హైట్‌ను కరెక్ట్‌గా పెట్టుకోండి
ల్యాప్‌టాప్ డెస్క్‌టాప్ ఏదైనా సరే సరైన హైట్‌లో ఉండాలి. అంటే మనం స్క్రీన్ కోసం మెడ వంచి కిందికి చూడకుండా తలను కరెక్ట్‌గా నిలబెడితే మన కళ్లు కరెక్ట్‌గా కంప్యూటర్ మానిటర్‌ను చూడగలిగేలా మానిటర్ హైట్‌ను సెట్ చేసుకోవాలి. అస్తమాను కిందికి చూసే పరిస్థితి ఉంటే అది మీ మెడ నొప్పికి కారణమవుతుంది. ఇక మన కళ్ల నుంచి మానిటర్ ఉండే దూరం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం నిటారుగా కూర్చుంటే చేయిచాస్తే అంత దూరంలో కంప్యూటర్ మానిటర్ ఉండాలి. అంటే 20 నుంచి 24అంగుళాల దూరంలో మానిటర్ ఉండేలా చూసుకోవాలి.
2.కాళ్లు రెండూ నేలమీదే ఉండాలి
కంప్యూటర్ ముందుకూర్చుని కాలు మీద కాలు వేసుకోవడం, రెండు కాళ్లూ కంప్యూటర్ టేబుల్‌కు తన్నిపెట్టడం, కుర్చీలో వెనక్కివాలి కాళ్లను సీపీయూ మీద లేదా డెస్క్ మీద పెట్టడం ఇవేమీ కరెక్ట్ కాదు. కంప్యూటర్ ముందు నిటారుగా కూర్చుంటే మీ రెండు కాళ్లూ నేలమీద సమానంగా ఆని ఉండాలి. ఒకవేళ ఎత్తు సరిపోకపోతే కంప్యూటర్ టేబుల్ కింద చిన్న పీట లాంటిది ఉంచుకుని దానిమీద కాళ్లు పెట్టుకోవచ్చు.
3.భుజాలను వెనక్కి నెట్టండి
మానిటర్‌ను చూసేటప్పుడు తల ముందుకు వంచుతాం. తల బరువుకు మెడమీద ప్రభావం పడే ప్రమాదముంది. అలాంటి పరిస్థితి రాకుండా భుజాలను కొద్దిగా వెనక్కినెట్టి దానికి తగ్గట్టే తలను నిటారుగా ఉంచండి. ముందుగా భుజాలను కాస్త పైకి పెట్టి తర్వాత కాస్త వెనక్కి నెట్టండి. ఇప్పుడు మీకు రిలాక్స్‌డ్‌గా ఉంటుంది.
4.యోగా లేదా వ్యాయామం చేయండి
ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చున్నవాళ్లు యోగా లేదా వ్యాయామం రోజులో కొద్ది సేపు అయినా చేయాలి. అప్పుడు నడుం, భుజాలు కాస్త గట్టిపడతాయి. కంప్యూటర్ ముందు కాస్త ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చినా,కాస్త తప్పు పొజిషన్‌లో కూర్చున్నా మీ మెడ, నడుము, భుజాలు నొప్పులు పుట్టకుండా ఈ యోగా లేదా వ్యాయామం సహకరిస్తాయి.
5.డెస్క్ ఎక్సర్‌సైజ్‌లు చేయండి
మానిటర్ ముందు కుర్చీలో కూర్చుని బాడీని కొద్దిగా స్ట్రెచ్‌చేయండి. మెడను కాస్త అటూ ఇటూ పైకి కిందికీ తిప్పండి. చేతులురెండూ కలిపి కాస్త పైకి చాచండి. పక్కకు కాస్త వంచండి. ఇవి మీకు రిలాక్సేషన్ ఇస్తాయి. దీంతో పనిమీద దృష్టి పెట్టగలుగుతారు.
6.నిలబడి పనిచేయండి
నిలబడి పనిచేసుకునేలా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు అమర్చుకునే విధానం ఈ మధ్య బాగా పాపులరయింది. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే ఇబ్బందులను తీర్చడంలో ఇదిచాలా ఉపయోగపడుతుంది. అయితే మన ఆఫీస్‌లో, ఇంట్లో ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు.అందుకే అరగంటకోసారయినా కాసేపు నిలబడండి.రెండు,మూడు నిముషాలు నిటారుగా నిలబడి లేదా నాలుగు అడుగులు అటూఇటూ వేసి కూర్చుంటే నడుము, మెడ, భుజాలు అన్నింటిమీద స్ట్రెయిన్ తగ్గుతుంది.