మీరు శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ వాడకందారులైతే కాల్ చేయడం, రిసీవ్ చేసుకోవడంలో తెలుసకోవాల్సిన కొన్ని కిటుకులను మీ ముందుకు తెస్తున్నాం. ఇప్పుడు ఫోన్‌లో దాగి ఉన్న కొన్ని ఫీచర్లతోపాటు కాల్ సెట్టింగ్స్‌లో కొన్ని చిట్కాలను తెలుసుకుందామా!
GESTURES
ఆండ్రాయిడ్‌లో బోలెడన్ని గెశ్చర్లు దాగి ఉన్నాయి. అందులో కాల్ చేయడం, మెసేజ్ పంపడం సులభంగా చేయగలిగే కిటుకు ఒకటి. ‘‘ఫోన్ లేదా కాంటాక్ట్స్’’ యాప్‌లో జాబితాలోని ఏ నంబర్‌నైనా ఎడమవైపు స్వైప్ చేస్తే మెసేజ్ పంపవచ్చు... అదే కుడివైపు స్వైప్ చేస్తే ఆ నంబరుకు కాల్ చేయొచ్చు. శామ్‌సంగ్ ఫోన్‌లో దీన్ని డిఫాల్ట్ ఫీచర్‌గా పెట్టుకోవచ్చు. ఒకవేళ అది పనిచేయకపోతే సెట్టింగ్స్‌లో ADVANCED FEATURESలోకి వెళ్లి SWIPE TO CALL OR SEND MESSAGESను ఆన్ చేయండి. మీకు ఈ ఫీచర్ నచ్చకపోతే దాన్ని ఇదేవిధంగా డిజేబుల్ చేసేయవచ్చు.
ADD TO FAVORITE
మీరు తరచూ ఫోన్‌లో సంభాషించే వారి పేర్లను FAVOURITESలో చేర్చుకోవచ్చు... ఇందుకోసం ఫోన్ లేదా కాంటాక్ట్స్‌ను ఓపెన్ చేసి, ఫేవరిట్‌గా యాడ్ చేయాలనుకున్న పేరుపై ట్యాప్ చేయండి. తర్వాత దిగువన కనిపించే DETAILSను సెలెక్ట్ చేసి, స్క్రీన్‌మీద కనిపించే STAR ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
ADD TO SPEED DIAL
కాంటాక్ట్స్‌లో అత్యంత ముఖ్యమైన వారికి తక్షణం కాల్ చేయడం కోసం వారి పేరును SPEED DIAL జాబితాలో చేర్చుకోవచ్చు... మీరు చేయాల్సిందల్లా- ఫోన్ యాప్‌ను ఓపెన్ చేసి, దిగువన కనిపించే కీ ప్యాడ్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి. అందులోని నంబర్లలో దేనిపైన అయినా కాసేపు నొక్కి పట్టుకుంటే అసైన్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు ASSIGNపై ట్యాప్ చేస్తే మిమ్మల్ని కాంటాక్ట్స్‌లోకి తీసుకెళ్తుంది. మీకు కావాల్సిన పేరును ఎంచుకుంటే సరి.. ఆ వ్యక్తి నంబరు స్పీడ్ డయల్ జాబితాలో చేరిపోతుంది. ఇందులో దేన్నయినా తొలగించాలనుకున్నా, స్పీడ్ డయల్ నంబర్లన్నీ చూడాలనుకున్నా, కొత్త నంబర్ చేర్చాలనుకున్నా కీ ప్యాడ్‌ను ఓపెన్ చేసి, కుడివైపున్న మూడు చుక్కల ఐకాన్‌ను ట్యాప్ చేయాలి. అప్పుడు కనిపించే మెనూలో SPEED DIALను ఎంచుకుని పని పూర్తిచేసుకోవచ్చు.
గమనిక: కీ ప్యాడ్ ఓపెన్‌గా ఉన్నపుడే మూడు చుక్కల ఐకాన్‌ను ట్యాప్ చేయాలి. లేదంటే సెట్టింగ్స్ కనిపించవు.
CHANGE OPEN MODE OF PHONE APP
శామ్‌సంగ్ ఫోన్ యాప్‌ను ఓపెన్ చేయగానే ఇటీవలి కాల్స్ జాబితాను డిఫాల్ట్‌గా చూపుతుంది. దీన్ని మనం నేరుగా కీ ప్యాడ్‌ను చూపించేవిధంగా మార్చుకోవచ్చు.
STEP 1: ఫోన్ యాప్‌ను ఓపెన్ చేసి, కీ ప్యాడ్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
STEP 2: కుడివైపు పైన కనిపించే మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్‌చేశాక కనిపించే మెనూలో OPEN TO KEYPAD ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
DIRECT CALL
స్క్రీన్‌పై కనిపించే ఒక నంబరుకు ఫోన్ చేయాలంటే ఫోన్‌ను మీ చెవిదగ్గరకు తీసుకెళ్తే చాలు... కాల్ వెళ్లిపోతుందని మీకు తెలుసా! శామ్‌సంగ్ ఫోన్‌లోని ‘‘మెసేజెస్, ఫోన్, కాంటాక్ట్స్’’ యాప్‌లలో ఈ సౌలభ్యం ఉంది. దీన్నే DIRECT CALL అంటారు. ఇది డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉండి, మీరు వద్దనుకుంటే SETTINGS > ADVANCED FEATURESలోకి వెళ్లి DIRECT CALLను ఆఫ్ చేయొచ్చు.
గమనిక: ఇన్‌కమింగ్ కాల్స్‌ను మ్యూట్ చేయాలంటే మీ శామ్‌సంగ్ ఫోన్ స్క్రీన్‌పై మీ చేతిని అడ్డుగా ఉంచితే సరి... లేదా ఫోన్ స్క్రీన్‌ను నేలవైపు తిప్పినా చాలు!
FLASH NOTIFICATION
ఈ ఫీచర్‌ను రెండు దశల్లో ఎనేబుల్ చేయొచ్చు...
STEP 1: ఫోన్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి, ACCESSIBILITYని ఎంచుకుని HEARINGపై ట్యాప్ చేయాలి.
STEP 2: ఆ తర్వాత FLASH NOTIFICATIONను ట్యాప్ చేస్తే CAMERA LIGHT... SCREEN ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో CAMERA LIGHTను ఎనేబుల్ చేయాలి.
SINGLE TAP ANSWER
మనకు కాల్ వచ్చినపుడు సాధారణంగా స్వైప్ గెశ్చర్‌ను ఉపయోగిస్తాం. కానీ, కొన్నిసందర్భాల్లో అది వెంటనే పనిచేయదు. అలాంటప్పుడు సింగిల్ ట్యాప్‌తో పని అయ్యేలా చూసుకోవచ్చు. ఇందుకోసం... ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ACCESSIBILITYని ఎంచుకుని, SINGLE TAP MODEను ఎనేబుల్ చేయాలి. మరో విడతలో మరికొన్ని కిటుకులు తెలుసుకుందాం!