మనం ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కుకీలకు సంబంధించిన హెచ్చరికలతో వెబ్‌సైట్లు పదేపదే విసిగిస్తుంటాయి. ఈ బెడదనుంచి విముక్తి కోసం చేయాల్సిందేమిటో తెలుసుకుందాం... ఫేస్‌బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం గురించి మీకు తెలిసిందే. ఈ ఉదంతం నేపథ్యంలో కొన్ని ఇంటర్నెట్ నిబంధనలకు కట్టుబడాలని ఐరోపా సమాఖ్య (EU) నిర్దేశించింది. ఆ ప్రకారం- కంప్యూటర్లలో కుకీలను ఇన్‌స్టాల్ చేసే ప్రతి వెబ్‌సైట్ అందుకోసం వినియోగదారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ మన కంప్యూటర్‌లో ఎప్పుడు కుకీలను ఇన్‌స్టాల్ చేస్తుందో తెలుసుకోవడం... ప్రత్యేకించి వ్యక్తిగత గోప్యత (privacy)రీత్యా మనకూ మంచిదే. కానీ, కొత్త వెబ్‌సైట్‌లోకి వెళ్లినప్పుడల్లా ఈ హెచ్చరిక మాటిమాటికీ కనిపిస్తుంటే చిరాకు కలగడం సహజం. రహస్య లేదా ప్రైవేట్ (Incognito, private) పద్ధతిలో బ్రౌజింగ్ చేసినా, బ్రౌజర్‌ను మూసేయగానే కుకీలను తొలగించే ఆప్షన్‌ను మీ బ్రౌజర్ సెట్టింగ్స్‌లో ఎంపిక చేసి ఉన్నా- మీరు మళ్లీ ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లినపుడు కుకీల హెచ్చరిక మరోసారి ప్రత్యక్షమవుతుంది.
ఇలాంటి కుకీలను పట్టించుకోరాదనుకున్నా, ఆ హెచ్చరికలను వదిలించుకోవాలని మీరు భావిస్తున్నా అందుకు సాయపడే ఒక ఉచిత ‘‘ఎక్స్‌టెన్షన్’’ ఉంది. దీన్ని మీ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని మనకు అనువైన సెట్టింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది.
ఈ ఎక్స్‌టెన్షన్ పేరు ‘‘ఐ డోన్ట్ కేర్ అబౌట్ కుకీస్’’ (i don’t care about cookies). గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లలో ఇది పనిచేస్తుంది. క్రోమ్ ఎక్స్‌టెన్షన్లతో పనిచేసే ఒపేరా బ్రౌజర్‌లోనూ దీన్ని వాడుకోవచ్చు. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ బ్రౌజర్‌ను అందులో ఎంపిక చేసుకోవాలి. అటుపైన అది మీ బ్రౌజర్ వెబ్‌స్టోర్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఈ ఎక్స్‌టెన్షన్‌ను మీరు బ్రౌజర్‌కు యాడ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్లనుంచి కుకీ హెచ్చరికలు రాకుండా ఈ ఎక్స్‌టెన్షన్ తనంతటతానే నిరోధిస్తుంది. అయితే, మీరు సురక్షితమైనవిగా పరిగణించే వెబ్‌సైట్‌ల విషయంలో ఈ ఎక్స్‌టెన్షన్‌ను డిజేబుల్ చేయవచ్చు. ఇందుకోసం ‘‘ఐ డోన్ట్ కేర్ అబౌట్ కుకీస్’’ ఎక్స్‌టెన్షన్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. అందులోని మెనూలో జాబితాను ఎంచుకుని, ఏయే వెబ్‌సైట్‌లను మినహాయించాలో అందులో చేర్చండి. ఈ సెట్టింగ్స్‌ను సేవ్ చేశాక ఆ జాబితాలోని వెబ్‌సైట్ల కుకీ హెచ్చరికలను ఈ ఎక్స్‌టెన్షన్ నిరోధించదు. దీని మెనూలో ఎనేబుల్/డిజేబుల్ ఆప్షన్ కూడా ఉంది... దీనిపక్కనున్న బాక్స్‌ను టిక్ చేస్తే మనం బ్రౌజ్‌చేసే వెబ్‌సైట్ల విషయంలో ఎనేబుల్/డిజేబుల్ ఆప్షన్లను ఈ ఎక్స్‌టెన్షన్ చూపిస్తుంది. సందర్భాన్ని బట్టి అందులో మనకు కావాల్సినదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.