భారత కరెన్సీ రూపాయికి ఒక విశిష్ట సంకేతం (₹) రూపొందడం శుభపరిణామమైతే, దానికి అంతర్జాతీయ గుర్తింపు, ప్రాముఖ్యం దక్కడం మరో విశేషం. కానీ, కంప్యూటర్/ల్యాప్‌టాప్ కీబోర్డులలో ఈ కొత్త సంకేతాన్ని టైప్ చేయడానికి ఒక ప్రత్యేక బటన్‌ను డిజైనర్లు ఇంకా ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ సింబల్‌ను ఎలా టైప్ చేయాలో తెలుసుకోవడానికి మనమింకా ఇంటర్నెట్‌లో శోధిస్తూనే ఉన్నాం. అయితే, ఇప్పుడీ సమస్యకు ఒక పరిష్కారం లభించింది. మరోవైపు భారతదేశం కోసం రూపొందించే తాజా కీబోర్డులను రుపీ సింబల్‌తో త్వరలోనే తయారీదారులు విడుదల చేసే అవకాశాలున్నాయి. అయినప్పటికీ రుపీ సింబల్‌ను టైప్ చేయడానికి కొన్ని పద్ధతులున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం:
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే అన్ని కంప్యూటర్లలో అత్యధికంగా వాడుతున్న టైపింగ్ సాఫ్ట్‌వేర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (వెర్షన్ ఏదైనా)లో భాగమైన MS word. కాబట్టి ఇందులో భారత జాతీయ కరెన్సీ రుపీ సింబల్ (₹)ను చాలా సులభ పద్ధతిలో టైప్ చేయవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా... CTRL+ALT బటన్‌లను నొక్కిపట్టి 4 అంకె ఉన్న బటన్ (4 కాకపోతే డాలర్ సింబల్‌గల బటన్)ను నొక్కాలి. ఈ చిట్కా నోట్‌ప్యాడ్‌సహా ఇంకా చాలా వెబ్‌సైట్ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లలోనూ పనిచేస్తుంది. ఆ మేరకు WordPress, Drupal, SilverStripe, Kentico CMS, Contao, Pulse CMS, Mambo, Web GUI, Composer CMS, Exponent CMS, XOOPS, Microweber, Bloggerలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, Windows XP లేదా Windows 98లలో ఇలా టైప్ చేయడానికి సమస్య ఎదురుకావచ్చు. ఎందుకంటే... రుపీ సింబల్ (₹) 2010 జూలై 15 నుంచి వాడుకలోకి వచ్చింది. అందువల్ల ఆ ఏడాదికి ముందు వెర్షన్ విండోస్‌లో ఇది ఇప్పటివరకూ అప్‌డేట్ కాలేదు. పైగా Windows XP తదితర వెర్షన్లకు మద్దతును మైక్రోసాఫ్ట్ చాలాకాలం కిందటే నిలిపేసింది. ప్రస్తుతం Windows 7, 10 వంటి వెర్షన్లకు మాత్రమే అప్‌డేట్స్ విడుదల చేస్తోంది. ఏదిఏమైనా రుపీ సింబల్‌ను టైప్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలిసింది కదా! కాబట్టి ‘‘How To Type Rupee Symbol in .....?’’ అంటూ శోధించే అవసరం మీకిక ఉండదు.