వేలాది రూపాయిలు పోసి మొబైల్ ఫోన్లు కొంటాం.. కానీ కొన్ని రోజుల తర్వాత వాటి బాగోగులు పట్టించుకోం. ఒక్కోసారి ఫోన్ ఎక్కడ పెట్టామో కూడా గుర్తుపెట్టుకోం. కానీ ఇలా అజాగ్రత్తగా ఉండడమే మన మొబైల్‌కు డేంజర్. అప్పుడు మొబైల్ గల్లంతయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం ఫిజికల్‌గా (దొంగతనం) మాత్రమే కాదు... టెక్నికల్‌గా కూడా మన ఫోన్‌ను దొంగిలించే అవకాశాలున్నాయి. అదే హ్యాకింగ్. మనకు తెలియకుండానే మూడో కన్ను మనం చేసే ప్రతి పని మీద దృష్టి పెడుతుంది. మనకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తస్కరిస్తుంది. ముఖ్యంగా మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు మన ఫోన్ ఎప్పుడూ డేంజర్ జోన్‌లో ఉన్నట్లే.. మరి మన ఫోన్‌ను ఇలాంటి హ్యాకర్ల బారి నుంచి రక్షించుకోవడం ఎలా?
సెక్యూరిటీ ఫీచర్లు వాడాలి
చాలామంది మొబైల్ ఫోన్లకు పాస్‌వర్డ్‌లు ఉండవు. వాడడం పక్కన పడేయడం తప్ప దాని రక్షణ కోసం మాత్రం ఆలోచించరు. ఐతే మొబైల్ ఫోన్‌కు పాస్‌వర్డ్ ఉంటే వేరే వాళ్లు మన ఫోన్ వాడకుండా నిరోధించడమే కాక.. హ్యాకర్లకు పెద్ద చెక్ పెట్టినట్లు అవుతుంది. ఇప్పుడు అన్ని ఫోన్లలోనూ వస్తున్న ఫింగర్ ప్రింట్ ఆప్షన్ వాడితే ఇంకా మంచింది. పాస్‌వర్డ్‌లను ఎవరైనా గెస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ బయోమెట్రిక్‌ను ఛేదించడం ఎవరి వల్లా కాదు. దీని వల్ల మీ డేటా సేఫ్.
ఎప్పుడూ క్లీన్‌గా ఉండాలి
మీ ఫోన్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందన్నది ముఖ్యం కాదు... హ్యాకర్లకు ఫోన్ డేటాను దక్కించుకోవడం అంటే సరదా. అందుకే మన ఫోన్‌ను ఎప్పుడూ నీట్‌గా ఉంచుకోవాలి. నీట్‌గా క్లీన్‌గా ఉండడం అంటే దుమ్మ తుడవడం కాదు మన ఫోన్ ఎవరికి చిక్కకూడదు. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు ఆటోమెటిక్ లాగిన్ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవాలి. అంతేకాదు మీ సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లను కూడా లాగౌట్ చేయాలి. అంతేకాదు మీ వెబ్ హిస్టరీని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల హ్యాకర్లకు ఎలాంటి క్లూస్ మన ఫోన్ నుంచి లభ్యం కావు. మీకు అందుబాటులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్, యాప్స్ ఎప్పటికప్పుడు అప్‌డేటెట్‌గా ఉండేలా చూసుకోవాలి.
వైఫై వాడేటప్పుడు జాగ్రత్త!
ఉచిత వైఫై అంటే ఎవరికి ఇష్టం ఉండదు! వైఫై దొరికిందంటే వెంటనే ఫోన్ టర్న్ ఆన్ చేస్తాం. కానీ మనం ఎక్కడ వైఫై వాడుతున్నామన్నది కీలకం. పబ్లిక్ వైఫై వాడేటప్పుడు మీ ఫోన్ డేంజర్‌లో ఉన్నట్లే. అందుకే ఎయిర్‌పోర్టులు, బస్ స్టాండ్స్, షాపింగ్ మాల్స్‌లో వైఫై వాడుతున్నప్పుడు మనం సరైన కనెక్షన్‌తోనే వాడుతున్నామా అనేది నిర్థారించుకోవాలి. ప్రైవేటు ఈమెయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియని లింక్‌లు ఓపెన్ చేయకూడదు.
బ్లూ టూత్ టర్న్ ఆఫ్ చేయాలి
మనం ప్రయాణాల్లో ఉన్నపుడు బ్లూ టూత్‌ను టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. వైఫై కనెక్షన్ కూడా చెక్ చేసుకోవాలి. మీ ఫోన్‌కు సంబంధించిన లొకేషన్‌ను డిజేబుల్ చేసుకోవాలి. మనం ఎక్కడ ఉన్నామో తెలియనీయకూడదు. పాత పద్ధతుల్లో కమ్యూనికేషన్ చేయకపోవడం మంచింది. మీరు ఫోన్ వాడుతున్నప్పుడు మీ చుట్టుపక్కల గమనిస్తూ ఉండాలి. కొంతమంది కావాలనే మన ఫోన్ యూసేజ్‌ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండాలి.