ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు వాడుతున్న మెసేజింగ్ వేదిక వాట్సాప్‌ను చైనా హ్యాకర్లు వెంటాడుతున్నారని భారత సైన్యం తమ బలగాలను హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతా ‘‘అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్‌ఫేస్’’ (@adgpi)ద్వారా ఒక వీడియోను కూడా విడుదల చేసింది. వాట్సాప్ వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అందులో సైనిక సిబ్బందిని అప్రమత్తం చేసింది. అధికారికంగా లేదా వ్యక్తిగత గ్రూపులలో అత్యంత భద్రత, గోప్యత పాటించాల్సిందిగా సూచించింది. చైనా హ్యాకర్ల ఎత్తులను తిప్పికొట్టడంపై కొన్ని చిట్కాలు కూడా ఇచ్చింది. అందులో ముఖ్యమైన ఆరు కిందివిధంగా ఉన్నాయి:-
1. చైనా నంబర్లు +86తో మొదలవుతాయి. ఈ నంబర్లు భారత ఆర్మీ వాట్సాప్ గ్రూపులలో చొరబడి సమాచారాన్ని కాజేస్తాయి. కాబట్టి +86తో మొదలయ్యే నంబర్లపై ఓ కన్నేసి ఉంచాలి.
2. మీ గ్రూపులో ఏదైనా అనధికారిక కొత్త నంబరు చేర్చబడే ప్రమాదం ఉంది... కాబట్టి గ్రూపును తరచూ తనిఖీ చేసుకుంటూండాలి.
3. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ అందరి నంబర్లనూ తమ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలి.
4. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఏవైనా సందేశాలు వస్తున్నాయేమో తరచూ చూసుకోవాలి.
5. మీ మొబైల్ నంబరును మార్చినట్లయితే గ్రూప్ అడ్మిన్‌కు తక్షణమే తెలియజేయాలి.
6. మీ మొబైల్ నంబరును మార్చుకున్న వెంటనే సిమ్ కార్డును ధ్వంసం చేయడంతోపాటు ఆ నంబరుతోగల వాట్సాప్ గ్రూప్‌ను డిలీట్ చేయాలి.