ఫేక్ యాప్స్ ను అరికట్టడానికి గూగుల్ సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్ ను ఏర్పరచింది. అదే గూగుల్ ప్రొటెక్ట్. క్రమంగా ప్లే స్టోర్ నుండి 7,00,000 ఫేక్ మరియు అసురక్షితమైన యాప్స్ ను తొలగించడం జరిగింది. అయినా కూడా ఇంకా అనేక ఫేక్ అప్లికేషన్స్ ప్లే- ప్రొటెక్ట్ ను కూడా దాటి ప్లేస్టోర్ లో కనిపిస్తున్నాయి. ఈ అప్లికేషన్స్ కొన్ని అనవసర పర్మిషన్స్ తీసుకోవడం ద్వారా మీడియా , లొకేషన్, కాంటాక్ట్స్ వంటి భద్రతాపరమైన వనరులను తస్కరించే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటువంటి ఫేక్ యాప్స్ ను గుర్తించడం ఎలాగో ఓ సారి చూద్దాం.
ఎక్కువ శాతం ఫేక్ అప్లికేషన్స్ , జెన్యూన్ అప్లికేషన్స్ ఐకాన్లను పోలి ఉండి, అవే నిజమని భ్రమను కలిగిస్తూ ఉంటాయి. మీరు సెర్చ్ చేసినప్పుడు అదే ఐకాన్ మరియు పేరును పోలి ఉన్న అప్లికేషన్స్ కనపడిన ఎడల, జాగ్రత్తపడక తప్పదు. ఈ ఫేక్ అప్లికేషన్స్ తయారు చేసే డెవెలపర్స్ , ఎక్కువగా అవగాహనా రాహిత్యం కలిగిన వినియోగదారులనే టార్గెట్ చేస్తూ ఈ అప్లికేషన్స్ విడుదల చేస్తుంటారు. కావున సెర్చ్ ఫలితాలను కాస్త గమనించడం మంచిది.
అప్లికేషన్ పేరును పరిశీలించడం ద్వారా ఫేక్ అప్లికేషన్స్ గుర్తించవచ్చు. కొన్ని సందర్భాలలో అసలు పేర్లకు కొంత కొసరు జోడించడం ద్వారా నిజమని నమ్మించే భ్రమను సృష్టించే ప్రయత్నం చేస్తుంటారు.
మీకన్నా ముందు ఎంత మంది అప్లికేషన్ ను వినియోగించారో తెలుసుకోవలసిన కనీస అవసరం ఉన్నది. తద్వారా అది చట్టబద్దమైనదా , కాదా అన్న అవగాహన మీకు వస్తుంది.
అప్లికేషన్ వివరణ లో నిజానికి డెవెలపర్స్, ఖచ్చితత్వంతో వ్యవహరిస్తారు. అప్లికేషన్ గురించిన పూర్తి అవగాహన ఇచ్చేలాగా వివరణను పొందుపరచవలసి ఉంటుంది. కానీ ఫేక్ అప్లికేషన్స్ లో వివరణలో ఉపయోగించే భాష, వివరణా తీరు, వివరాలను తొలగించడం, లేదా తక్కువగా పొందుపరచడం వంటివి ఖచ్చితంగా ఒరిజినల్ అప్లికేషన్ కు వేరుగా ఉంటుంది. తద్వారా ఆ అప్లికేషన్ పై ఒక అవగాహన వస్తుంది.
ఫేక్ అప్లికేషన్ డెవెలపర్స్, అవి నిజమని నమ్మించే ప్రయత్నంలో , ఒరిజినల్ అప్లికేషన్స్ పేజీలో వినియోగించిన స్క్రీన్ షాట్స్ నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
రివ్యూస్ రాసేవారిలో ఎక్కువ శాతం అప్లికేషన్ వినియోగించిన తర్వాత తమ అనుభవాలను వివరిస్తుంటారు. ఆ రివ్యూస్ చదవడం ద్వారా అప్లికేషన్ గురించిన అవగాహన కూడా వస్తుంది. కావున కచ్చితంగా రివ్యూలు చదవాల్సిన అవసరం ఉంది.