• తాజా వార్తలు

ఫోన్ నీళ్లలో పడితే..


మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక భాగంగా మారిపోయింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ మనతోనే ఉంటోంది. చివరకు స్నానాల గదిలోకి కూడా ఫోన్ ను తీసుకెళ్తుంటాం. దాంతో ఎంతో ఇష్టపడి కొనుక్కునే విలువైన స్మార్టుఫోన్లు నీళ్లలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ఫోన్ నీళ్లలో పడితే ప్రపంచం ఆగిపోయినంత పనవుతుంది. అందులో ఉండే కాంటాక్ట్సు తిరిగి రికవరీ అవుతాయో లేదో అన్న భయం.. వాట్స్ యాప్, ఎస్సెమ్మెస్ లలో స్టోర్ చేసిన సమాచారం తిరిగి మనకు దక్కుతుందో లేదో అన్న భయాలే కాదు.. అసలా ఫోన్ మళ్లీ పనిచేస్తుందో లేదో, ఆ చాన్సున్నా కూడా అందుకు ఎంత ఖర్చవుతుందో అన్న భయం వెంటాడుతుంది. దాంతో ఫోన్ నీళ్లలో పడగానే ఏమీ తోచదు. వాటర్ ప్రూఫ్ స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చినా ధర, అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల అందరి వద్దా అలాంటివి లేవు. అయితే, నీళ్లలో పడిన ఫోన్ కచ్చితంగా బాగవుతుందన్న గ్యారంటీ అన్ని సందర్భాల్లో లేకపోయినా.. నీళ్లలో పడిన తరువాత దాన్ని పనికొచ్చేలా చేయడానికి కొన్ని అవకాశాలు మాత్రం ఉన్నాయి.
ఏ బటనూ ప్రెస్ చేయొద్దు
ఫోన్ నీళ్లలో పడిన తరువాత దాన్ని ఎక్కువ సేపు అలాగే ఉండకుండా వీలైనంత వేగంగా బయటకు తీయాలి. ఆ తరువాత ఫోన్ ను ఆపరేట్ చేయకుండా వదిలేయాలి. ఆన్ చేయడం, ఆఫ్ చేయడం వంటివేమీ చేయకూడదు. అసలు ఏ కీ కూడా ప్రెస్ చేయకూడదు. అలాగే ఛార్జింగ్ పెట్టొద్దు కూడా.ఫోన్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం వల్ల మరింత పాడయ్యే ప్రమాదం ఉంటుంది. లోపలున్న సర్క్యూట్లు నీళ్లలో తడవడం వల్ల అది సూక్ష్మమైన సర్క్యూట్లను ఒకదానితో ఒకటి కనెక్టయ్యేలా చేసి సర్క్యూట్లు కాలిపోవడానికి కారణమవుతుంది.
* చాలామంది ఫోన్ నీళ్లలో పడిన తరువాత ఉతికిన దుస్తులు దులిపినట్లుగా ఫోన్ను కూడా చేతితో అటూఇటూ తిప్పి నీరు బయటకు పోయేలా చేయాలనుకుంటారు. కానీ, అది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. ఆల్రెడీ సూక్ష్మభాగాల వరకు చేరుకున్న నీరు మరింత లోపలికి పోవడానికి అది కారణమవుతుంది.
* బ్లోయర్లు, డ్రయ్యర్లు వంటివి ఉపయోగించి పొడిగా మార్చాలని ప్రయత్నిస్తారు. అది కూడా తప్పే. దానివల్ల కూడా నీరు మరింత లోపలికి పోతుంది. కేవలం పైభాగాల్లో ఉన్న నీటిని మాత్రమే ఇలాంటి చర్యలు తొలగించగలవు. అది ఏమాత్ర ప్రయోజనకరం కాదు.
* నీళ్లలో నుంచి తీసిన తరువాత తొలుత ఫోన్ ను మనకు వీలైనంత మేరకు విడదీయాలి(డిసెంబుల్). అంటే బ్యాక్ కవర్ తొలగించాలి. డిటాచబుల్ బ్యాటరీ అయితే దాన్ని తొలగించాలి. సిమ్ కార్డులు, మెమొరీ కార్డులు వంటివన్నీ బయటకు తీసేయాలి. రిమూవ్ చేయదగ్గ ప్రతి భాగాన్ని వేరుచేయాలి.
* అయితే... వారంటీ ఉన్న ఫోన్లయితే స్క్రూలు విప్పి ఇతర భాగాలను తొలగించకపోవడం మంచిది. ఎందుకంటే ఒకసారి స్క్కూలను విప్పితే వారంటీ వర్తించదు.
* అంతేకాదు.. ఫోన్ బ్యాక్ కవర్ తీయగానే మనకు స్క్కూలపైన చిన్నగా గుండ్రని కాగితం ముక్కలు కనిపిస్తాయి. ఇవి సాధారణ కాగితాల్లాగే కనిపిస్తాయి కానీ వీటి ఆధారంగానే ఫోన్ తడిసిందీ లేనిదీ నిపుణులు, సర్వీస్ సెంటర్లో ఉండేవారు చెప్పగలుగుతారు. నీళ్లలో తడిస్తే అవి రంగు మారుతాయి. కాబట్టి వారంటీ ఉన్న ఫోన్లకు ఇవన్నీ తొలగించకపోవడమే మంచిది.
* వేరు చేయదగ్గ భాగాలన్నీ తీసేసిన ఆ తరువాత పొడిగా ఉన్న టవల్ తో ఈ భాగాలను, ఫోన్ ను తుడవాలి. ఆ తరువాత కూడా ఫోన్ లోపలి భాగంలో ఉన్న తడిని పోగొట్టడానికి చిన్నపాటి టెక్నిక్ వాడొచ్చు. బియ్యం ఉండే సంచిలో తడిసిన ఫోన్ ను ఉంచడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. చుట్టూ ఉన్న తేమను పీల్చుకునే స్వభావం బియ్యానికి ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్ కొంత ఉపయోగపడుతుంది.
* అందుబాటులో ఉంటే సిలికా జెల్స్ కూడా ఉపయోగించవచ్చు. ఎలక్ర్టానిక్ వస్తువులతో పాటు ఇవి వస్తుంటాయి. చిన్నచిన్న సంచుల్లో వీటిని నింపి గాడ్జెట్ ప్యాకెట్లలో ఉంచుతారు. ఇలాంటివి ఉంటే వాటి మధ్య ఫోన్ ను ఉంచడం వల్ల కూఢా అవి కొంతమేర తేమను పీలుస్తాయి.
* అలా కొన్ని గంటలు బియ్యం, లేదా సిలికా జెల్స్ మధ్య ఉంచి ఆ తరువాత తీసి అన్ని భాగాలూ అమర్చి ఫోన్ ఆన్ చేయాలి. పనిచేయడానికి చాలావరకు అవకాశం ఉంటుంది. కానీ... పూర్తిగా డివైజ్ లోపల వరకు నీళ్లు వెళ్తే మాత్రం ఈ ప్రయత్నాలేమీ ఫలించకపోవచ్చు. అప్పుడు సర్వీసు సెంటర్ కో, నిపుణుల వద్దకో తీసుకెళ్లాల్సిందే.

జన రంజకమైన వార్తలు