ఇప్పుడంటే ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది కాబట్టి ఏదైనా విషయాన్ని రాతపూర్వకంగా తెలియపరచాలంటే మెయిల్ వాడుకుంటున్నాం. విషయం కొద్దిగా చిన్నదైతే వాట్సాప్, మెసేజ్‌లు కూడా ఉన్నాయి. కానీ ఒకప్పుడు రాతపూర్వక సమాచారం పంపాలంటే ఫ్యాక్స్ మాత్రమే ఆధారం. ఇప్పటికీ చాలా కంపెనీలు, సంస్థలు ఫ్యాక్స్‌నే నమ్ముతాయి. ఎందుకంటే ఫోన్ నెంబర్‌లాగే ఫ్యాక్స్‌కు కూడా ఒక నెంబర్ ఉంటుంది. కాబట్టి కంపెనీ ఫ్యాక్స్ నెంబర్ నుంచి ఫ్యాక్స్ వస్తే అది నమ్మదగిందని వాళ్ల ఉద్దేశం. అయితే రోజులు మారాయి కాబట్టి ఫ్యాక్స్‌ను ఫ్యాక్స్ మిషన్ నుంచే పంపాలని రూలేం లేదు. మీ పీసీ లేదా ఫోన్ నుంచి జీమెయిల్ ద్వారా కూడా ఫ్యాక్స్ చేయొచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
ఫ్యాక్స్ ప్రొవైడర్లను సెలెక్ట్ చేసుకోండి
జీమెయిల్ ద్వారా ఫోన్ లేదా పీసీ నుండి ఫ్యాక్స్ పంపించవచ్చు. అయితే జీమెయిల్ ఈ సర్వీస్‌ను నేరుగా ఇవ్వలేదు. ఇందుకోసం ఈఫ్యాక్స్ (eFax), మై ఫ్యాక్స్ (MyFax) లాంటి ఫ్యాక్స్ ప్రొవైడర్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఈఫ్యాక్స్‌లో 30 రోజుల ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఈ 30 రోజులు ఎన్ని ఫ్యాక్స్‌లయినా ఫ్రీగా పంపుకోవచ్చు. మైఫ్యాక్స్‌లో అయితే నెలకు 10 పేజీల వరకు ఫ్యాక్స్ ఉచితంగా పంపొచ్చు. ఇంకా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కావాలంటే RingCentral Faxలాంటి సర్వీసులున్నాయి.
ఎలా పంపాలి?
1. మీ జీమెయిల్ ఓపెన్ చేయండి. ఫైల్‌ను ఈమెయిల్‌కు చేసినట్లే అటాచ్ చేయండి. మెయిల్ బాడీ, సబ్జెక్ట్ వివరాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి.
2. రిసిపెంట్ అడ్రస్ దగ్గర మామూలుగా ఈమెయిల్ ఐడీ ఇస్తాం కదా.. ఆ ప్లేస్‌లో ఫ్యాక్స్ నెంబర్, కంపెనీ పేరు రాయాలి. ఉదాహరణకు 912345678@companyfax.com. ఇలా ఉంటుంది.
3. ఫ్యాక్స్‌ను డైరెక్ట్‌గా పంపడానికి, లేదా రిసీవ్ చేసుకోవడానికి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.