మీ వ్యాపారం నుంచి లేదా ఇంటి నుంచి దూరంగా ఏదైనా పనిమీదగానీ, వెకేషన్‌కు గానీ ఎక్కువ రోజులు బయటికి వెళ్లినప్పుడు మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెడితే బాగుండును అనిపించిందా? ఎందుకంటే అప్పుడే మీరు బ్రాడ్‌బ్యాండ్ వాడకపోయినా ఛార్జిలు కట్టే బాధ తప్పుతుంది. కొన్ని లోకల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లు మీరు ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు ఊళ్లో ఉండడం లేదు. ఆ రోజుల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను తీసేయండి. తర్వాత ఆ పిరియడ్‌ను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటామంటే ఒప్పుకుంటారు. కానీ పెద్ద కంపెనీల బ్రాడ్‌బ్యాండ్ వాడుతుంటే అలాంటి అవకాశం ఉండదు. అలాగే ఉంచేస్తే వాడకపోయినా బిల్ కట్టాలి. కనెక్షన్ తీసేస్తే మళ్లీ డిపాజిట్, ఇన్‌స్టాలేషన్ ఛార్జిలు, ఇదంతా తలనొప్పి. అందుకే ఎయిర్‌టెల్ ఇలా బ్రాడ్‌బ్యాండ్ వాడని యూజర్లకు సేఫ్ కస్టడీ (Safe Custody) అనే ఆప్షన్ తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లు తమ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను తాత్కాలికంగా డిజేబుల్ చేసుకోవచ్చు. మీరు తిరిగొచ్చాక మెసేజ్ పెడితే చాలు తిరిగి యాక్టివేట్ చేసేస్తారు. ఇలా తాత్కాలికంగా సేఫ్ కస్టడీలో ఉంచినందుకు కొంత ఛార్జి తీసుకుంటారు. అంతే తప్ప నెలల తరబడి బిల్లు బాదుడు ఉండదు.
రెండు ఆప్షన్లు
ఎయిర్‌టెల్ సేఫ్ కస్టడీకి రెండు ఆప్షన్లు తీసుకొచ్చింది.
1) 200 రూపాయల ఛార్జిలు+ టాక్స్ కడితే నెలపాటు మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను సేఫ్ కస్టడీలో పెడుతుంది. ఈ నెల గడవగానే మళ్లీ ఆటోమేటిగ్గా సేఫ్ కస్టడీ పిరియడ్ స్టార్ట్ చేసేస్తుంది. అంటే మరో 200 రూపాయలు + టాక్స్‌లు కట్టాలి. ఈ ఆప్షన్‌లో మీరు ఈ సేఫ్ కస్టడీని డిజేబుల్ చేసేవరకు ఇలా ప్రతి నెలా ఆటోమేటిగ్గా సేఫ్ కస్టడీ ఆటో రెన్యువల్ అయిపోతోంది.
2)550 రూపాయలు+ టాక్స్ కడితే 90 రోజులపాటు మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను సేఫ్ కస్టడీలో పెడుతుంది. ఈ 90 రోజులు పూర్తవగానే ఆటోమేటిగ్గా మీ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అమల్లోకి వచ్చేస్తుంది. అంటే అప్పటి నుంచి మీకు నెలవారీ బిల్ వచ్చేస్తుంది. 3 నెలలు మీకు బ్రాడ్‌బ్యాండ్ అవసరం లేదనుకుంటే ఇది బెటర్ ఆప్షన్.
121కి కాల్ చేస్తే యాక్టివేషన్
* ఈ సేఫ్ కస్టడీని అనేబుల్ చేసుకోవాలంటే కస్టమర్ కేర్ నెంబర్ 121కి కాల్ చేసి యాక్టివేట్ చేయమని అడగాలి. 4 గంటల్లో యాక్టివేట్ అవుతుంది. డీయాక్టివేషన్‌కి కూడా ఇదే ప్రాసెస్.
* సేఫ్ కస్టడీలో ఉన్నంత కాలం మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ మీద నెట్ మాత్రమే కాదు వాయిస్ కాల్స్ కూడా వాడుకోలేరు. అన్ని రోజులూ మీ కనెక్షన్ ఇన్ యాక్టివ్‌గా ఉంటుంది.