ఫేస్‌బుక్ ఇప్పుడు తన న్యూస్‌ఫీడ్, వర్చువల్ రియాల్టీ (VR) హెడ్‌సెట్స్‌లో 3డి ఫొటోలను సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి మే నెలలో తమ F8 డెవలపర్ కాన్‌నరెన్స్ సందర్భంగా ఈ ప్రకటన చేసినప్పటికీ అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. రాబోయే కొద్ది వారాల్లోనే ప్రతి ఒక్కరూ 3డి ఫొటోలను క్రియేట్, షేర్ చేసుకునే అవకాశం లభిస్తుందని తన బ్లాగ్‌స్పాట్ పోస్ట్‌లో తెలిపింది. “సబ్జెక్ట్, దాని ముందువెనుకల దూరాన్ని బంధించగల సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఫొటో తీసే దృశ్యాలలో డెప్త్, మూవ్‌మెంట్‌లతో జీవం తొణికిసలాడుతుంది” అని అందులో వివరించింది.
ఫేస్‌బుక్ 3డి ఫొటో అంటే ఏమిటి?
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్.. దీని సాయంతో వినియోగదారులు 3డి ఫొటోలను ఐఫోన్, ఇతర స్మార్ట్ ఫోన్లలోని వెనుకభాగపు జంట కెమెరాల పోర్ట్రెయిట్ మోడ్‌ను వాడుకునే న్యూస్‌ఫీడ్, వి.ఆర్.హెడ్‌సెట్స్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. ప్రాథమికంగా మీ 2డి ఫొటోలను 3Dలో చూపడానికి ఫేస్‌బుక్ ఈ పోర్ట్రయిట్ మోడ్‌ను వాడుకుంటుంది. ఇందులో భాగంగా ఫొటోలోని సబ్జెక్ట్, దాని ముందువెనుక భాగాల మధ్య డెప్త్ సమాచారాన్ని విశ్లేషిస్తుంది.
ఫేస్‌బుక్ 3డి ఫొటోను చూడటం ఎలా?
ఫేస్‌బుక్ వాడకందారులు ప్రతి ఒక్కరూ 3డి ఫొటోలను క్రియేట్ చేసుకోవడంతోపాటు తమ న్యూస్‌ఫీడ్‌లో షేర్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి 3డి ఫొటోలను “Oculus Browser on Oculus Go or Firefox on Oculus Rift”లను వాడుకుంటూ VRలో చూసుకోవచ్చు. ఇక ఫోన్ నుంచి 3డి ఫొటోను చూడాలంటే మీ ఫోన్‌ను స్క్రోల్ లేదా టిల్ట్ చేయడంద్వారా దాని పర్‌స్పెక్టివ్‌ను మార్చుకోవచ్చు.
ఫేస్‌బుక్‌లో 3డి ఫొటోల క్రియేషన, షేరింగ్ ఎలా?
ఫేస్‌బుక్ 3డి ఫొటోలను వాడుకోవాలంటే మీవద్ద iPhone 7 Plus, iPhone 8 Plus, iPhone XS లేదా iPhone XS Maxలలో ఏదో ఒకటి ఉండాలి. అయితే, ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి 3డి ఫొటో ఫీచర్‌ను పొందాలంటే ఆండ్రాయిడ్‌తో పనిచేసే Samsung Galaxy Note 9 లేదా LG V35లాంటి అత్యాధునిక (వెనుక భాగంలో డ్యుయెల్ కెమెరాగల) స్మార్ట్ ఫోన్లుండాలని “The Verge” తెలిపింది.
క్రియేట్ చేయండి... షేర్ చేయండి
ఫేస్‌బుక్‌లో 3డి ఫొటోలను క్రియేట్, షేర్ చేసుకోవాలంటే అధికారిక ఫేస్‌బుక్ యాప్‌ద్వారా కొత్త ఫేస్‌బుక్ పోస్ట్ సృష్టించండి. మరిన్ని ఆప్షన్ల కోసం కుడివైపు కనిపించే మూడు చుక్కలమీద ట్యాప్ చేయండి. తర్వాత కనిపించే మెనూ నుంచి 3D Photo ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇప్పుడు ఐఫోన్ గ్యాలరీ సెక్షన్‌లోకి వెళ్లడానికి దానిపై క్లిక్ చేయండి. అక్కడ మీ ఐఫోన్ పోర్ట్రెయిట్ మోడ్‌తో తీసిన ఫొటోను ఎంచుకోండి. దాని ప్రివ్యూ చూసుకోండి. అంతే... ఇక మీ ఫేస్‌బుక్ 3డి ఫొటో క్రియేట్ చేయడానికి అంతా సిద్ధమైనట్టే. ఇక మీరు తెలుసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలేమిటంటే... ఉత్తమ ఫలితాల కోసం మీరు ఫోన్‌లో బంధించబోయే సబ్జెక్ట్ 3 నుంచి 4 అడుగుల దూరంలో ఉండాలి. అలాగే మీరు తీయబోయే దృశ్యాలు మల్టిపుల్ డెప్త్ లేయర్లలో (ఉదాహరణకు.. మీ కుటుంబం పూలతోటలో నిలుచున్నట్లు) ఉండేలాగా ప్రయత్నించాలి.