ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై ఫోన్ కాల్స్‌ను రికార్డు చేసి, వాటిని టెక్స్ట్‌గా మార్చడం ఎలాగో తెలుసుకుందామా! ఇందుకోసం ఉచిత యాప్ ‘‘ఆటర్ వాయిస్ నోట్స్’’ (Otter Voice Notes) అందుబాటులో ఉంది. ఇది ఫోన్‌కాల్‌ను రికార్డు చేయడంతోపాటు ప్రతి మాటనూ అప్పటికప్పుడే టెక్స్ట్ రూపంలోకి మార్చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా... మీ ఫోన్‌లో ఆడియో రికార్డింగ్ ఆన్ చేశాక కాల్ చేయడమే. మీరు మాట్లాడే ప్రతి మాటనూ ఈ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రికార్డ్ చేస్తుంది. అంతేకాదు.. మాట్లాడే సమయంలోనే ఆ సంభాషణ టెక్స్ట్ రూపంలోకి మారిపోతూ స్క్రీన్‌పై టైమ్‌స్టాంప్‌తోపాటు పాప్అప్ అవూతుంటుంది. మార్పిడిలో కచ్చితత్వం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.
మొదట మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ‘‘ఆటర్ వాయిస్ నోట్స్’’ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ను ఓపెన్ చేసి, మీ ఈ-మెయిల్ లేదా గూగుల్ అకౌంట్‌తో సైన్అప్ చేయండి. మీకిప్పుడు మెయిన్ స్క్రీన్, దాని దిగువన ‘రికార్డ్’ బటన్ కనిపిస్తాయి. ఆడియో రికార్డింగ్ కోసం దాన్ని ట్యాప్‌చేస్తే ఖాళీ స్క్రీన్, దాని ఎగువభాగంలో రికార్డ్ చేయబోయే ఆడియోకు పేరు నమోదు చేసే ఆప్షన్ ప్రత్యక్షమవుతాయి. ఆ ప్రకారం పేరు పెట్టాక యాప్‌ను మినిమైజ్ చేసి, ఎవరికైనా కాల్ చేయండి. అలా కాల్ చేసిన వెంటనే మీ సంభాషణలో వినిపించే ప్రతి మాటనూ ‘ఆటర్ వాయిస్ నోట్స్’ ఒకవైపు బ్యాక్‌గ్రౌండ్‌లో రికార్డ్ చేస్తూ మరోవైపు టెక్స్ట్‌గా మార్చేస్తూంటుంది. అయితే, సంభాషణ సమయంలో ఇతరత్రా శబ్దాలేవీ లేకుండా చూసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది.
కాల్ కొనసాగుతుండగానే యాప్‌ను మళ్లీ ఓపెన్ చేస్తే ఖాళీ స్క్రీన్ దిగువన టైమర్ కనిపిస్తూంటుంది. ఆడియో ఎన్ని నిమిషాలపాటు రికార్డయ్యేదీ అది చూపుతుంది. దాంతోపాటు మీరు, అవతలి వ్యక్తి మాట్లాడే మాటలు టెక్స్ట్ రూపంలోకి మారిపోతూ కనిపిస్తుంటాయి. కాల్ పూర్తయ్యాక యాప్ స్క్రీన్‌మీద కనిపించే ‘స్టాప్’ బటన్‌ను ట్యాప్ చేశాక రికార్డ్ చేసిన ఆడియోను, టెక్స్ట్‌గా మారిన సంభాషణను అది సేవ్ చేస్తుంది. ఇలా మీరు రికార్డ్ చేసిన అన్ని ఆడియోలనూ ‘‘హోమ్’’ ట్యాబ్‌లో చూసుకోవచ్చు... కావాలనుకుంటే దాన్ని వింటూ టెక్స్ట్‌ను సరిచూసుకోవచ్చు. సంభాషించిన వ్యక్తి పేరును యాడ్ చేసుకోవడంతోపాటు టెక్స్ట్‌ను ఎడిట్ చేసుకునే సౌలభ్యం కూడా ఇందులో ఉంది. అలాగే సారాంశంలోని కీలక పదాలు, కీలక పదాల సెర్చ్ సదుపాయాలుసహా ఆ ఫైళ్లను టెక్స్ట్ లేదా పీడీఎఫ్ రూపంలో పంపే వీలుంది.
ఈ యాప్‌లో మరిన్ని ఉపయోగకరమైన ఫీచర్లున్నాయి... యాప్ స్క్రీన్ దిగువన ‘‘కెమెరా’’ ఐకాన్ ఉంటుంది. దీని సాయంతో టెక్స్ట్ ఫైల్‌లో మధ్యమధ్యన ఫొటోలను కూడా పెట్టుకోవచ్చు. అలాగే మిత్రులు లేదా టీమ్ సభ్యులతో గ్రూపులను ఏర్పాటు చేసుకుని మీ సంభాషణలను ‘‘ఉచితంగా’’ వారితో పంచుకోవచ్చు. అయితే, ఉచిత రికార్డింగ్ సౌలభ్యం నెలకు 600 నిమిషాలేనన్నది గుర్తుంచుకోవాలి. ఒక ఆడియో రికార్డ్ చేశాక ఈ ఉచిత సమయంలో ఎంత మిగిలి ఉందో ‘హోమ్’ ట్యాబ్‌లో చూసుకోవచ్చు. ఇది నెల మారగానే ఆటోమేటిక్‌గా రీ-సెట్ అయిపోతూంటుంది.