ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థ నడిచే తీరును పరిశీలించగల ఉచిత వెబ్‌సైట్ గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. దాని పేరు ‘‘ట్రేజ్’’ (Traze). ఇదొక ఉచిత సేవా వెబ్‌సైట్... ఐరోపాలో దాదాపు అన్ని దేశాలు, అమెరికాసహా కెనడా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా దేశాలు ప్రస్తుతం దీని పరిధిలో ఉన్నాయి. ఆయా దేశాల్లో నడిచే ప్రజా రవాణా వాహనాలను ట్రేజ్ వేర్వేరు రంగులలో గుర్తిస్తుంది. కాబట్టి వాటి మధ్య వ్యత్యాసాన్ని మనం సులభంగా తెలుసుకోగలం. అలాగే ప్రతి ప్రజా రవాణా సదుపాయం రాకపోకల వేళలను కూడా ట్రేజ్ చూపుతుంది. మీరు ఆయా దేశాల్లో ప్రజా రవాణాను విస్తృతంగా వాడేవారైతే ట్రేజ్ మీకు ఎంతో సౌలభ్యకరమే అవుతుంది. ఇందులో ప్రజా రవాణా సాధనం ఏ సమయంలో.. ఎక్కడుందో కచ్చితంగా తెలుస్తుంది గనుక మీరు తర్వాత వెళ్లాలనుకున్న ప్రదేశానికి ప్రయాణాన్ని ఖరారు చేసుకోవచ్చు.
ప్రజా రవాణా వాహనాల కదలికలను అప్పటికప్పుడు చూసుకోండి
ఈ వెబ్‌సైట్‌లో ప్రతి వాహనానికీ ఒక మూలన చిన్న టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. అందులో ఎంత ఆలస్యంగా నడుస్తోంది లేదా ముందుగానే వస్తోందీ కూడా తెలుస్తుంది. ఆయా వాహనాల్లో వీల్‌చైర్‌తో ఎక్కే వీలుందో/లేదో కూడా ట్రేజ్ చూపుతుంది. ఒక వాహనం పూర్తి రాకపోకల సమయాలను తెలుసుకోవాలంటే దాని బొమ్మపై క్లిక్ చేయాలి. దీంతోపాటు అది ఏయే ప్రదేశాల్లో ఆగుతుందో... అక్కడికి ఏ సమయంలో చేరుతుందో కూడా తెలుస్తుంది.
ట్రేజ్ ‘‘కను’’సన్నల్లో ఉండే వాహనాలివే
ట్రేజ్ మన చేతిలో ఉండే ఏ రకమైన ప్రజా రవాణా వాహనాన్నయినా మనం వెంటాడవచ్చు. సైడ్ ప్యానల్ నుంచి ఒకటికన్నా ఎక్కువ రకాల వాహనాలను ఎంపిక చేసుకుని, మ్యాప్‌ద్వారా వాటిని అనుసరించవచ్చు. బస్సు, ట్రామ్, సబ్-వే, రైలు, పడవ, ట్యాక్సీ, విమానం, కేబుల్ కార్ తదితర ప్రయాణ వాహనాలన్నిటి కదలికలనూ చూడవచ్చు.
ఇతర ముఖ్యాంశాలు:
ట్రేజ్‌లో ఓ ‘‘టైమ్ మెషీన్’’ ఫీచర్ ఉంది. దీని తోడ్పాటుతో ఏదైనా వాహనం నడిచే ప్రదేశం, సమయం, వేగం తదితరాలను నిర్ణీత తేదీ, సమయం లేదా గతంలో దాని ప్రయాణ చరిత్రను కూడా గమనించవచ్చు. మనం నిర్దేశించిన ముందు తేదీన సదరు వాహనం ఏ ప్రాంతంలో, ఏ సమయాన ఉంటుందో కూడా ట్రేజ్‌లోని ఈ ఫీచర్ అంచనా వేయగలదు. అంతేకాకుండా సాధారణ దృష్టి కోణం (2D) నుంచి త్రికోణ దృష్టితోనూ చూడవచ్చు. సాధారణ 2డి దృష్టి కోణంలో అది వాహనాలను పైనుంచి చూపగలదు. అదే త్రీడీ అయితే, ఆకాశంలోని పక్షి చూసినరీతిలో చూడవచ్చు. ట్రేజ్‌లో రాత్రివేళ వాహనాలను పసిగట్టగల పరిజ్ఞానం కూడా ఉంది. దీని సాయంతో అది మ్యాప్‌ను చీకటి చేసి, ప్రతి వాహనంపైకి హెడ్‌లైట్ ఫోకస్ చేసిన రీతిలో చూపుతుంది. ఆ విధంగా ట్రేజ్ మీ ప్రయాణాన్ని కాలంతో పరుగుతీసేలా చేయగలదన్న మాట!