తెలియని రూట్‌లో ప్రయాణం చేయాలంటే దారి వెంట వెళ్లేవారిని అడుగుతూ రూట్ కనుక్కుని వెళ్లడం పాత పద్ధతి. స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ పెరిగాక, ఇంటర్నెట్ చౌకగా దొరకడం మొదలయ్యాక ఎక్కువ మంది గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారు. మ్యాప్ యాప్ ఓపెన్ చేసి మీరున్న లొకేషన్, గమ్యస్థానం ఎంటర్ చేస్తే ఎలా వెళ్లాలి? ఎటు వెళితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది? ఏ రూట్‌లో వెళితే మీ గమ్యస్థానం ఎంత దూరంలో ఉంటుంది? ఎంత సమయంలో చేరుకోవచ్చో అంచనా వేసి చెబుతుంది. అసలు ఈ గూగుల్ మ్యాప్స్ రియల్ టైమ్ ట్రాఫిక్‌ను ఎలా చూపించగులుగుతుంది? ఆ రూట్‌లో ఉన్న ట్రాఫిక్‌ను ఎలా అంచనా వేస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ ఆర్టికల్.
మూడు లైన్ల కథేంటి?
గూగుల్ మ్యాప్స్‌లో మూడు రంగుల్లో మూడు లైన్లు ఉంటాయి. వాటి అర్థమేమిటంటే..
రెడ్‌లైన్: ఈ రూట్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని అర్ధం. అంటే ఈ రూట్‌లో వెళితే మీ గమ్యస్థానానికి చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఆరెంజ్ లైన్: మీడియం ట్రాఫిక్ ఉందని అర్థం. అంటే వాహనాల రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి గమ్యానికి కరెక్ట్ టైమ్‌కు చేరుకోగలుతారు.
గ్రే లైన్: ప‌్రత్యామ్నాయ మార్గం. ఈ రూట్‌లో వెళితే గమ్యానికి త్వరగా చేరుకోవచ్చు.
రియల్ టైమ్ ట్రాఫిక్‌ను ఎలా లెక్కేస్తుంది?
గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లొకేషన్ సెట్ చేసుకుంటారు. అంటే మీరున్న లొకేషన్‌ను డిఫాల్ట్‌గా పెడతారు కదా. అదంతా గూగుల్ క్లౌడ్‌లో స్టోర్ అవుతుంది. మీరు వెళుతున్న రూట్‌లో మీ డివైస్‌కున్న వైఫై కనెక్టివిటీ లేదా మీ మొబైల్ డేటాను ఇచ్చే సెల్ టవర్ ఆధారంగా మీ లొకేషన్‌ను, మీ ప్రయాణాన్ని గూగుల్ ట్రేస్ అవుట్ చేస్తుంది. అంటే మీరు లేదా మీలాగే అంతకు ముందు వెళుతున్న వారు ఎవరైనా గూగుల్ మ్యాప్ ఆన్ చేయగానే లొకేషన్‌ను ట్రేస్ చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మీలాంటి యూజర్ల ప్రయాణం ద్వారా ఇచ్చే డేటానే యూజర్లకు గూగుల్ ఉపయోగించుకుంటుందన్నమాట. ఈ డేటా అంతా గూగుల్‌లో ఓ బిట్ రూపంలో స్టోర్ అవుతుంది. అలా ఆ రూట్‌లో ఉన్న రియల్ టైమ్ ట్రాఫిక్‌ను గూగుల్ అంచనా వేస్తుంది.
మీరు సేఫ్
మీరు లేదా మీలాంటి యూజర్లు గూగుల్ మ్యాప్ ఆన్ చేయగానే డేటాను గూగుల్ క్యాప్చర్ చేసి బిట్ రూపంలో క్లౌడ్‌లో స్టోర్ చేస్తుందని చెప్పుకున్నాం కదా.. మన డేటాను గూగుల్ అందరికీ షేర్ చేస్తుందని భయపడక్కర్లేదు. మీ డేటాను కేవలం ఆ రూట్లో ట్రాఫిక్ ఎలా ఉంది? ఫలానా ప్లేస్ మీకు ఎంత దూరంలో ఉంది? ఏ లైన్లో వెళితే ఎంతదూరంలో చేరుకోగలమో చూపిస్తుంది. అంతే తప్ప ఫలానా యూజర్, ఫలానా రూట్‌లో వెళుతున్నారని చూపించదు. ఓవరాల్‌గా ఆ రూట్లో ట్రాఫిక్ వివరాలు గూగుల్ యూజర్లకు అందుబాటులో ఉంచుతుంది తప్ప ఓ పర్సన్ ప్రయాణ వివరాలని ఎక్కడా చూపించదు. కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారని ఎవరికీ చూపించదు. కాబట్టి మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు. ఒకవేళ మీరు వెళ్లే రూట్‌ను ఫ్రెండ్స్ లేదా ఇంట్లోవాళ్లతో షేర్ చేసుకోవాలనుకుంటే షేరింగ్ ఆప్షన్ ఉంటుంది. మీరు షేర్ చేస్తే ఆ పర్సన్‌కు మాత్రమే ఆ డేటా యాక్సెస్ అవుతుంది. ఉదాహరణకు మనం ట్రయిన్, బస్‌లో వెళ్లేటప్పుడు బస్ ఆపరేటర్ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేస్తే మనకు ఆ రూట్‌లో వాహనం ఎలా వెళుతుందో తెలుస్తుంది. దాన్ని మీరు షేర్ చేస్తే మీ వాళ్లు మీ లొకేషన్‌ను ట్రేస్ అవుట్ చేయగలుతారంతే.