రిజర్వేషన్ చేయించుకుని ట్రయిన్ ఎక్కాలంటే నిజంగా పెద్ద ప్రాసెస్. మీకు టిక్కెట్స్ అందుబాటులో ఉంటే ఫర్వాలేదు.. కానీ వెయిటింగ్ లిస్టులో ఉంటే మీ జర్నీ అనుమానంలో పడినట్లే. ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి ప్రయాణాలను ముందే ప్లాన్ చేసుకోవాలి. రైల్వే శాఖ కూడా నాలుగు నెలల ముందే మన గమ్య స్థానాలకు టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. మనం ముందుగానే బుక్ చేసుకుంటే కచ్చితంగా మనకు సీట్ దొరికే అవకాశం ఉంటుంది. మరి వచ్చే నాలుగు నెలల్లో మనకు ట్రయిన్ సీట్లు అందుబాటులో ఉన్నాయో లేదా చెక్ చేయాలంటే ఎలా?
రైల్ కాల్ యాప్
గతంలో రైల్వేస్ ముందుగా రిజ్వేషన్ చేయించుకోవాలంటే 60 రోజుల ముందు మాత్రమే అవకాశం ఉండేది. అయితే ప్రయాణీకుల సౌకర్యం కోసం రైల్వే శాఖ 120 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేయించుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే రాబోయే రోజుల్లో మన గమ్యస్థానానికి వెళ్లడానికి ట్రయిన్స్ ఉన్నాయి.. టిక్కెట్లు దొరుకుతాయా అన్న విషయం ఎలా చెక్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ విషయాన్ని చెక్ చేయడం చాలా సులభం. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి రైల్ కాల్ అవలబిలిటీ క్యాలెండర్ ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీకు వచ్చే నాలుగు నెలల్లో భారత్‌లో ప్రయాణించే అన్ని రైళ్లకు సంబంధించిన సీట్ల అందుబాటును చూపించడమే ఈ యాప్ ప్రత్యేకత. అయితే ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోవాలంటే కొన్ని మార్గాలున్నాయి.
ఎలా వాడాలంటే...
ముందుగా ప్లే స్టోర్ నుంచి రైల్ కాల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్‌కు వెళ్లాలనుకుంటున్నారో ఆ వివరాలు అందులో పేర్కొనాలి. ఆ తర్వాత నాలుగు నెలల క్యాలెండర్ బటన్ క్లిక్ చేయాలి. మీకు నాలుగు నెలల ట్రయిన్ అవలబిలిటీ క్యాలెండర్ ఒక కాలమ్‌లో వస్తుంది. క్విక్ సర్కిల్ మీద మరింత సమాచారం కోసం ట్యాప్ చేయాలి. అంటే కొన్ని ప్రత్యేక ట్రయిన్స్ కోసం ఫిల్టర్ ఆప్షన్ వాడుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఫలానా ట్రయిన్ మీకు సులభంగా దొరికేస్తుంది. మీ జర్ని కూడా సులభం అయిపోతుంది. తత్కాల్ అందుబాటు కూడా మీకు ఈ ఫిల్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. మీకు నచ్చిన సీట్‌ను మీకు నచ్చిన తేదీల్లో బుక్ చేసుకోవచ్చు.