మీరు గూగుల్ అకౌంట్ వాడుతున్నారు... ఆ అకౌంట్‌ని డిలీట్ చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ డిలీట్ కొట్టేస్తారు.. కానీ ఇలా చేయడం వల్ల గూగుల్‌తో మనకు సంబంధం తెగిపోయినట్టేనా! ఎంత మాత్రం కాదు!! ఎందుకంటే గూగుల్ అకౌంట్ అంటే కేవలం జీమెయిల్ మాత్రమే కాదు గూగుల్ డ్రైవ్, గూగుల్ ఇమేజెస్, గూగుల్ ఫైల్స్ ఇలా చాలా ఉంటాయి. మన ఇన్ఫర్మేషన్ అంతా వీటిలో నిక్షిప్తమై ఉంటుంది. అకౌంట్ డిలీట్ చేసినంత మాత్రాన ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పోతుందని అనుకుంటే పొరపాటే. మరి మన ఇన్ఫర్మేషన్‌తో సహా అంటే గూగుల్ డేటాతో సహా డిలీట్ చేయడం ఎలా?
ఏం చేయాలంటే..
గూగుల్ అకౌంట్‌ని డిలీట్ చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. అయితే ఈ అకౌంట్‌ని డిలీట్ చేసే ముందు చాలా కేటగిరిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని కూడా డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గూగుల్ అకౌంట్లోకి వెళ్లి డేటా, పర్సనలైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. గెట్ స్టార్టడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ఆ తర్వాత వెబ్ సెర్చ్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. మేనేజ్ వెబ్ అండ్ యాప్ యాక్టివిటీని ఎంచుకుని డిలీట్ యాక్టివిటీ బై మీద క్లిక్ చేసి ఆల్ టైమ్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ వెబ్‌లో ఉన్నసమాచారం మొత్తం ఎరైజ్ అయిపోతుంది.
గూగుల్ లొకేషన్ హిస్టరీ
వెబ్ యాక్టివీటి మాత్రమే కాదు గూగుల్ లొకేషన్ హిస్టరీ కూడా మీరు డిలీట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కడెక్కడికి వెళ్లారో మీ మొబైల్‌లోని మ్యాప్ వివరాలు అందిస్తుంది. అందుకే మేనేజ్ లొకేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత డిలీట్ ఆల్ లొకేషన్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అలాగే వాయిస్, ఆడియో యాక్టివీటి కూడా ఎరేజ్ చేసుకోవాలి. ఇందుకోసం గూగుల్ అకౌంట్లో మేనేజ్ వాయిస్, ఆడియో యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. మెనూ డిలీట్ ఆప్షన్ ద్వారా ఎరేజ్ చేసుకోవాలి. యూట్యూబ్ హిస్టరీని కూడా సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిలీట్ చేయాలి.